గోంగూర పులుసు కూర

గోంగూర పులుసు కూర.

గోంగూర పండు మిరపకాయలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది గుంటూరు జిల్లానే .

దేశ వ్యాప్తంగా అంత ప్రాచుర్యం పొందాయి ఈ రెండు .

పండు మిరపకాయలు , గోంగూర ఏడాది నిల్వ పచ్చళ్ళూ రంగు మారకుండా , చెక్కు చెదర కుండా ఏడాది పొడవునా అలానే ఉంటాయి .

ఇప్పుడు గోంగూర పులుసు కూర తయారు చేయడం గురించి తెలుసు కుందాం.

గోంగూర లో రెండు రకములు .

ఒకటి మంచి గోంగూర లేక ధనాస గోంగూర .

రెండు ఎర్ర గోంగూర లేక కొండ గోంగూర .

ధనాస కూర పులుపు తక్కువగా ఉంటుంది .

కొండ గోంగూర చాలా పుల్లగా ఉంటుంది .

గుంటూరు ప్రాంతమంతా రెండు రకములైన గోంగూర ఏడాది పొడవునా దొరుకుతాయి .

చాలా మంది పచ్చడైనా , పులుసు కూరైనా ఆ రకం ఒక కట్ట , ఈ రకం ఒక కట్ట కలిపి
రెండూ కలిపి చేసుకుంటారు.

ఒక రకం తోనే చేసుకునే పక్షంలో ఉప్పు , కారాలు ఆకు లోని పులుపును బట్టి మారుతుంటాయి .

ఏడాది నిల్వ పచ్చడి పచ్చళ్ళ గోంగూర తోనే పెట్టుకున్నా , ఆకు చెట్టునే బాగా ముదర నిస్తారు.
లేని పక్షంలో ఏడాది పచ్చడి నిల్వ ఉండదు .

Related:   దొండకాయ ముక్కల ఊరగాయ

ఇప్పుడు ఎర్ర గోంగూర / కొండ గోంగూర / పుల్ల గోంగూర తో పులుసు కూర.
**********************************************
ఇవి కట్టలుగా దొరుకుతాయి .

కట్ట సైజును బట్టి ఓ రెండు లేదా మూడు కట్టలు తీసుకోవాలి .

ఆ కట్టల ఆకు అంతా వలిచి శుభ్రంగా కడిగి ఇంట్లోనే నీడన ఒక గంట సేపు ఆర పెట్టుకోవాలి.

తర్వాత ఆకును కట్ చేసుకోవాలి .

మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి .

ఆరు పచ్చి మిరపకాయలు నిలువుగా కట్ చేసుకోవాలి .

పావు కప్పు పచ్చి శనగపప్పు ఒక కుక్కర్ గిన్నెలో తగినన్ని నీళ్ళు
పోసి , మరో కుక్కర్ గిన్నెలో తరిగిన గోంగూర లో పావు గ్లాసు నీళ్ళు పోసి
రెండు గిన్నెలు కుక్కర్ లో పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి .

పులుపు తగిలితే శనగపప్పు సరిగ్గా ఉడకదు .

అందుకని శనగపప్పు విడిగా ఒక గిన్నెలో ,

గోంగూర కూడా మెత్తగా ఉడకాలంటే ఏమీ వేయకుండా వేరే గిన్నెలో కుక్కర్ లో పెట్టుకోవాలి .

Related:   చాకొలెట్‌ కేక్‌

అందువలన విడి విడిగా ఉడక బెట్టు కోవాలి .

ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి నాలుగు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే , వరుసగా
మూడు ఎండు మిరప కాయల ముక్కలు , రెండు స్పూన్లు శనగపప్పు , రెండు స్పూన్లు మినపప్పు , పావు స్పూను జీలకర్ర , అర స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ , కొద్దిగా కరివేపాకు వేసి పోపు వేగగానే తరిగి ఉంచిన ఉల్లిపాయల ముక్కలు , కొద్దిగా పసుపు , తగినంత ఉప్పు , స్పూను కారం వేసి మూత పెట్టి , మూడు వంతులు ఉల్లిపాయలు మగ్గగానే , ముందు ఉడికిన గోంగూర ఉడికిన నీళ్ళతో సహా అందులో వేయాలి .

వెంటనే ఉడికిన పచ్చి శనగపప్పు కూడా ఉడికిన నీళ్ళతో అందులో సహా వేసి మొత్తము మరో పది నిముషాలు అన్నీ కలిసేలా ఉడక నిచ్చి , ఇంట్లో ఉంటే చిన్న నిమ్మకాయంత వెన్న అందులో వేసి , కాసేపాగి దింపుకొని వేరే గిన్నె లోకి తీసుకోవాలి.

శనగపప్పు మరియు శనగపప్పు ఉడికిన నీళ్ళు పోస్తాము కనుక పులుసు కూర చిక్కగానే ఉంటుంది .

పల్చగా ఉందని అన్పిస్తే ఒక అర గ్లాసు నీళ్ళలో ఒకస్పూను బియ్యపు పిండి వేసి బాగా కలిపి పులుసు కూర దింపబోయే అయిదు నిముషాల ముందు వేసి , పులుసు కూర దగ్గర పడగానే దింపుకోండి .

Related:   బెండ కాయల పళంగా  కూర

అవసరమయితేనే బియ్యపు పిండి నీళ్ళు పోయండి .

పులుసు కూర చిక్కగా ఉంటే పిండి నీళ్ళు అవసరం ఉండదు .

ఈ పులుసు కూర చేసిన రోజు కంటే మరుసటి రోజు చాలా రుచిగా ఉంటుంది .

ఈ పులుసు కూర అన్నం లోకి , మరియు చపాతీల లోకి బాగుంటుంది .

ఫోటో : —- ఈ రోజు మేము భోజనము లోకి చేసుకున్న గోంగూర పులుసు కూర .

రెండు రకముల కూరలు అది సగం ఇది సగం కూర వేసి చేసుకున్నాము .

ఈ రోజు చిక్కగా వచ్చింది అందువలన పిండి పెట్టుకోలేదు .

చాలా బాగా కుదిరింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *