తెలుగు సినిమా చరిత్ర (1949-1984)

0
238

తెలుగు సినిమా చరిత్ర (1949-1984)

1949
• ఈ ఏడాది 6 చిత్రాలు విడుదలయ్యాయి. కీలు గుర్రం, రక్ష రేఖ, లైలా మజ్ఞు, ధర్మాంగధ, గుణ సుందరి కధ మరియు మన దేశం.

• ఎల్ వి ప్రసాద్ దర్శకత్వంలో ఎన్ టి ఆర్ ఇనస్పెక్టర్ గా మన దేశం (24-11-1949) చిత్రం ద్వారా ఓ చిన్న పాత్రలో పరిచయమయ్యారు

1950
• 17 సినిమాలు విడుదలయ్యాయి. విజయా వారి షావుకారు (7-04-1950) ఎన్ టి ఆర్ మొదటి హీరో చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విజయవాడ దుర్గా కళామందిరంలో డైరెక్టుగా శతదినోత్సవం జరుపుకుంది. సాంఘిక చిత్రాలలో సహజత్వానికీ, సాంకేతిక విలువలకూ పెద్ద పీట వేసి తెలుగు సినిమా పోకడలను మార్చింది. ఈ చిత్రం ద్వారా జానకి పరిచయమయ్యారు. ఈ ఏడాదినుండే తెలుగు సినిమా స్వర్ణ యుగం ప్రారంభమయిందని చరిత్రకారులు చెబుతారు.

• ఎన్ టి ఆర్, అక్కినేని తొలిసారి కలసి నటించిన పల్లెటూరి పిల్ల (27-04-1950) బి ఏ సుబ్బారావుగారి దర్శకత్వం లో విడుదలై విజయం సాధించింది. ఈ చిత్రంలో ఎద్దును లొంగదీసుకునే సన్నివేశంలో డూప్ ను పెడదామంటే కాదని ఆ సన్నివేశాన్ని తానే చేసి చేయి విరగొట్టుకున్న తెంపరితనం ఎన్ టి ఆర్ ది. దీంతో అందగాడే కాదు గుండె కలవాడిగా పరిశ్రమలో అందరి దృష్టిలో ఆయన పడ్డారు. పల్లెటూరి పిల్ల 10 ప్రింట్లతో విడుదలై 6 కేంద్రాలలో డైరెక్టుగా శత దినోత్సవాలు జరుపుకుని మొదటి బ్యాచ్ లో ఎక్కువ కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడ్డ చిత్రంగా రికార్డులకెక్కింది. షావుకారు విడుదలైన 20 రోజులకి పల్లెటూరి పిల్ల విడుదలయ్యింది.

• అలాగే ఆ ఇద్దరూ కలసి నటించిన ఎల్ వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సంసారం చిత్రం (29-12-1950) కూడా శత దినోత్సవాలు జరుపుకుంది.

• ఏ వి ఎం వారి జీవితం శత దినోత్సవాలు జరుపుకుంది. జీవితం చిత్రం ద్వారా వైజయంతి మాలా పరిచయమయ్యారు.

• ఎన్ టి ఆర్ నలకూబరుడిగా , రఘురామయ్య కృష్ణుడిగా, సి ఎస్ ఆర్ నారదుడిగా నటించిన మాయా రంభ (22-09-1950) ఫ్లాప్ అయ్యింది.

• హీరోగా ప్రారంభమయిన సంవత్సరంలోనే నటించిన 4 సినిమాలలో 3 శత దినోత్సవాలు (షావుకారు, పల్లెటూరు పిల్ల, సంసారం) కల్గిన హీరోగా ఎన్ టి ఆర్ సంచలనం సృష్టించారు.

• ఒకే రోజు పోటీగా విడుదలైన రెండు చిత్రాలలో అక్కినేని నటించిన శ్రీ లక్ష్మమ్మ కధ పరాజయం పొందగా, సి హెచ్ నారాయణ రావు నటించిన లక్ష్మమ్మ కధ విజయవంతమయింది.

1951
• ఈ ఏడాది 23 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి.

• అక్కినేని 5 జానపద చిత్రాలలో నటించారు. తిలోత్తమా, సౌదామిని, మాయలమారి, స్త్రీ సాహసం, మంత్రదండం.

• ఎన్ టి ఆర్ నటించిన పాతాళ భైరవి (15-03-1951) మొదటి బ్యాచ్ లో 13 ప్రింట్లతో విడుదలై 10 కేంద్రాలలో శత దినోత్సవాలు , 4 కేంద్రాలలో రజతోత్సవం, 200 రోజులాడిన తొలి తెలుగు చిత్రం గా నిలచింది. ధీరోదాత్తుడైన జానపద నాయకుడు వెండి తెరపై ఆవిష్కరించబడ్డాడు. సెకండ్ బ్యాచ్ తో అలిపి ఈ చిత్రం 32 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది.

• ఎన్ టి ఆర్, భానుమతులు తెర ముందు, దేవులపల్లి, రాజేశ్వర రావు, బి ఎన్ రెడ్డి మొదలైనవారు తెర వెనుక ఉన్న అపురూప చిత్రం మల్లీశ్వరి (20-12-1951) , నాటికీ నేటికీ కళా ఖండం గా పేరుగాంచింది. ఈ చిత్రం కూడా శత దినోత్సవం జరుపుకుంది.

• కాంతారావు, రాజనాల ప్రతిజ్ఞ చిత్రంద్వారాపరిచయమయ్యారు.

• నవ్వితే నవరత్నాలు సినిమా ద్వారా కృష్ణ కుమారి పరిచయమయ్యారు.

• శ్రీ శ్రీ, దేవులపల్లి కూడా సినిమా రంగంలో అడుగుపెట్టారు.

1952:
• ఈ ఏడాది 24 సినిమాలు విడుదలయ్యాయి.

• ఎన్ టి ఆర్ నటించిన 3 సినిమాలు (పెళ్ళి చేసి చూడు, దాసి, పల్లెటూరు) మాత్రమే శతదినోత్సవాలు , రజతోత్సవాలు జరుపుకున్నాయి.

• అక్కినేని నటించిన ఒకే సినిమా ప్రేమ పరాజయమయ్యింది.

• పెళ్ళి చేసి చూడు (29-02-1952) మొట్టమొదటిసారిగా ఎక్కువగా 11 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకొన్న తొలి సాంఘిక చిత్రంగా రజతోత్సవాలు జరుపుకుని రికార్డు సృష్టించింది.

• సాంఘిక చిత్రాలలో యుక్త వయసు నాయకులకు నాంది పలికింది. అంతవరకూ నాగయ్యవంటివారు మధ్య వయస్సు పాత్రలతో సాంఘికాలు వేయగా అక్కినేని జానపదాలలో నటించేవారు. పాతాళ భైరవి విజయంతో అక్కినేని ఆలోచనలోపడి జానపదాలనుండి తప్పుకుని కధాబలం, సాంకేతిక విలువలున్న సాంఘిక చిత్రాల వైపు ఆలోచించసాగారు.

• సావిత్రి హీరోయిన్ గా తొలిసారి నటించిన పల్లెటూరు (16-10-1952) శత దినోత్సవం జరుపుకుంది.

• లక్ష్మీ రాజ్యం వారి దాసి (26-11-1952) , విజయా వారి పెళ్ళి చేసి చూడు విజయం సాధించి రజతోత్సవాలు జరుపుకున్నాయి.

1953:
• ఈ ఏడాది 25 సినిమాలు విడుదలయ్యాయి.

• అక్కినేని తన పంధా మార్చుకుని నటించిన 28 వ చిత్రం దేవదాసు విజయవంతమయ్యింది.

• అమ్మలక్కలు (పద్మిని నాయిక) (12-03-1953) , బ్రతుకుతెరవు శత దినోత్సవాలు జరుపుకున్నాయి.

• ఎన్ ఏ టి వారి తొలి చిత్రం పిచ్చి పుల్లయ్య (17-07-1953) ప్రయోగాత్మక చిత్రంగా విమర్శకుల ప్రశంసలు పొందింది.

• భానుమతి తొలిసారి దర్శకత్వం వహించి తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఒకేసారి దేశమంతా విడుదల చేసిన చండీ రాణి చిత్రం (28-08-1953) రూపొందించారు.

• రాజ కపూర్ ప్రేమ లేఖలు సినిమా ద్వారా ఆరుద్ర పరిచయమయ్యారు.

1954:
• ఈ ఏడాది 30 సినిమాలు విడుదలయ్యాయి.

• ఎన్ టి ఆర్ 8 సినిమాలలో, అక్కినేని 4 సినిమాలలో, ఇద్దరూ కలసి ఒకచిత్రంలో నటించారు.

• అగ్గి రాముడు 7 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుని సూపర్ హిట్ అయింది.

• ఎన్ టి ఆర్ నటించిన వద్దంటే డబ్బు (19-02-1954) , రాజూ పేద (25-06-1954) , సంఘం (10-07-1954) , అగ్గి రాముడు (05-08-1954) మొత్తం 4 సినిమాలు శత దినోత్సవాలు జరుపుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు.

• పెద్ద మనుషులు, సతీ సక్కుబాయి, శత దినోత్సవాలుజరుపుకున్నాయి.

• కాళ హస్తీశ్వర మహాత్మ్యం విజయవంతమయ్యింది.

• ఎన్ ఏ టి వారి తోడు దొంగలు (15-04-1954) , వాహినీ వారి పెద్ద మనుషులు, భరణీ వారి విప్ర నారాయణ విమర్శకుల ప్రశంసలు పొందాయి.

• పరివర్తన (01-09-1954) యావరేజ్ గా నడచింది.

• చంద్రహారం (06-01-1954) , ఇద్దరు పెళ్ళాలు (06-10-1954) నిరాశ పరిచాయి.

• ఆదుర్తి, డి వి నరస రాజు పరిచయమయ్యారు.

1955:
• ఈ ఏడాది 20 సినిమాలు విడుదలయ్యాయి.

• ఎన్ టి ఆర్ , అక్కినేని చెరి 6 సినిమాలలోనూ, ఇద్దరూ కలసి 1 సినిమాలోనూ నటించారు.

• ఎన్ ఏ టి వారి జయసింహ (21-10-1955) , సారధీ వారి రోజులు మారాయి రజతోత్సవాలు జరుపుకున్నాయి.

• వాహినీ వారి బంగారు పాప ప్రశంసలు పొందింది.

• మిస్సమ్మ (12-01-1955) , రేచుక్క (25-03-1955) , విజయ గౌరి (30-06-1955) , సంతోషం (24-12-1955), అన్నపూర్ణా వారి దొంగ రాముడు, అర్ధాంగి, అనార్కలి, సంతానం, శ్రీ కృష్ణ తులాభారం శత దినోత్సవాలు జరుపుకున్నాయి.

• మిస్సమ్మ చిత్రంలో జగ్గయ్యగారి పాత్రను అక్కినేని విజయావారి దగ్గర పట్టు పట్టి నటించడం జరిగింది. మొదటి రెండు బ్యాచ్ లతో కలిపి ఈ చిత్రం 13 కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకుంది.

• సంతోషం (జమున నాయిక) హిందీలో నయా ఆద్మీగా విడుదలై రజతోత్సవం జరుపుకుంది.

• వహీదా రెహమాన్ పరిచయమయ్యారు.

• గురజాడవారి కన్యాశుల్కం (26-08-1955) విడుదలయ్యింది. ఈ సినిమా రిపీట్ రన్స్ లలో మూడుసార్లు 1983, 1986, 1993 లలో శత దినోత్సవాలు జరుపుకుని ప్రపంచ రికార్డు సృష్టించింది. చెరపకురా చెడేవు (06-07-1955) యావరేజ్ గా నడచింది.

1956:
• ఈ ఏడాది 21 సినిమాలు విడుదలయ్యాయి.

• ఎన్ టి ఆర్ 7 సినిమాలలో, అక్కినేని 2 సినిమాలలో, ఇద్దరూ కల్సి 2 సినిమాలలో నటించారు.

• జయం మనదే (04-05-1956) , గౌరీ మహాత్మ్యం (20-10-1956) , చరణ దాసి, (20-12-1956) , భలే రాముడు, ఇలవేలుపు, హరిశ్చంద్ర, నాగుల చవితి మంచి విజయం సాధించి శత దినోత్సవాలు జరుపుకున్నాయి.

• తెనాలి రామ కృష్ణ (12-01-1956), , చింతామణి (11-04-1956) , ఉమా సుందరి (19-07-1956) , చిరంజీవులు (15-08-1956) , పెంకి పెళ్ళాం (06-12-1956) కూడా ప్రజాదరణ పొందాయి.

• సొంత ఊరు (23-05-1956) చిత్రంలో ఎన్ టి ఆర్ రెండు నిముషాలు కృష్ణుడిగా కనిపిస్తారు.

1957:
• ఈ ఏడాది 27 సినిమాలు విడుదలయ్యాయి.

• ఎన్ టి ఆర్ 9 చిత్రాలలో, అక్కినేని 5 సినిమాలలో నటించారు.

• మాయాబజార్ సినిమా ద్వారా ఎన్ టి ఆర్ తొలిసారిగా పూర్తి స్థాయి శ్రీ కృష్ణ పాత్ర ధరించారు. ఆ తరువాత అనేక పౌరాణిక చిత్రాలకు ఇది శుభారంభమయింది. 27-03-1957 న విడుదలైన మాయాబజార్ 23 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుని, రజతోత్సవ చిత్రం గా ఆ ఏటి అతి పెద్ద విజయంగా సంచలనం సృష్టించింది. ఆ రోజులలో ఎన్ టి ఆర్ శ్రీ కృష్ణుని గటప్ తో ఉన్న కేలండర్లు 5 లక్షలు అధికారికంగా అమ్ముడైనట్లు నాగి రెడ్డి పలు సందర్భాలలో పేర్కొన్నారు. ఒక సినిమా నటుని బొమ్మను పత్రికలు, పోస్టర్సునుండి పూజ మందిరానికి తీసుకు వెళ్ళిన ఘనత మాయా బజార్ చిత్రానికే దక్కుతుంది.

• భాగ్య రేఖ (20-02-1957) , వీర కంకణం (16-05-1957) , వినాయక చవితి (22-08-1957) , సువర్ణ సుందరి, తోడి కోడళ్ళు, సతీ అనసూయ ఎం ఎల్ ఏ చిత్రాలు శత దినోత్సవాలు జరుపుకున్నాయి.

• భలే అమ్మాయిలు (06-09-1957) , కుటుంబ గౌరవం (07-11-1957) , సతీ సావిత్రి కూడా విజయం సాధించాయి.
• ఏడాది చివర్లో వచ్చిన పాండు రంగ మహాత్మ్యం (28-11-1957) సూపర్ హిట్ గా నిలచింది.

• అక్కినేని నటించిన 60 వ సినిమా దొంగల్లో దొర , అల్లావుద్దీన్ అద్భుత దీపం, ఎన్ టి ఆర్ నటించిన సంకల్పం (19-06-1957) , సారంగధర (01-11-1957) చిత్రాలు యావరేజ్ సినిమాలు.

• ఎస్ జానకి గాయనిగా పరిచయమయ్యారు.

• బి సరోజా దేవి తెలుగు తెరకు నటిగా పాండురంగ మహాత్మ్యం చిత్రం ద్వారా పరిచయమయ్యారు.

1958:
• ఈ ఏడాది 21 చిత్రాలు విడుదలయ్యాయి.

• ఎన్ టి ఆర్ 7 చిత్రాలలో నటించారు

• ఎన్ టి ఆర్ నటించిన ఇంటి గుట్టు (07-11-1958 విడుదల) 7 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించితే,

• మంచి మనసుకు మంచి రోజులు (15-08-1958 విడుదల) 6 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది.

• దుర్గేశనందిని, నవాబు నందిని నవలల పోలికలతో వచ్చిన రాజ నందిని (04-07-1958 విడుదల) , శోభ (01-05-1958 విడుదల) చిత్రాలు కూడా శత దినోత్సవాలు జరుపుకున్నాయి.

• అన్న తమ్ముడు (15-02-1958 విడుదల) , కార్తవరాయని కధ (18-10-1958 విడుదల) యావరేజ్ గా నడిచాయి.

• అక్కినేని నటించిన ఆడ పెత్తనం, పెళ్ళినాటి ప్రమాణాలు, శ్రీ కృష్ణ మాయ సినిమాలు ఏవరేజ్ గా నడిచాయి.

• ప్రహ్లాద చరిత్ర ఆధారంగా తీసిన చెంచు లక్ష్మి 5 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది.

• ఏ వి ఎం వారి భూ కైలాస్ చిత్రంలో (20-03-1958) ఎన్ టి ఆర్ రావణ బ్రహ్మగా నటించి పండిత పామరులను మెప్పించారు.

• 1957 లో భగవంతుడిగా (శ్రీ కృష్ణుడు, మాయా బజార్ 27-03-1957), భక్తుడిగా (పాండు రంగ మహాత్మ్యం, 28-11-1957) నటించిన ఎన్ టి ఆర్ 1958 లో నాయక (శ్రీ రాముడు, సంపూర్ణ రామాయణం తమిల్ (14-04-1958) , ప్రతి నాయక (రావణ బ్రహ్మ గా భూ కైలాస్ 20-03-1958) పాత్రలలో జీవించి కళాకారుడికి ఎల్లలు లేవని నిరూపించారు.

• ఎన్ టి ఆర్, అక్కినేని, ఎస్ వి ఆర్, జమున మొదలగువారు నటించిన భూ కైలాస్ శత దినోత్సవం జరుపుకోలేదు.

1959 :
• ఈ ఏడాది 25 సినిమాలు విడుదలయ్యాయి.

• ఎన్ టి ఆర్ 7 సినిమాలలో అక్కినేని 4 సినిమాలలో నటించారు.

• ఇల్లరికం రజతోత్సవం జరుపుకుంది.

• అప్పు చేసి పప్పు కూడు (14-01-1959) , శభాష్ రాముడు (04-09-1959) , బాల నాగమ్మ (09-10-1959), మాంగల్య బలం చిత్రాలు శత దినోత్సవాలు జరుపుకున్నాయి.

• జయ విజయ (కాంతారావు), పెళ్ళి సందడి (ఏ ఎన్ ఆర్), రేచుక్క పగటి చుక్క (ఎన్ టి ఆర్) (14-05-1959) , సతీ సుకన్య (కాంతా రావు), ఆలు మగలు (జగ్గయ్య) కూడా ప్రజాదరణ పొందాయి.

• జయభేరి మ్యూజికల్ హిట్ అయినా పరాజయం పొందింది.

• వచ్చిన కోడలు నచ్చింది (21-10-1959) , బండ రాముడు (06-11-1959) యావరేజ్ గా నడచాయి.

• హైదరాబాద్ లో సారధీ స్టూడియొస్ ప్రారంభమయింది. ఇందులో రూపొందిన తొలి చిత్రం మా ఇంటి మహా లక్ష్మి (హరనాధ్, జమున).

• శోభన్ బాబు చిన్న పాత్రలో ఎన్ టి ఆర్, జయశ్రీ అమ్మాజీ (జయ చిత్ర తల్లి) నటించిన దైవబలం (17-09-1959) చిత్రం ద్వారా పరిచయమయ్యారు.

• కైకాల సత్యనారాయణ సిపాయి కూతురు చిత్రంద్వారా హీరోగా పరిచయమయ్యారు.

1960:
• ఎన్ టి ఆర్ 8 సినిమాలలో నటించారు.

• సంక్రాంతి కానుకగా 20 ప్రింట్లతో విడుదలైన శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (09-01-1960) 16 కేంద్రాలలో వసూళ్ళ ప్రభంజనంతో ఘనంగా శత దినోత్సవాలు జరుపుకుని ఆ సంవత్సరపు సూపర్ హిట్ సినిమాగా నిలచింది.

• ఈ చిత్రానికి దాదాపు సమాంతర విజయంగా దసరా కానుకగా విడుదలైన భట్టి విక్రమార్క చిత్రం (30-09-1960) 13 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది.

Also READ:   Cafe Coffee Day बोर्ड ने एसवी रंगनाथ को बनाया अंतरिम चेयरमैन

• దీపావళి (22-09-1960) ఎన్ టి ఆర్ కు శ్రీ కృష్ణుడిగా మూడవ విజయం తెస్తూ శత దినోత్సవాలు జరుపుకుంది.

• అలాగే ఫాంటసీ చిత్రాలకు నాంది పలుకుతూ దేవాంతకుడు చిత్రం (07-07-1960) , కన్నుల్లో నీ బొమ్మ చూడు అంటూ విమల చిత్రం (11-08-1960) శత దినోత్సవాలు జరుపుకున్నాయి.

• వాహినీ వారి రాజ మకుటం (24-02-1960) విజయవంతమైన చిత్రం గా నిలిచింది.

• రాణీ రత్న ప్రభ (27-05-1960) ఏవరేజి గా నిలిచింది.

• కాడెద్దులు ఎకరం నేల (06-10-1960) ఫ్లాప్ అయింది.

