దశభుజ_గణపతి దేవస్థానం. #రాయదుర్గం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్

#దశభుజ_గణపతి దేవస్థానం. #రాయదుర్గం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
ఆ కళ్లు అచ్చంగా తండ్రి పోలికే, మూడుకన్నులతో ముక్కంటి బిడ్డ అనిపించుకున్నాడు. చేతులేమో అమ్మను తలపిస్తాయి, మహాశక్తిని గుర్తుకుతెచ్చేలా దశభుజాలు. మేనమామ లక్షణాలూ వచ్చాయి, విష్ణుమూర్తిలా చేతిలో సుదర్శనం. అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో వెలసిన దశభుజ గణపతి వైభవాన్ని చూడాల్సిందే! ఏనుగు మొహం, చాట చెవులు, బానపొట్ట…గణపతి రూపం జగద్విఖ్యాతం. అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో కొలువైన గజాననుడి రూపం మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. మరుగుజ్జు స్వామి కాస్తా మహాకాయుడిగా దర్శనమిస్తాడు. పదిహేను అడుగుల ఎత్తుతో, పన్నెండు అడుగుల వెడల్పుతో ఉంటుందా విరాట్‌ మూర్తి.

‘శుక్లాంబరధరం విష్ణుం…’ శ్లోకం గణనాథుడిని ‘చతుర్భుజం’ అని కీర్తిస్తుంది. కానీ, ఇక్కడి గణపతికి మొత్తం పదిచేతులుంటాయి. ఎడమవైపున అయిదు చేతులూ, కుడివైపున అయిదు చేతులతో…ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధంతో – ఆ రూపం భక్తుల్ని తన్మయుల్ని చేస్తుంది. కుడివైపున…మొదటి చేతిలో నారికేళం, రెండో చేతిలో చక్రం, మూడో చేతిలో త్రిశూలం, నాలుగో చేతిలో ధనుస్సు, ఐదో చేతిలో అంకుశం ఉంటాయి. ఎడమవైపున…మొదటి చేతిలో భార్య సిద్ధి, రెండో చేతిలో శంఖం, మూడో చేతిలో పవిత్రం, నాలుగో చేతిలో శరం, అయిదో చేతిలో ఖడ్గం దర్శనమిస్తాయి. విగ్రహం ఎడమ అరికాలి కింద అష్టదళ పద్మం ఉంది.

Related:   శ్రీ కాళహస్తి రాహు-కేతు క్షేత్రం

ఇలాంటి స్వరూపాన్ని ‘మహాగణపతి’గా ఉపాసిస్తారు ఆధ్యాత్మిక సాధకులు. కాళ్లకు గజ్జెలూ, కాలికింద మూషిక వాహనమూ ముచ్చటగొలుపుతాయి. ‘అచ్చంగా తండ్రిపోలికే…’ అన్నట్టు ఫాలభాగంలో మూడో కన్ను ఉంటుంది. ‘ప్రసన్న వదనం’ విషయంలో మాత్రం ఏమాత్రం తేడా లేదు. మహా చిద్విలాసంగా కనిపిస్తాడు. పదిచేతులవాడు కావడంతో ‘దశభుజ గణపతి’గా పేరుతెచ్చుకున్నాడు. చేతలవాడు కూడా కావడంతో, కోరికల్ని సిద్ధింపజేస్తూ ‘సిద్ధి వినాయకుడు’ అనిపించుకుంటున్నాడు.

స్వామి ముక్కంటిగా దర్శనమిస్తున్న కారణంగా, పరమశివుడిలానే దుష్టశిక్షకుడనీ శిష్టరక్షకుడనీ విశ్లేషిస్తారు. విగ్రహానికి కుడివైపున సూర్యుడూ ఎడమవైపున చంద్రుడూ ఉండటంతో…విశ్వగణపతిగా కీర్తిస్తారు. చేతిలోని నారికేళ ఫలం సుఫలాలకు ప్రతీక. అందుకే భక్తులు, మొక్కులు మొక్కుకునే ముందు కొబ్బరికాయల్ని సమర్పిస్తారు. అభీష్టం సిద్ధించాక మళ్లీ వచ్చి, ఇంకొన్ని కాయల్ని నివేదిస్తారు.

Related:   ఉత్తర స్వామిమలై మందిర్‌(న్యూఢిల్లీ), సహస్రార క్షేత్రం

రాయలకాలం .

దశభుజ మహాగణపతి ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో భూపతిరాయలు అనే పాలకుడు నిర్మించినట్టు తెలుస్తోంది. ఆది, మంగళవారాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. నెలనెలా సంకష్టహర చతుర్థికి వందలాది భక్తులు వస్తారు. పక్కనే నరసింహుడి ఆలయం ఉంది. ఇది కూడా రాయల కాలం నాటిదే. లక్ష్మీదేవి సమేతంగా కొలువైన ప్రహ్లాద వరదుడిని కళ్లారా దర్శించుకోవచ్చు. ఆలయాలకు ఆనుకుని ఉన్న కొండమీదికి మెట్ల మార్గం ఉంది. పైకి ఎక్కితే, శిథిల నగరం కనిపిస్తుంది. కొలనులూ రాజప్రాసాదాలూ విపణులూ గతవైభవ ఘనకీర్తిని వివరిస్తాయి.

జిల్లా కేంద్రం అనంతపురానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది రాయదుర్గం. కర్ణాటకలోని బళ్లారి నుంచి అయితే యాభై కిలోమీటర్లు.

Related:   ప్రపంచంలోని అతి పెద్ద మరియు అతి ఐశ్వర్యవంత దత్త దేవాలయం - వేదాంతనగర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *