నువ్వు తోపురా మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | Nuvvu Thopu Raa movie review and rating

Spread the love


నువ్వు తోపురా స్టోరీ

పక్కా హైదరాబాదీ.. సరూర్ నగర్‌కు చెందిన సూరి (సుధాకర్ కోమాకుల) పోరంబోకు. బీటెక్ ఫెయిల్ అయి ఫ్రెండ్స్‌తో సరదాలు చేసే యువకుడు. ఓ కారణంగా తల్లిని ద్వేషిస్తాడు. చెల్లెలు అంటే ప్రేమ ఉండదు. అలాంటి ఓ పోకిరి యూఎస్‌కు వెళ్లి ఎంఎస్ చేయాలనే ఓ లక్ష్యమున్న రమ్య (నిత్యాశెట్టి)తో ప్రేమలో పడుతాడు. ఫ్రెండ్స్ చేసిన ఓ పని కారణంగా వారి మధ్య విభేదాలు ఏర్పడుతాయి. దాంతో సూరిని విడిచి రమ్య యూఎస్ వెళ్తుంది. ఊహించని పరిస్థితుల మధ్య ఓ అవకాశం రావడంతో సూరి అమెరికాకు వెళ్తాడు.

నువ్వు తోపురాలో ట్విస్టులు

అమెరికాకు వెళ్లిన సూరి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? రమ్యతో ప్రేమ మళ్లీ చిగురించిందా? తల్లి, చెల్లిని ప్రేమించడానికి ఎలాంటి పరిస్థితులు సూరిపై ప్రభావం చూపించాడు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ పాత్ర ఏంటి? సినిమాకు వరుణ్ సందేశ్ పాత్ర ఏ మేరకు హెల్ప్ అయింది? గ్రీన్ కార్డు హోల్డర్ కావాలని వరుణ్ చేసిన ప్రయత్నాలు ఎలా ఫలించాయి అనే ప్రశ్నలకు సమాధానమే నువ్వు తోపురా సినిమా కథ.

ఫస్టాఫ్ అనాలిసిస్

సరూర్ నగర్ లాంటి ఏరియాలో ఓ మాస్ యువకుడిని ఎలాంటి భావోద్వేగ పరిస్థితులు అతడిని ఓ పోరంబోకుగా మార్చాయనే పాయింట్‌లో కథ నడస్తుంది. మాస్ ఎలిమెంట్స్, జోష్‌తో సూరిని పాత్ర ఎస్టాబ్లిష్ అవుతుంది. హీరోయిన్ ఎంట్రీ, ప్రేమ వ్యవహారం చకచకా సాగిపోతాయి. ఇక కథలో కాన్‌ఫ్లిక్ట్‌ను వెతుక్కోవడానికి దర్శకుడు చాలానే కష్టపడ్డారని చెప్పవచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం చాలా సేపే నిరీక్షించాల్సి వచ్చింది.

సెకండాఫ్ ఎనాలిసిస్

ఇక రెండో భాగంలో కథంతా యూఎస్ బ్యాక డ్రాప్‌లో జరగడం, తల్లి, చెల్లెలు, సామాజిక అంశాల్లాంటి ఎమోషనల్ సీన్లు కథలో ప్రేక్షకుడు లీనం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. కాకపోతే నేరుగా కథను ముందుకు తీసుకెళ్లలేకపోవడం కొంత ఇబ్బందిగా మారుతుంది. కథకు సరైన గ్యమం లేకపోవడమే అందుకు కారణమనిపిస్తుంది. కాకపోతే బలమైన సన్నివేశాలు, డైలాగ్స్ కథ, స్క్రీన్ ప్లేలో కొన్ని బలహీనతలను కప్పిపుచ్చేలా చేస్తాయి. వరుణ్ సందేష్ ఇచ్చే ట్విస్టు సినిమా లెవెల్‌ను పెంచుతుంది. ముగింపులో ఇసాబెల్లా, రమ్య క్యారెక్టర్లు ఇచ్చే ఝలక్‌లు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. కథకు బలమైన డెస్టినేషన్ లేకపోవడమే ఓ లోపంగా కనిపిస్తుంది. కాకపోతే సెంటిమెంట్ సీన్లు బాగా పడటంతో ఫీల్‌గుడ్ చిత్రంగా అనిపిస్తుంది.