• అక్కినేని నటించిన నమ్మిన బంటు, శాంతి నివాసం, మహా కవి కాళిదాసు, పెళ్ళి కానుక శత దినోత్సవాలు జరుపుకున్నాయి. అన్నపూర్ణ, అభిమానం, మా బాబు ఏవరేజ్ గా నడిచాయి.

• ఇవి కాక రేణుకాదేవి మహాత్మ్యం, శ్రీ కృష్ణ రాయబారం, నిత్య కల్యాణం పచ్చ తోరణం, సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి, ధర్మమే జయం, జగన్నాటకం, అన్నా చెల్లెలు, సమాజం, భక్త శబరి, జల్సారాయడు, కుంకుమ రేఖ, భక్త రఘునాధ్, కనకదుర్గా పూజా మహిమ, చివరకు మిగిలేది, మామకు తగ్గ అల్లుడు సినిమాలు విడుదలయ్యాయి.

1961 :
• ఎన్ టి ఆర్ 8 సినిమాలలో నటించారు .

• సీతా రామ కల్యాణం (9 కేంద్రాలు)(06-01-1961) , జగదేక వీరుని కధ (19 కేంద్రాలు) (09-08-1961) , కలసి ఉంటే కలదు సుఖం (4 కేంద్రాలు) (08-09-1961) , పెండ్లి పిలుపు (05-05-1961) , సతీ సులోచన (05-05-1961) శత దినోత్సవాలు జరుపుకున్నాయి.

• సతీ సులోచన, పెండ్లి పిలుపు ఒకే రోజు విడుదలయ్యాయి, రాజమండ్రి లో 100 రోజులాడాయి.

• ఒకే ఏడాది వచ్చిన ఒక సినిమాలో తండ్రి రావణుడిగా, అదే ఏడాది వచ్చిన సతీ తులసిలో రావణుడి కుమారుడైన ఇంద్ర జిత్తుగా వేసి ఎన్ టి ఆర్ మెప్పించారు.

• ఎన్ టి ఆర్ సీతా రామ కల్యాణం చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా సీతగా నటించిన గీతాంజలి, కెమెరామేన్ గా రవికాంత్ నగాయిచ్ తెలుగు తెరకు పరిచయమయ్యారు.

• హీరోలంటే గ్లామరస్ పాత్రలు, యుగళగీతాలు పాడాలి అనుకునే రోజుల్లో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడానికి ఎన్ టి ఆర్ ఉత్సాహం చూపించే వారు. జగదేక వీరుని కధ లో అందం, సాహసం కలగలిసిన జానపద పాత్ర. సీతా రామ కల్యాణం సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించిన ఎన్ టి ఆర్ , కలసి ఉంటే కలదు సుఖం లో వికలాంగుడి పాత్ర పోషించారు. చిత్రం లో కొంత సేపు అమాయకుడు / వెర్రి వాడు / అంధుడు వంటి పాత్ర వేసి, దేవతలు / భార్య / ప్రేయసి సాయం తో మామూలు మనిషిగా మారిన పాత్రలు వేయడము కాదు ఇవి. సినిమా ఆద్యంతం ప్రతినాయక , వికలాంగుడి పాత్ర పోషణ ఇవి.

• ఇంటికి దీపం ఇల్లలే (26-01-1961), శాంత (14-7-1961), టాక్సీ రాముడు (18-10-1961) ఏవరేజ్ గా నడిచాయి.

• ఏ ఎన్ ఆర్ నటించిన వెలుగునీడలు, అభిమానం, భార్యా భర్తలు, ఇద్దరు మిత్రులు, శభాష్ రాజా శత దినోత్సవాలు జరుపుకున్నాయి. భక్త జయదేవ, బాటసారి, వాగ్దానం విజయవంతం కాలేదు.

• ఇవి కాక ఉషా పరిణయం, బావ మరదళ్ళు, కృష్ణ ప్రేమ, ఋష్యశృంగ, శ్రీ కృష్ణ కుచేల, కన్న కొడుకు, గుళ్ళోఅ పెళ్ళీ, వరలక్ష్మీ వ్రతం, పెళ్ళి కాని పిల్లలు, తండ్రులు కొడుకులు, బికారి రాముడు సినిమాలు విడుదలయ్యాయి.

1962 :
• 24 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి.

• ఎన్ టి ఆర్ నటించిన 10 సినిమాలు 1962 లో విడుదలయ్యాయి.

• ఆ ఏడాది అక్కినేని నటించిన 4 సాంఘిక చిత్రాలు ఆరాధన, కలిమిలేములు, కులగోత్రాలు, సిరి సంపదలు ,

• ఇతరులు నటించిన 10 సినిమాలు మోహినీ రుక్మాంగధ, పదండి ముందుకు, ఖైదీ కన్నయ్య, పెళ్ళి తాంబూలం, స్వర్ణ గౌరి, అప్పగింతలు, నువ్వా నేనా, మదన కామరాజు కధ, ఆశా జీవులు, చిట్టి తమ్ముడు విడుదలయ్యాయి.

• ఎన్ టి ఆర్ ధరించిన పాత్రలు ఆయన అద్భుతాభినయంతో ఒక్కొక్కటి ఒక్కో మేరు పర్వతం లా ఆకృతిని సంతరించుకున్నాయి. రక్త సంబంధం, గుండమ్మ కధ, ఆత్మ బంధువు, మహా మంత్రి తిమ్మరసు, భీష్మ, దక్ష యజ్ణం, గులేబకావళి కధ, గాలి మేడలు వంటి చిత్రాల్లో వైవిధ్యభరితమైన ఆయన నటనకు ప్రేక్షకులు దిగ్భ్రాంతికి గురయ్యరు. విమర్శకులు సైతం నివ్వెరపోయే పరిస్థితులు కలిగాయి.

• ఎన్ ఏ టి వారి గులేబకావళి కధ (ఇది పర్షియన్ భాషలో గుల్ ఏ బకావళి కధ – బకావళి అనె ఒక పువ్వు కధ కి తెలుగువారు పెట్టుకున్న పేరు) 05-01-1962 న విడుదలై 5 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుని వసూళ్ళతో సంచలనం సృష్టించి, రిపీట్ రన్ లో ఎదురులేని చిత్రం గా కొనుగోళ్ళ దారులకు కొంగు బంగారమయ్యింది.

• భీష్మ ( 19-04-1962 న విడుదల) నటనాపరంగా గొప్ప సంచలనం.

• కన్నాంబగారు నిర్మించిన దక్ష యజ్ణం చిత్రం ( 10-05-1962 న) వేసవి కానుకగా విడుదలయ్యింది. ఇప్పటికీ శివ రాత్రికి టీ వీ లలో అర్ధ రాత్రి భక్తుల జాగారానికి ఈ సినిమా వేస్తూనే ఉంటారు.

• ఆ తరువాత (07-06-1962 న) ఎన్ టి ఆర్ నటించిన 100 వ చిత్రం గుండమ్మకధ విడుదలై ఆబాల గోపాలాన్ని మురిపించింది. ఈ సంవత్సరపు అతి పెద్ద విజయంగా 23 కేంద్రాలలో శత దినోత్సవాలు (లేట్ రన్ 4 కేంద్రాలతో), రజతోత్సవాలు జరుపుకుంది ఈ చిత్రం.

• పుండరీకాక్షయ్య గారు నిర్మాతగా కమలాకర కామేశ్వర రావు గారి దర్శకత్వంలో చారిత్రాత్మక చిత్రం మహామంత్రి తిమ్మరసు పూర్తి స్థాయి శ్రీ కృష్ణ దేవరాయల పాత్రలో అసమాన నటనా వైభవంతో (26-07-1962 న) విడుదలైంది. ఈ సినిమా కూడా 5 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది.

• రక్త సంబంధం (01-11-1962 న విడుదల) చిత్రంలో ఎన్ టి ఆర్, సావిత్రి అన్నా చెళ్ళెళ్ళుగా జీవించారు. అన్నా చెల్లెళ్ళ అనుబంధంతో ఇన్ని సంవత్సరాలు గడచినా రక్త సంబంధం చిత్రాన్ని మరిపించే మరో చిత్రం రాలేక పోయింది. రజతోత్సవ చిత్రం గా విజయఢంకా మ్రోగించి 11 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకొంది ఈ చిత్రం.

• ఈ సంవత్సరాంతం లో 14-12-1962 న విడుదలైన ఆత్మ బంధువు నట రత్న కీర్తికిరీటంలో అనర్ఘ రత్నం లా ప్రకాశించింది. ఎన్ టి ఆర్ నట వైభవంతో అఖండ తేజస్సుతో అలరారిన ఆత్మ బంధువు ప్రజా హృదయాలపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రకటించి, శత దినోత్సవాలు జరుపుకుంది.

• ఇవి కాక ఎన్ టి ఆర్ సినిమాలు గాలి మేడలు (09-02-1962) , టైగర్ రాముడు (08-03-1962) , స్వర్ణ మంజరి (10-08-1962) కూడా విడుదలయ్యాయి.

1963 :
• 30 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి.

• ఎన్ టి ఆర్ 13 సినిమాలలో, అక్కినేని 4 సినిమాలలో , ఇతరులు 13 సినిమాలలో నటించారు.

• ఎన్ టి ఆర్ నటించిన శ్రీ కృష్ణార్జున యుద్ధం (13 కేంద్రాలలో 100 రోజులు) (09-01-1963) , లవకుశ (62 కేంద్రాలలో 100 రోజులు) (29-03-1963) , నర్తనశాల (17 కేంద్రాలలో 100 రోజులు)(11-10-1963) , బందిపోటు (5 కేంద్రాలలో 100 రోజులు) (15-08-1963) , తిరుపతమ్మ కధ (04-10-1963) (1987 సంవత్సరం లో విజయవాడలో ) , పరువు ప్రతిష్ట (విజయవాడ రాజకుమారి టాకీసు) (09-05-1963) శతదినోత్సవాలు జరుపుకున్నాయి.

• లక్షాధికారి (27-09-1963) , సవతి కొడుకు (22-02-1963) హిట్ సినిమాలుగా నిలిచాయి. మంచి లాభాలనార్జించాయి. శత దినోత్సవాలు జరుపుకోలేదు.

• ఇరుగు పొరుగు (11-01-1963) , పెంపుడు కూతురు (06-02-1963) , వాల్మీకి (09-02-1963) , ఆప్త మిత్రులు, (29-05-1963) , మంచీ చెడు (07-11-1963) యావరేజ్ గా పోయాయి.

• అక్కినేని నటించిన చదువుకున్న అమ్మాయిలు (5 కేంద్రాలలో 100 రోజులు) , పునర్జన్మ, నిరపరాధి , శ్రీ కృష్ణార్జున యుద్ధం (13 కేంద్రాలలో 100 రోజులు) ఆ సంవత్సరం విడుదలయ్యాయి.

• ఇతరులు నటించిన 13 చిత్రాలు:- ఎదురీత, సోమవార వ్రత మహాత్మ్యం, తల్లీ బిడ్డలు, ఈడూ జోడు, కానిస్టేబుల్ కూతురు, అనురాగం, విష్ణు మాయ, అనుబంధాలు, దేవ సుందరి, మంచి రోజులు వస్తాయి, నాగ దేవత, గురువును మించిన శిష్యుడు, తోబుట్టువులు.

1964 :
• ఈ యేడాది 26 చిత్రాలు విడుదలయ్యాయి.

• యన్టీఆర్ 15 చిత్రాల్లోనూ, ఏయన్నార్ ఆరు చిత్రాల్లోనూ నటించారు.

• తొలిసారి అత్యధిక భాగం ఔట్ డోర్లో చిత్రీకరణ జరుపుకున్న బాబూమూవీస్ వారి ‘మూగమనసులు’ సంచలన విజయం సాధించి, రజతోత్సవాలు జరుపుకుంది.

• తరువాతి కాలంలో శతచిత్ర నిర్మాతగా కీర్తి గడించిన డి.రామానాయుడు తమ సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం ‘రాముడు-భీముడు’ (ఇదే యన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం కూడా) (21-05-1964) ఘనవిజయం సాధించింది.

• ఇంకా “ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న, డాక్టర్ చక్రవర్తి, అగ్గి-పిడుగు (31-07-1964) , దాగుడుమూతలు (21-08-1964) , మంచి మనిషి (11-11-1964) , భక్త రామదాసు (23-12-1964) ” చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి.

• పత్రికలలో ‘ఓపెనింగ్ కలెక్షన్ల’ ప్రకటనకు శ్రీకారం చుట్టిన చిత్రం ‘అగ్గి – పిడుగు’. భారీ చిత్ర నిర్మాణ వ్యయం రూ.5 లక్షలకు పైగా అవుతున్న ఆ రోజుల్లో ఈ చిత్రం మొదటి వారంలోనే రూ.5 లక్షలు గ్రాస్ వసూలు చేసింది.

• ఈ యేడాది విడుదలైన “మురళీకృష్ణ, గుడిగంటలు (14-01-1964) , శ్రీసత్యనారాయణవ్రత మహాత్మ్యం, (27-06-1964), బొబ్బిలియుద్ధం (04-12-1964) , నవగ్రహపూజా మహిమ, బంగారు తిమ్మరాజు” చిత్రాలు కూడా ప్రజాదరణ చూరగొన్నాయి.

• ఇంకా మర్మ యోగి (22-02-1964) , శభాష్ సూరి (19-09-1964) , బబ్రువాహన (22-10-1964) , వివాహ బంధం (23-10-1964) , కలవారి కోడలు (14-03-1964) , దేశ ద్రోహులు (07-05-1964), వారసత్వం, (19-11-1964), పూజా ఫలం , మైరావణ, తోటలో పిల్ల కోటలో రాణి యావరేజ్ గా నడిచాయి.

1965 :
• 30 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో 12 సినిమాలలో ఎన్ టి ఆర్ నటించారు.

• ఆ ఏటి సూపర్ హిట్ సినిమా పాండవ వనవాసం, విడుదలైన 23 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుని, రజతోత్సవం జరుపుకుంది.

• 1965 లో ఎన్ టి ఆర్ నటించిన 8 సినిమాలు డైరెక్ట్ గా శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఇది ప్రపంచ రికార్డు.

• ఆ సినిమాలు నాదీ ఆడ జన్మే (13 కేంద్రాలు) (07-01-1965) , పాండవ వనవాసం (23 కేంద్రాలు) (14-01-1965) , మంగమ్మ శపధం (5 కేంద్రాలు) (06-03-1965) , తోడు నీడ (6 కేంద్రాలు) (12-05-1965) , దేవత (6 కేంద్రాలు) (24-07-1965) , వీరాభిమన్యు (12 కేంద్రాలు) (12-08-1965) , సి ఐ డి (23-09-1965) , ఆడ బ్రతుకు (11 కేంద్రాలు) (12-11-1965).

• ఇవి కాక ఎన్ టి ఆర్ నటించిన మరొక 4 సినిమాలు దొరికితే దొంగలు (26-02-1965), సత్య హరిశ్చంద్ర (22-04-1965) , ప్రమీలార్జునీయం, (11-06-1965), విశాల హృదయాలు (09-09-1965) విడుదలయ్యాయి.

• అక్కినేని నటించిన 4 సినిమాలు , సుమంగళి, అంతస్థులు, ప్రేమించి చూడు, మనుషులు మమతలు ,

• ఇతరులు నటించిన 14 సినిమాలు ఉయ్యాల జంపాల, చదువుకున్న భార్య, తేనె మనసులు, కీలు బొమ్మలు, చంద్రహాస, ప్రతిజ్ఞా పాలన, ఆకాశ రామన్న, వీలునామా, జ్వాలాద్వీప రహస్యం, సతీ సక్కుబాయి, ప్రచండ భైరవి, ఇల్లాలు, శ్రీ సింహాచల క్షెత్ర మిహిమ, పక్కలో బల్లెం కూడా విడుదలయ్యాయి.

1966 :
• 32 తెలుగు చిత్రాలు విడుదల కాగా, ఎన్ టి ఆర్ 12 చిత్రాల్లోనూ, ఏయన్నార్ నాలుగు చిత్రాల్లోనూ నటించారు.

• సంక్రాంతికి నాయక, ప్రతినాయక పాత్రలు పోషించి, స్వీయ దర్శకత్వంలో ఎన్ టి ఆర్ రూపొందించిన ‘శ్రీకృష్ణ పాండవీయం’ (13-01-1966) ,

• ఫిబ్రవరిలో రామినీడు దర్శకత్వంలో పల్నాటి యుద్ధం (18-02-1966) ,

• మార్చిలో రాజ్యం పిక్చర్స్ శకుంతల (23-03-1966) ,

• ఏప్రిల్ లో సి పుల్లయ్యగారి దర్శకత్వంలో ఆ ఏడాది సూపర్ హిట్ సినిమా పరమానందయ్య శిష్యుల కధ (07-04-1966) ,

• మే లో శ్రీకాకుళాంధ్ర మహా విష్ణు కధ (06-05-1966) , మంగళసూత్రం (19-05-1966) ,

• జూన్ నెలలో ఎన్ టి ఆర్, విఠలాచార్య కలయికలో రూపొందిన ‘అగ్గిబరాటా’ (02-06-1966) ,

• జూలై నెలలో సంగీత లక్ష్మి (07-07-1966) ,

• ఆగస్టులో శ్రీ కృష్ణ తులాభారం (25-08-1966) ,

• సెప్టెంబర్ నెలలో పిడుగు రాముడు (10-09-1966) , అడుగుజాడలు (29-09-1966) ,

• అక్టోబరులో డాక్టర్ ఆనంద్ (14-10-1966) విడుదలయ్యాయి.

• పరమానందయ్య శిష్యుల కధ 15 కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకుని, రజతోత్సవ చిత్రంగా ఆ ఏటి సూపర్ హిట్ గా నిలచింది.

• శ్రీ కృష్ణ పాండవీయం 9 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది. అగ్గి బరాటా 4 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది.

• శ్రీ కృష్ణ తులాభారం 5 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది.

• శకుంతల రిపీట్ రన్ గా 1988 లో శతదినోత్సవం జరుపుకుంది.

• పిడుగు రాముడు విజయవంతమయ్యింది.

• పల్నాటి యుద్ధం, సంగీత లక్ష్మి, అడుగుజాడలు యావరేజ్ గా నడచాయి.

• శ్రీకాకుళాంధ్ర మహా విష్ణు కధ, డాక్టర్ ఆనంద్ మ్యూజికల హిట్ సినిమాలు. మంగళసూత్రం నిరాశ పరచింది.

• ఇవి కాక చైల్డ్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ‘లేత మనసులు’ , మొనగాళ్ళకు మొనగాడు, పొట్టి ప్లీడర్, ‘గూఢచారి 116’ ‘చిలకా-గోరింక’, కె.ఎస్.ఆర్.దాస్ ‘లోగుట్టు పెరుమాళ్ళ కెరుక’

• అక్కినేని నటించిన 4 సాంఘిక చిత్రాలు ఆత్మ గౌరవం, నవరాత్రి, ఆస్థిపరులు, మనసే మందిరం విడుదలయ్యాయి.

1967 :
• విడుదలైన 40 తెలుగు సినిమాలలో ఎన్ ఏ టి వారి “ఉమ్మడి కుటుంబం” (20-04-1967) సూపర్ హిట్ సినిమా గా నిలచింది. 15 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుని రజతోత్సవం కూడా జరుపుకుంది. విజయవాడ దుర్గా కళా మందిరం లో ఏకం గా 197 రోజులు ప్రదర్శించబడింది.

Also READ:   Flash Back to the 1960s With This Groovy Slang

• జానపద చిత్రాలలో ఉత్కంఠను కలిగించే సస్పెన్స్ చిత్రంగా విడుదలైన కంచు కోట (22-03-1967) శతదినోత్సవాలు జరుపుకుని, రిపీట్ రన్ గా 1975 లో హైదరాబాద్ రెగ్యులర్ షోలతో 105 రోజులు ప్రదర్శించబడటం అప్పట్లో ఓ సంచలనం గా చెప్పుకున్నారు.

• పౌరాణిక చిత్రం శ్రీ కృష్ణావతారం (12-10-1967) రజతోత్సవం జరుపుకుంది.

• అలాగే భామా విజయం (29-06-1967) , నిండు మనసులు (11-08-1967) , ఆడపడుచు (30-11-1967), భక్త ప్రహ్లాద (12-01-1967) , మరపురాని కధ (27-07-1967), పూల రంగడు (24-11-1967) చిత్రాలు కూడా శతదినోత్సవాలు జరుపుకున్నాయి.

• గోపాలుడు భూపాలుడు (13-01-1967), చిక్కడు దొరకడు (21-12-1967), భువనసుందరి కథ (07-04-1967), రంగులరాట్నం (07-01-1967), ఇద్దరు మొనగాళ్ళు (03-03-1967), శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (02-06-1967), అవే కళ్ళు (14-12-1967), కాంభోజరాజు కథ (29-12-1967) మంచి కలెక్షన్లు సాధించి, విజయాల జాబితాలో చేరాయి.

• ఎస్.వి. రంగారావు తొలిసారి దర్శకత్వం వహించి చదరంగం (19-05-1967)చిత్రం జనాదరణ చూరగొంది.

• బాపు దర్శకునిగా చేసిన తొలి ప్రయత్నం సాక్షి (01-07-1967) విజయవంతమై బడ్జెట్ చిత్రాల్లో కొత్తపోకడకు శ్రీకారం చుట్టింది.

• ఇవి కాక నిర్దోషి (02-03-1967) , స్త్రీ జన్మ (31-08-1967) , పుణ్యవతి (03-11-1967) , ప్రాణ మిత్రులు, గృహలక్ష్మి, వసంతసేన, రహస్యం , సతీ సుమతి , మా వదిన, పిన్ని, పట్టుకుంటే పది వేలు, దేవుని గెలిచిన మానవుడు, సత్యమే జయం, ఉపాయంలో అపాయం, ప్రైవేటు మాస్టారు, అగ్గి దొర, ప్రేమలో ప్రమాదం, అనుమానం పెనుభూతం,. గొప్పవారి గోత్రాలు, పెద్దక్కయ్య, రక్త సింధూరం , చిత్రాలు విడుదలయ్యాయి.

1968:
• విడుదలైన 58 తెలుగు చిత్రాలు గమనిస్తే ఎన్ టి ఆర్ 11 చిత్రాలలో, కృష్ణ 11 సినిమాలలో, అక్కినేని 5 చిత్రాలలో, కాంతారావు 13 చిత్రాలలో, శోభన్ బాబు 7 చిత్రాలలో, హరనాధ్ 6 సినిమాలలో, ఇతరులు 8 చిత్రాలలో నటించారు.

• జయలలిత 5 తెలుగు చిత్రాలలో , కాంచన 9 చిత్రాలలో, జమున 9 చిత్రాలలో నటించారు.

• సి ఎస్ రావు 7 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

• జి వర లక్ష్మి, సావిత్రి దర్శకురాళ్ళుగా మారారు.

• ఎన్ టి ఆర్ నటించిన రాము (04-05-1968) ఆ ఏటి సూపర్ హిట్ సినిమాగా రజతోత్సవం, 15 కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకుంది.

• ఎన్ టి ఆర్ నటించిన తల్లి ప్రేమ (09-03-1968), నిండు సంసారం (05-12-1968), నిలువు దోపిడి చిత్రాలు (25-01-1968), అక్కినేని నటించిన మంచి కుటుంబం కూడా శతదినోత్సవాలు జరుపుకున్నాయి.

• ఇవి కాక ఎన్ టి ఆర్ నటించిన,ఉమా చండీ గౌరీ శంకరుల కధ (11-01-1968) , తిక్క శంకరయ్య (29-03-1968) , కలిసొచ్చిన అదృష్టం (10-08-1968) , నిన్నే పెళ్ళడతా (30-08-1968) , భాగ్య చక్రం (13-09-1968) , నేనే మొనగాణ్ని (04-10-1968) , బాగ్దాద్ గజ దొంగ (24-10-1968) ,

• అక్కినేని నటించిన గోవుల గోపన్న, బంగారు గాజులు, బ్రహ్మచారి, సుడి గుండాలు,

• కృష్ణ నటించిన అసాధ్యుడు, నిలువుదోపిడి, మంచి కుటుంబం, సర్కార్ ఎక్స్‌ప్రెస్ , అమాయకుడు, అత్తగారు కొత్త కోడలు, నేనంటే నేనే, ఉండమ్మా బొట్టు పెడతా, చెల్లెలికోసం, వింత కాపురం , లక్ష్మీ నివాసం,

• కాంతారావు నటించిన అగ్గి మీద గుగ్గిలం, ఎవరు మొనగాడు, పేదరాసి పెద్దమ్మ కధ, భలే మొనగాడు, రాజ యోగం, రణ భేరి, సతీ అరుంధతి, దేవ కన్య, వీరపూజ , వీరాంజనేయ, జీవిత బంధం, కుంకుమ భరిణ, జీవిత బంధం

• శోభన్ బాబు నటించిన కలసిన మనసులు, చుట్టరికాలు, మన సంసారం, పంతాలు పట్టింపులు, భార్య, లక్ష్మీ నివాసం, కుంకుమ భరిణ,

• హరనాధ్ నటించిన బంగారు సంకెళ్ళు, పెళ్ళి రోజు, నడ మంత్రపు సిరి, చల్లని నీడ, పాల మనసులు, సుఖ దుఖాలు,

• ఇతరులు నటించిన పాప కోసం , భలే కోడళ్ళు, మూగ జీవులు, చిన్నారి పాపలు, లక్ష్మీ నివాసం, బాంధవ్యాలు, గ్రామ దేవతలు, బంగారు పిచిక , విడుదలయ్యాయి.

1969 :
• ఈ యేడాది 52 చిత్రాలు వెలుగు చూశాయి.

• రాజకీయాలు, ప్రజాసమస్యలు ప్రధాన నేపథ్యంగా రూపొందిన ‘కథానాయకుడు’ (27-02-1969) సూపర్ హిట్ అయి, తరువాత ఆ తరహా చిత్రాల రూపకల్పనకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. కధానాయకుడు సినిమా 9 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది. రజతోత్సవం కూడా జరుపుకుంది. నిర్మాతలకు ఒక రూపాయ పెట్టుబడికి 9 రూపాయల లాభం తెచ్చిమిది.

• ఎన్ టి ఆర్ 11 సినిమాలలో నటించారు అక్కినేని 8 సినిమాలలో నటించారు

• కధానాయకుడు (27-02-1969) 9 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుని ఆ ఏటి సూపర్ హిట్ సినిమాగా నిలచింది.

• వర కట్నం (10-01-1969) , విచిత్ర కుటుంబం (28-05-1969) , నిండు హృదయాలు (15-08-1969) , మాతృదేవత (07-11-1969) , అదృష్టవంతులు, మూగనోము, బంధిపోటు దొంగలు, ఆత్మీయులు, బుద్ధిమంతుడు, మనుషులు మారాలి శత దినోత్సవాలు జరుపుకున్నాయి.

• “గండికోట రహస్యం (01-05-1969) , జగత్ కిలాడీలు, మహ్మద్ రఫీ తొలిసారి తెలుగులో అన్ని పాటలూ పాడిన ‘భలే తమ్ముడు’ (18-09-1969), మహాబలుడు చిత్రాలు యావరేజ్ గా నడిచాయి.

• విశ్వనాధ సత్యనారాయణ గారి నవల ఏకవీర (04-12-1969) మ్యూజికల్ హిట్ గా నిలచింది. భలే మాస్టారు (27-03-1969), కదలడు వదలడు (09-07-1969), అగ్గి వీరుడు (17-10-1969) నిరాశ పరిచాయి.

• జెమినీ వారి ‘మనుషులు మారాలి’ చిత్రం సంచలన విజయం సాధించి, శారదకు విషాద పాత్రల నాయికగా మంచి పేరు సంపాదించిపెట్టింది, శోభన్‌బాబు పాత్ర చిన్నదే అయినా ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చింది.

1970 :
• ఈ యేడాది 49 చిత్రాలు విడుదలయ్యాయి. సగటున వారానికి ఒక సినిమా చొప్పున. ఎన్ టి ఆర్, ఏ ఎన్ ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కాంతారావు, హరనాధ్, కృష్ణం రాజు, చంద్రమోహన్ హీరోలుగా వాణిశ్రీ, రాజశ్రీ, విజయ నిర్మల మొదలైన వారు హీరోయిన్లగా నటించారు.

• అక్కినేని 5 చిత్రాలలో, ఎన్ టి ఆర్ 10 చిత్రాలలో నటించారు.

• ‘కోడలు దిద్దిన కాపురం’ (21-12-1970) ఘనవిజయం సాధించి, రజతోత్సవం జరుపుకుంది.

• “తల్లా-పెళ్ళామా (08-01-1970) , పెత్తందార్లు(30-04-1970) , చిట్టి చెల్లెలు (29-07-1970) , ఒకే కుటుంబం (25-12-1970) , అక్కాచెల్లెలు, ఇద్దరమ్మాయిలు, ధర్మదాత ” శతదినోత్సవం జరుపుకోగా,

• ” ఆలీబాబా 40 దొంగలు, (04-04-1970), కథానాయిక మొల్ల, మా మంచి అక్కయ్య, సంబరాల రాంబాబు” కూడా విజయపథంలో పయనించాయి.

• తొలి యాక్షన్ హీరోయిన్గా పేరొందిన విజయలలిత నటించిన ‘రౌడీరాణి’ బ్రహ్మాండమైన కలెక్షన్లు రాబట్టి, హిట్‌గా నిలచింది.

• లక్ష్మీ కటాక్షం (12-02-1970) , విజయం మనదే (15-07-1970) , మాయని మమత (13-08-1970) , మారిన మనిషి (24-08-1970) , జై జవాన్, మరో ప్రపంచం యావరేజ్ గా నడిచాయి.

1971:
• ఈ యేడాది 69 చిత్రాలు విడుదలయ్యాయి.

• ఎన్ టి ఆర్ 9 సినిమాలలో నటించారు.

• జగపతి ఆర్ట్ పిక్చర్స్ ‘దసరాబుల్లోడు’ సంచలన విజయం సాధించి, 365 రోజులు ప్రదర్శితమైంది.

• సురేశ్ ప్రొడక్షన్స్ ‘ప్రేమనగర్’ కూడా విజయం సాధించి, రజతోత్సవం జరుపుకుంది.

• ఈ యేడాది ఇంకా “పవిత్రబంధం, రైతుబిడ్డ (19-05-1971) , శ్రీకృష్ణసత్య (24-12-1971) , చెల్లెలికాపురం, బొమ్మా-బొరుసా, మట్టిలో మాణిక్యం, తాసిల్దారుగారి అమ్మాయి, మోసగాళ్ళకు మోసగాడు” శతదినోత్సవాలు జరుపుకోగా,

• “జీవితచక్రం (31-03-1971), చిన్ననాటి స్నేహితులు(06-10-1971) , శ్రీమంతుడు, అమాయకురాలు, మొనగాడొస్తున్నాడు జాగ్రత్త, కథానాయకురాలు, కల్యాణ మండపం, చెల్లెలి కాపురం, భలేపాప ” చిత్రాలు ఏవరేజ్‌గా నడిచాయి.

• కృష్ణను స్టార్ హీరోగా మార్చిన తొలి కౌబాయ్ తరహా చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’ మంచి కలెక్షన్లు రాబట్టింది. అప్పటివరకు హీరోగా నటిస్తున్నా, కొన్ని చిత్రాల్లో సైడ్ హీరోగానూ నటించారాయన. ఇక్కడ నుండి ఆయన సోలో హీరోగా ముందుకు సాగిపోయారు.

• తాసిల్దారుగారి అమ్మాయి’ సక్సెస్‌తో శోభన్‌బాబు కూడా హీరోగా స్థిరపడ్డారు.

• ఎన్ టి ఆర్ నటించిన శ్రీ కృష్ణ విజయం (11-01-1971) , నిండు దంపతులు (04-02-1971) , రాజకోట రహస్యం (12-03-1971) , అదృష్ట జాతకుడు (06-08-1971) , పవిత్ర హృదయాలు (24-11-1971) , అక్కినేని నటించిన మనసు మాంగల్యం, రంగేళి రాజా, సుపుత్రుడు ఫ్లాప్ అయ్యాయి.

1972:
• ఈ యేడాది 60 చిత్రాలు విడుదలయ్యాయి.

• ఎన్ టి ఆర్ నటించిన 3 సినిమాలు విడుదలయ్యాయి.

• జయప్రద పిక్చర్స్ ‘పండంటికాపురం’ సూపర్ హిట్టయి, 365 రోజులు ప్రదర్శితమైంది.

• “విచిత్రబంధం, ఇల్లు- ఇల్లాలు” చిత్రాలు రజతోత్సవం జరుపుకున్నాయి.

• “రైతు కుటుంబం, కొడుకు-కోడలు, బడిపంతులు (23-11-1972) , శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (18-05-1972) , అంతా మనమంచికే, కలెక్టర్ జానకి, కాలం మారింది, పాపం పసివాడు, బాలభారతం, బుల్లెమ్మా బుల్లోడు, మానవుడు – దానవుడు, సంపూర్ణ రామాయణం” శతదినోత్సవం చేసుకున్నాయి.

• ఎన్ టి ఆర్ నటించిన కుల గౌరవం (19-10-1972) , అక్కినేని నటించిన భార్యా బిడ్డలు, బీదలపాట్లు, దత్త పుత్రుడు , మంచిరోజులొచ్చాయి యావరేజ్ గా నడిచాయి.

1973:
• ఈ యేడాది 63 చిత్రాలు విడుదలయ్యాయి. ఎన్ టి ఆర్ 6 సినిమాలలో నటించారు.

• పద్మాలయా పిక్చర్స్ ‘దేవుడు చేసిన మనుషులు (09-08-1973) ‘ 28 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుని ఘనవిజయం సాధించగా,

• దాంతో పాటు”దేశోద్ధారకులు (29-03-1973) 12 కేంద్రాలలో శత దినోత్సవాలు ,

• బంగారుబాబు, దాసరి నారాయణ రావును దర్శకునిగా పరిచయం చేసిన ‘తాత-మనవడు’, శారద” చిత్రాలు సూపర్ హిట్స్‌గా నిలిచి, రజతోత్సవాలు జరుపుకున్నాయి.

• “డబ్బుకు లోకం దాసోహం (12-01-1973), వాడే-వీడు (18-10-1973), భక్త తుకారాం, అందాల రాముడు, పల్లెటూరి బావ, గాంధీ పుట్టిన దేశం, జీవనతరంగాలు, పుట్టినిల్లు-మెట్టినిల్లు, మాయదారి మల్లిగాడు, మీనా, నేరము-శిక్ష, మైనర్‌బాబు” శతదినోత్సవాలు చేసుకున్నాయి.

• ఈ యేడాది వాణిశ్రీ అందరు అగ్రహీరోల సరసన హిట్ ఫిలిమ్స్‌లో నటించింది. ఆ రోజుల్లో ఆమె హెయిర్ స్టైల్స్, కాస్ట్యూమ్స్‌కు మహిళాప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది.

• ఎన్ టి ఆర్ నటించిన ధనమా దైవమా (24-05-1973), ఎర్ర కోట వీరుడు (14-12-1973), అక్కినేని నటించిన మంచివాడు, కన్న కొడుకు, మరపురాని మనిషి విజయవంతం కాలేదు.

1974:
• ఈ యేడాది 60 సినిమాలు విడుదలయ్యాయి. పద్మాలయా పిక్చర్స్ ‘అల్లూరి సీతారామరాజు’ తొలి పూర్తిస్థాయి కలర్- సినిమాస్కోప్‌గా రూపొంది, ఘనవిజయం సాధించి, 365 రోజులు ప్రదర్శితమైంది.

• ఎన్ టి ఆర్ 6 సినిమాలలో నటించారు. ‘నిప్పులాంటి మనిషి’ (25-10-1974) అనూహ్య విజయం సాధించి, 8 కేంద్రాలలో శత దినోత్సవం జరుపుకుని, రజతోత్సవ వైభవాన్ని కూడా పొందింది. తొలి వారం వసూళ్ళు 14 లక్షలకు పైగా వసూళ్ళు పేపర్లలో చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేక పోయాయి. విజయవాడ సరస్వతి లో 25 వారాలు ప్రదర్శించబడి మరో సంచలనమయ్యింది. ఈ అపూర్వ విజయంతో తెలుగు పరిశ్రమ ఒక్కసారిగా హిందీ రీమేక్ ల వైపు ఎగబడింది. ఈ హవా చాలాకాలం పాటు తెలుగు చిత్రసీమలో కొనసాగింది. హిందీ జంజీర్ లో యాంగ్రీ యంగ్ మేన్ గా అమితాబ్ నటించేనాటికి అతని వయస్సు 30 సంవత్సరాలు. ఈ చిత్రాన్ని తెలుగులో తీసేనాటికి ఎన్ టి ఆర్ వయస్సు 52 సంవత్సరాలు. విజయ్ పాత్రలో ఉండే ఫైర్ ఏమాత్రం తగ్గకుండా ఆ వయస్సులో చేయడం ఎన్ టి ఆర్ అంకిత భావాన్ని, గొప్పదనాన్ని తెలియ చేస్తుంది.

• మనుషుల్లో దేవుడు (05-04-1974) , మంచివాడు, బంగారుకలలు, దొరబాబు, ఖైదీబాబాయ్, అందరూ దొంగలే, ఎవరికివారే యమునాతీరే, కృష్ణవేణి, నీడలేని ఆడది, నోము చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి.

* “రాధమ్మపెళ్ళి, బంట్రోతు భార్య, తాతమ్మకల (30-08-1974) , ఛైర్మన్ చలమయ్య, కన్నవారి కలలు” కూడా విజయవంతంగా ప్రదర్శితమయ్యాయి.

• బాలకృష్ణ తొలి చిత్రం ‘తాతమ్మకల’ కుటుంబ నియంత్రణకు వ్యతిరేకంగా రూపొందింది. ఆ సమయంలో ప్రభుత్వం కుటుంబ నియంత్రణకు అనుకూలం. దాంతో ప్రభుత్వం, నిర్మాత ఓ అవగాహనతో ఈ చిత్ర ప్రదర్శనను 50 రోజులకు నిలిపివేసి, తరువాత కొన్ని మార్పులు, చేర్పులతో విడుదల చేశారు. ఇలా విడుదలై కొద్ది రోజులు ప్రదర్శితమై మళ్లీ రీ-షూట్ చేసి విడుదలైన చిత్రం ఇదొక్కటే!

• ఏన్ టి ఆర్ నటించిన అమ్మాయి పెళ్ళి (07-03-1974), దీక్ష (11-12-1974), విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన సాంఘిక చిత్రం పల్లెటూరి చిన్నోడు (09-01-1974) , అక్కినేని నటించిన ప్రేమలు పెళ్ళిళ్ళు నిరాశపర్చాయి.

• కృష్ణ నటించిన దేవదాసు తోపాటు అక్కినేని నటించిన పాత దేవదాసు పోటీగా విడుదలయ్యాయి.

• ఈ ఏడాది ఫిబ్రవరి 11నే మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పరమపదించారు.

1975:
• ఈ సంవత్సరం 66 సినిమాలు వెలుగు చూశాయి. ఎన్ టి ఆర్ 8 సినిమాలలో నటించారు.

• సురేశ్ ప్రొడక్షన్స్ ‘సోగ్గాడు’ బ్రహ్మాండమైన విజయం సాధించింది, సూపర్‌హిట్‌గా నిలిచి 24 వారాలు ప్రదర్శితమైంది. శోభన్‌బాబు కెరీర్లో ఆరు శత దినోత్సవ చిత్రాలను చూడడం మరో విశేషం.

• బాపు ‘ముత్యాలముగ్గు’ గొప్ప సంచలనాన్ని సృష్టించి స్వర్ణోత్సవం జరుపుకుంది.

• అందరూ కొత్తవారితో దాసరి చేసిన లో-బడ్జెట్ ప్రయోగం ‘స్వర్గం – నరకం’ కూడా సూపర్ హిట్టయింది.

• అక్కినేని ఆరోగ్య కారణాలవల్ల ఈ యేడాది ఒక్క చిత్రంలోనూ నటించలేదు.

• “శ్రీరామాంజనేయయుద్ధం (10-01-1975) , సంసారం (28-05-1975) , అన్నదమ్ముల అనుబంధం (04-07-1975) , తీర్పు (01-10-1975) , ఎదురులేని మనిషి (12-12-1975) , దేవుడు చేసిన పెళ్ళి, జీవనజ్యోతి, బలిపీఠం, జేబుదొంగ, కె.రాఘవేంద్రరావుని దర్శకునిగా పరిచయం చేసిన ‘బాబు’, యశోదాకృష్ణ” శతదినోత్సవాలు జరుకున్నాయి.

• “కొత్త కాపురం, దేవుడే దిగివస్తే, పూజ, పచ్చనికాపురం, కథానాయకుని కథ (21-02-1975), రాముని మించిన రాముడు (12-06-1975) ” కూడా సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమయ్యాయి.

• ఎన్ టి ఆర్ నటించిన మాయా మశ్చీంద్ర (09-05-1975), నిరాశపరిచింది.

Also READ:   Hair Removal: IPL Hair Removal

• ఈ యేడాది రిపీట్ రన్లో వినోదా వారి ‘దేవదాసు’ హైదరాబాదులో ఉదయం ఆటలతో 250 రోజులు ప్రదర్శితం కాగా,

• విశ్వశాంతివారి ‘కంచుకోట’ హైదరాబాదులో రోజూ 3 ఆటలతో 105 రోజులు ప్రదర్శితమైంది. ఈ రెండు చిత్రాలకు విజయోత్సవాలు నిర్వహించడం విశేషం!

1976:
• ఈ యేడాది 65 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఎన్ టి ఆర్ 8 సినిమాలలో నటించరు.

• అక్కినేని తనకు ప్రభుత్వం కేటాయించిన 14 ఎకరాల స్థలంలో అన్నపూర్ణ సినీస్టూడియోస్‌ను జనవరి 14న ఆరంభించారు.

• నందమూరి ముషీరాబాద్‌లోని తన సొంతస్థలం మూడున్నర ఎకరాలలో రామకృష్ణా సినీస్టూడియోస్‌ను జూన్ 7న ప్రారంభించారు.

• ఈ యేడాది భాస్కరచిత్ర ‘ఆరాధన’ (12-03-1976) 14 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుని సూపర్ హిట్‌గా నిలిచి రజతోత్సవం జరుపుకుంది.

• కె.బాలచందర్ విభిన్న శైలిలో రూపొందించిన ‘అంతులేని కథ’ కూడా సూపర్ హిట్ అయింది.

• “మనుషులంతా ఒక్కటే (07-04-1976) 4 కేంద్రాలలో , నేరం నాదికాదు ఆకలిది (22-07-1976) 5 కేంద్రాలలో , సెక్రటరీ, పాడిపంటలు, ఇద్దరూ ఇద్దరే, భక్త కన్నప్ప, సిరిసిరిమువ్వ” డైరెక్టుగా శతదినోత్సవం జరుపుకున్నాయి.

• అంతకు ముందు డైరెక్టుగా లేదా సింగిల్ షిఫ్టుతో మన చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. కాని ఇక్కడ నుండి ఎక్కువ షిప్టింగులతో శతదినోత్సవాలు జరుపుకోవడం మొదలయింది.

• ఆ విధంగా “అమెరికా అమ్మాయి, అల్లుడొచ్చాడు, జ్యోతి, తూర్పు-పడమర, నా పేరే భగవాన్, బంగారు మనిషి (05-08-1976) , భలే దొంగలు, మొనగాడు” శతదినోత్సవాలు జరుపుకున్నాయి.

• బాపు ‘సీతాకళ్యాణం’ ప్రజాదరణ పొందలేకపోయినా విమర్శకుల ప్రశంసలు పొందింది.

• కె.రాఘవేంద్రరావు, క్రాంతి కుమార్ కలయికలో రూపొందిన ‘జ్యోతి’ మంచి విజయం సాధించింది.

• జయప్రద, జయసుధ నటీమణులుగా ఈ యేడాది గుర్తింపు సంపాదించారు.

• ఎన్ టి ఆర్ నటించిన వేములవాడ భీమకవి (08-01-1976), మగాడు (19-051-976), మా దైవం (17-09-1976), మంచికి మరో పేరు (09-12-1976) , అక్కినేని నటించిన క్షేత్రయ్య, మహాత్ముడు కూడా విడుదలయ్యాయి.

1977:
• ఈ సంవత్సరం 78 చిత్రాలు విడుదలయ్యాయి. ఎన్ టి ఆర్ 6 సినిమాలలో నటించారు.

• సత్యచిత్ర ‘అడవిరాముడు’ (28-04-1977) చరిత్రలో కలకాలం నిలచిపోయేరీతిలో భారీ సూపర్‌హిట్‌గా విజయం సాధించి, కమర్షియల్ సినిమాకు (ఇప్పటికీ అనుసరిస్తున్న) కొత్త గ్రామర్‌ను నేర్పింది. అదే విధంగా కలెక్షన్లలో, రన్లో అంతకు ముందున్న చిత్రాలకంటే రెండు, మూడు రెట్లు ఎక్కువగా రికార్డ్ సృష్టించి, అనూహ్య విజయం సాధించిందీ చిత్రం. అంతకు ముందు తెలుగు సినిమా అత్యధిక కలెక్షన్ కోటి రూపాయలు రికార్డు కాగా, ఈ చిత్రం ఏకంగా యేడాదిలోనే రూ.4 కోట్లు సంపాదించి, అన్ని భాషా చిత్రరంగాల్లో చర్చనీయాంశమైంది. ఒకే రాష్ట్రంలో నాలుగు కేంద్రాలలో రెగ్యులర్ షోలతో స్వర్ణోత్సవాలు జరుపుకొని అంతకు ముందున్న ‘షోలే’ (మహారాష్ట్రలో మూడు కేంద్రాలు) రికార్డును అధిగమించింది. ఈ రికార్డును ఇప్పటివరకు మరే చిత్రం అధిగమించలేదు. తరువాత ఒక తెలుగు చిత్రం, ఒక హిందీ చిత్రం ఈ రికార్డును సమం చేశాయి.

• చాలా రోజుల తరువాత ఒకే ఇతివృత్తంతో ‘దానవీరశూర కర్ణ’ (14-01-1977) , ‘కురుక్షేత్రం’ పోటీ చిత్రాలుగా విడుదలయ్యాయి. “దానవీర శూర కర్ణ, యమగోల (21-10-1977) ” చిత్రాలు సంచలన విజయం సాధించి, 250 రోజులు ప్రదర్శితం కాగా

• ‘అమరదీపం’ (డైరెక్టుగా),’ఆలుమగలు’ రజతోత్సవాలు జరుపుకొని, ఘనవిజయం సాధించాయి.

• ఇంకా “సావాసగాళ్ళు, దొంగలకు దొంగ, చక్రధారి, బంగారుబొమ్మలు, చిల్లరకొట్టు చిట్టెమ్మ, చాణక్య-చంద్రగుప్త (25-08-1977) , ఎదురీత (22-07-1977) (సింగిల్ షిఫ్ట్)” చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి.

• “ఆమె కథ, ఇదెక్కడి న్యాయం, ఈనాటి బంధం ఏనాటిదో, చిలకమ్మ చెప్పింది, దేవతలారా దీవించండి, ప్రేమలేఖలు, సంసారంలో సరిగమలు, మా ఇద్దరి కధ (23-09-1977) ” సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమయ్యాయి.

1978:
• ఈ యేడాది 84 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ణ్టృ 11 సినిమాలలో నటించారు.

• దేవర్ ఫిలిమ్స్ ‘పొట్టేలు పున్నమ్మ’ సూపర్ హిట్టయింది.

• కె.బాలచందర్ ‘మరోచరిత్ర’ ప్రేమకథల్లో కొత్త ప్రయోగంగా రూపొంది, సూపర్ హిట్‌గా నిలచింది.

• సతీ సావిత్రి (04-01-1978) , రామకృష్ణులు (08-04-1978) , యుగపురుషుడు (14-07-1978) , రాజపుత్ర రహస్యం (28-07-1978) , సింహ బలుడు (11-08-1978) , సాహసవంతుడు (06-10-1978) , లాయర్ విశ్వనాధ్ (17-11-1978) , కేడీ నంబర్ వన్ (15-12-1978) , మల్లెపువ్వు, అన్నదమ్ముల సవాల్, చిలిపికృష్ణుడు, కటకటాల రుద్రయ్య, కరుణామయుడు, కుమారరాజా, పదహారేళ్ళ వయసు, బొమ్మరిల్లు, మనవూరి పాండవులు” శతదినోత్సవాలు జరుపుకున్నాయి.

• ఇంకా “అంగడి బొమ్మ, శివరంజని, ఏజెంట్ గోపి, జగన్మోహిని, పంతులమ్మ, వయసు పిలిచింది” కూడా సక్సెస్ఫుల్ చిత్రాలుగా నిలిచాయి.

• ఎన్ టి ఆర్ నటించిన మేలుకొలుపు (13-01-1978) , అక్బర్ సలీం అనార్కలి (15-03-1978) , శ్రీ రామ పట్టాభిషేకం (07-09-1978) , అక్కినేని నటించిన దేవదాసు మళ్ళీ పుట్టాడు, విచిత్ర జీవితం, శ్రీ రామ రక్ష, రావణుడే రాముడైతే యావరేజ్ గా నడిచాయి.

• చిరంజీవి నటునిగా తొలిసారి ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో తెరపై కనిపించింది ఈ ఏడే.

1979:
• ఈ సంవత్సరం 93 చిత్రాలు విడుదలయ్యాయి. ఎన్ టి ఆర్ 8 సినిమాలలో నటించారు.

• రోజామూవీస్ ‘వేటగాడు’ (05-07-1979) సంచలన విజయం సాధించి, 2 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుని ఆ ఏటి సూపర్ హిట్ గా నిలచింది.

• ‘డ్రైవర్ రాముడు’ (02-02-1979) కూడా 14 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుని రజతోత్సవం జరుపుకుంది.

• “కార్తీక దీపం, గోరింటాకు, వియ్యాలవారి కయ్యాలు, మండే గుండెలు, ముద్దులకొడుకు, ఇంటింటి రామాయణం, రంగూన్ రౌడీ, విజయ” శతదినోత్సవ చిత్రాలుగా నిలిచాయి.

• “ఇది కథకాదు, కోతలరాయుడు, కోరికలే గుర్రాలయితే, జూదగాడు, ప్రెసిడెంట్ పేరమ్మ, బంగారు చెల్లెలు, యుగంధర్ (30-11-1979), శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం (28-09-1979) , శ్రీరామబంటు, సొమ్మొకడిది- సోకొకడిది, హేమాహేమీలు” చిత్రాలు సక్సెస్ఫుల్ మూవీస్‌గా విజయం సాధించాయి.

• మా వారి మంచితనం (09-03-1979), టైగర్ (05-09-1979), శృంగార రాముడు (29-09-1979), శ్రీమద్విరాట పర్వం (28-05-1979) నిరాశ పరిచాయి.

1980:
• ఈ యేడాది తెలుగు సినిమా రంగం తొలిసారి శతాధిక చిత్రాలను చూసింది. 117 చిత్రాలు విడుదలయ్యాయి. ఎన్ టి ఆర్ 7 సినిమాలలో నటించారు.

• ‘శంకరాభరణం’ చారిత్రక విజయం సాధించి, ఖండాంతరాలలో కీర్తిని గడించి, తమిళనాడు, కర్ణాటకలలో సైతం జైత్రయాత్ర సాగించి, డైలాగులు మలయాళంలో, పాటలు తెలుగులోనే ఉండి కేరళలోనూ ఘనవిజయం సాధించింది. 50 వారాలు ప్రదర్శితమైంది. సంగీతపరమైన చిత్రాలకు మళ్ళీ ఓ ట్రెండ్‌ను సృష్టించి, విశ్వనాథ్ ఈ తరహా చిత్రాలను మరికొన్ని రూపొందించడానికి ఆక్సిజన్‌ను అందించిందీ చిత్రం.

• ‘సర్దార్ పాపారాయుడు’ (30-10-1980)కూడా సంచలన విజయం సాధించి, సూపర్‌హిట్‌గా నిలచి, 22 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుని 300 రోజులకు పైగా ప్రదర్శితమైంది.

• ” ఛాలెంజ్ రాముడు (12-01-1980) , సర్కస్ రాముడు (01-03-1980) , ఆటగాడు (24-04-1980), సూపర్ మేన్ (10-07-1980) , ఏడంతస్తుల మేడ, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త, ఘరానాదొంగ, మామాఅల్లుళ్ళ సవాల్, చుట్టాలున్నారు జాగ్రత్త, పున్నమినాగు, మొగుడుకావాలి, యువతరం కదలింది, గోపాలరావుగారి అమ్మాయి, సీతారాములు” శతదినోత్సవాలు జరుపుకోగా,

• “సరదా రాముడు (14-11-1980) , రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (15-08-1980) , గురు, నిప్పులాంటి నిజం, బుచ్చిబాబు, బెబ్బులి, రామ్ రాబర్ట్ రహీమ్, శివమెత్తిన సత్యం, సంధ్య, సుజాత, స్వప్న” సక్సెస్ఫుల్ చిత్రాలుగా నిలిచాయి.

• మాదాల రంగారావు ‘యువతరం కదిలింది’ కమ్యూనిస్టు బాణీ విప్లవ చిత్రాలకు నాంది పలికింది. ఇదే యేడాది విడుదలైన సమాంతర సినిమా ‘మా భూమి’ ఉదయం ఆటలతో సంవత్సరం పాటు ప్రదర్శితమైంది.

1981:
• ఈ యేడాది 107 చిత్రాలు విడుదలయ్యాయి. ఎన్ టి ఆర్ 9 సినిమాలలో నటించారు.

• విషాదాంత ప్రేమకథగా రూపొందిన అన్నపూర్ణ సినీస్టూడియోస్ ‘ప్రేమాభిషేకం’ చిత్రం అనూహ్య విజయం సాధించి, ఎనిమిది కేంద్రాలలో స్వర్ణోత్సవాలు జరుపుకొని గుంటూరులో సింగిల్ థియేటర్లో 380 రోజులు ప్రదర్శితమై ఆ ఏటి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

• ఇదే యేడాది విడుదలైన రోజామూవీస్ ‘కొండవీటి సింహం’ (07-10-1981) సంచలన విజయం సాధించి, అప్పటి వరకు ఉన్న కలెక్షన్స్ రికార్డులను అధిగమించి, 37 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొని, 300 రోజులకు పైగా ప్రదర్శితమైంది. ఈ చిత్రం అనకాపల్లిలో లేట్ రిలీజ్ (వందరోజుల తరువాత)గా విడుదలై డైరెక్టుగా 178 రోజులు ప్రదర్శితమై, లేట్ రన్లో స్టేట్ రికార్డుగా నేటికీ నిలిచి ఉంది.

• “ప్రేమ సింహాసనం (14-01-1981) , గజదొంగ (30-01-1981) , తిరుగులేని మనిషి (03-04-1981), సత్యం శివం (28-05-1981) , విశ్వ రూపం (25-07-1981) , అగ్గి రవ్వ (14-08-1981) , శ్రీవారి ముచ్చట్లు, ఊరికి మొనగాడు, పండంటి జీవితం, ఇల్లాలు, ఆకలిరాజ్యం, ఎర్రమల్లెలు, గురుశిష్యులు, చట్టానికి కళ్ళులేవు, న్యాయం కావాలి, భోగిమంటలు, ముద్దమందారం, రాధాకళ్యాణం, సప్తపది, సీతాకోకచిలుక” చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకోగా,

• “మహాపురుషుడు (21-11-1961) , కిరాయిరౌడీలు, దీపారాధన, పాలు-నీళ్ళు, పులిబిడ్డ, భోగభాగ్యాలు, రగిలేజ్వాల, రాణీకాసుల రంగమ్మ, వారాలబ్బాయి, సత్యభామ” సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమయ్యాయి.

• ఎవరు దేవుడు నిరాశపరచింది.

• ఈ ఏడే మహానటి సావిత్రి డిసెంబరు 26న మరణించారు.

1982:
• ఈ యేడాది 85 చిత్రాలు విడుదలయ్యాయి. ఎన్ టి ఆర్ 6 సినిమాలలో నటించారు.

• విజయమాధవీ కంబైన్స్ ‘బొబ్బిలిపులి’ సెన్సార్ సమస్యలు ఎదుర్కొని, ఆలస్యంగా విడుదలై (09-07-1982) సంచలన విజయం సాధించి, 39 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుని , రజతోత్సవ చిత్రంగా ఆ ఏటి సూపర్ హిట్ సినిమాగా నిలచింది.

• ‘జస్టిస్ చౌదరి’ (28-05-1982) కూడా సూపర్‌హిట్ అయి, 31 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుని, 250 రోజులు ప్రదర్శితమైంది.

• “అనురాగదేవత (09-01-1982) , కలియుగ రాముడు (13-03-1982) , నా దేశం (10 కేంద్రాలలో శత దినోత్సవాలు) (27-10-1982) , ప్రేమమూర్తులు, స్వయంవరం, దేవత, ఇల్లాలి కోరికలు, బంగారుభూమి, ఈనాడు, ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య, గృహప్రవేశం, తరంగిణి, త్రిశూలం, నాలుగు స్తంభాలాట, పట్నం వచ్చిన పతివ్రతలు, విప్లవశంఖం, శుభలేఖ” శతదినోత్సవాలు జరుపుకున్నాయి.

• “వయ్యారి భామలు వగలమారి భర్తలు (20-08-1982) , ప్రతిజ్ఞ, యమకింకరుడు” కూడా సక్సెస్ఫుల్ చిత్రాలుగా నిలిచాయి.

1983:
• నటరత్న యన్.టి.రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, చలనచిత్ర రంగం నుండి నిష్క్రమించారు.

• ఈ సంవత్సరం 104 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఎన్ టి ఆర్ నటించిన 2 సినిమాలు సింహం నవ్వింది (03-03-1983), చండశాసనుడు (28-05-1983) విడుదలయ్యాయి.

• సింహం నవ్వింది ఫ్లాప్ అయింది. చండ శాసనుడు విజయవంతమై శతదినోత్సవాలు జరుపుకుంది.

• ‘చండశాసనుడు’తో శారద ట్రాజెడీ బ్రాండ్ నుండి బయటకు వచ్చి దశాబ్దంపైగా సీరియస్ కేరెక్టర్స్ పోషించగలిగారు.

• సురేశ్ ప్రొడక్షన్స్ ‘ముందడుగు’ అత్యధిక వసూళ్ళు సాధించి, రజతోత్సవం జరుపుకుంది.

• ఈతరం పిక్చర్స్ ‘నేటి భారతం’ కూడా సూపర్ హిట్టయి, ద్విశతదినోత్సవం జరుపుకొని, ఉదయం ఆటలతో స్వర్ణోత్సవం చేసుకుని టి.కృష్ణ శైలి సామాజిక చిత్రాలకు, విజయశాంతి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు నాంది పలికింది.

• ‘ఖైదీ’ సంచలన విజయం సాధించి, అప్పటి యంగ్ హీరో చిరంజీవిని స్టార్‌గా నిలిపి, ఉదయం ఆటలతో స్వర్ణోత్సవం జరుపుకుంది.

• “అభిలాష, ఎమ్.ఎల్.ఎ. ఏడుకొండలు, కిరాయి కోటిగాడు, ధర్మాత్ముడు, పోరాటం, ప్రజారాజ్యం, బహుదూరపు బాటసారి, మగమహారాజు, మనిషికోచరిత్ర, రాముడు కాదు కృష్ణుడు, శక్తి, శ్రీరంగనీతులు, సాగరసంగమం, అడవి సింహాలు” శతదినోత్సవాలు జరుపుకోగా,

• “గూఢచారి నంబర్ వన్, మంత్రిగారి వియ్యంకుడు, పండంటి కాపురానికి 12 సూత్రాలు, పిచ్చిపంతులు, పెళ్ళిచూపులు, ముక్కుపుడక, మూడుముళ్ళు, రామరాజ్యంలో భీమరాజు, సంఘర్షణ” కూడా హిట్ చిత్రాలుగా నిలిచాయి.

• ‘సాగరసంగమం’ బెంగుళూరులో 511 రోజులు ఉదయం ఆటలతో ప్రదర్శితమైంది. ఈ యేడాది ఐదు డైరెక్టు శతదినోత్సవాలతో కృష్ణ కెరీర్లో రికార్డు నమోదు చేసింది.

1984:
• ఈ యేడాది 113 చిత్రాలు వెలుగు చూశాయి.

• ఎన్ టి ఆర్ నటించి, దర్శకత్వం వహించిన శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర 29-11-1984 న విడుదలై సూపర్ హిట్ గా నిలచింది. నిర్మాణ ఖర్చు 15 లక్షలు. వసూళ్ళు 7 కోట్లు. తెలుగులో 100 ప్రింట్లతో విడుదలైన ఈ సినిమా అన్ని కేంద్రాలలో 70 రోజులు ప్రదర్శించబడింది. కొన్ని కేంద్రాలలో డైరెక్టుగా, కొన్ని షిఫ్టులతో అన్ని కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది. రామ కృష్ణా 35 ఎం ఎం లో 300 రోజులాడింది. చారిత్రక చిత్రాల విజయం గురించి ఉన్న అపోహలను తొలగించిన చిత్రమిది. ఇది ఎన్ టి ఆర్ నటించిన 274 వ తెలుగు చిత్రం. ఎన్ టి ఆర్ నటించిన 22 డైరెక్టు హిందీ , తమిళ్ సినిమాలు కూడా కలిపితే ఈ సినిమా ఆయన నటించిన 296 వ చిత్రం. 7 సంవత్సరాల తర్వాత ఎన్ టి ఆర్ మరొక 4 తెలుగు సినిమాలలోనూ, 1 హిందీ సినిమాలోనూ (విడుదల కాలేదు) నటించి త్రి శత చిత్ర నాయకుడయ్యారు.

• వినోదపు పన్ను వసూలుకు శ్లాబ్ సిస్టమ్ మార్చి 23 నుండి అమలయింది.

• బాలకృష్ణను స్టార్‌గా నిలబెట్టిన ‘మంగమ్మగారి మనవడు’ 565 రోజులు ప్రదర్శితమై అత్యధిక ప్రదర్శన రికార్డును నమోదు చేసింది.

• ‘బొబ్బిలి బ్రహ్మన్న’ కూడా సూపర్ హిట్‌గా నిలచింది.

• “కథానాయకుడు, ఇల్లాలు – ప్రియురాలు, ఛాలెంజ్, స్వాతి, శ్రీవారికి ప్రేమలేఖ, దొంగలు బాబోయ్ దొంగలు” శతదినోత్సవం జరుపుకోగా,

Please View My Other Sites

• “బావామరదళ్ళు, గూండా, ఆనందభైరవి, ఇంటిగుట్టు, ఇద్దరు దొంగలు, రారాజు, సితార” కూడా హిట్ చిత్రాలుగా నిలిచాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here