డైరెక్టర్ హరినాథ్ టేకింగ్

దర్శకుడు హరినాథ్ రాసుకొన్న సింగిల్ పాయింట్‌ కథలో ఫోర్స్ ఉంటుంది. కానీ దానిని విస్తరించుకొంటూ పోయే సందర్భంలో అనేక రకాల సమస్యలను స్క్రీన్ మీద వదులుతూ వాటిని మళ్లీ ఒక్కొక్కటిగా క్లోజ్ చేయడంలో కాస్త నెమ్మదించాడని చెప్పవచ్చు. కాకపోతే ఒక్కొక్క అంశాన్ని క్లోజ్ చేయడంలో పక్కాగానే వ్యవహరించాడు. బలమైన థ్రెడ్ చుట్టూ కొన్ని సమస్యలను అల్లుకొంటూ పోతే బాగుండేదేమో. దర్శకుడిలో ఉన్న బలమేమిటంటే.. తొలి చిత్ర దర్శకుడు అని ఎక్కడా అనిపించడు. రకరకాల క్యారెక్టర్లను బాగా హ్యాండిల్ చేశాడు. కథ, కథనాలపై మరింత జాగ్రత్త పడాల్సి ఉండాల్సింది. నువ్వు తోపురా చిత్రానికి ప్రధాన లోపం నిడివి. ఈ సినిమా గొప్ప చిత్రం కాకపోయినా బ్యాడ్ మూవీ అని చెప్పలేం. దర్శకుడు చేసిన మంచి ప్రయత్నమని చెప్పవచ్చు.

సుధాకర్ కోమాకులు యాక్టింగ్

సుధాకర్ కోమాకుల సూరి పాత్రలో ఒదిగిపోయాడు. కొన్ని ఎమోషనల్‌ సీన్లలో మెప్పించాడు. రకరకాల షేడ్స్ ఉన్న పాత్రను అవలీలగా ముందుకు తీసుకెళ్లాడు. సుధాకర్‌ తన ప్రతిభను నిరూపించుకోవడానికి దక్కిన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్‌లో చాలా మెచ్చురిటీ కనిపించింది. డ్యాన్సుల్లో ఈజ్ ఉంది. కాకపోతే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇమేజ్‌‌కు మరింత బలంగా మారవచ్చు.

Also READ:   ‘రాజ్‌దూత్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | Rajdoot movie review and rating

నిత్యాశెట్టి, నిరోషా నటన

హీరోయిన్ నిత్యాశెట్టి అనుభవం ఉన్న హీరోయిన్‌లా నటించింది. చలాకీగా కనిపిస్తూనే పరిణితి చెందిన నటనను ప్రదర్శించింది. మంచి పాత్ర దొరికితే తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకొనే సత్తా మాత్రం ఉంది. ఇక సూరి తల్లిగా అలనాటి హీరోయిన్, సింధూరపువ్వు ఫేం నిరోషా నటించింది. తల్లి పాత్రలో ఒదిగిపోయింది.

వరుణ్ సందేశ్ కొత్తగా

ఇక నువ్వు తోపురాలో సడెన్ సర్ప్రైజ్ వరుణ్ సందేశ్. చాలా రోజుల తర్వాత కొత్తగా చాలా చాలా కొత్తగా కనిపించాడు. ఎక్కడ పాత్ర వరుణ్ ఛాయలు కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. లుక్ బాగుంది. ప్రీ క్లైమాక్స్‌లో ఉండే ఓ సీన్లలో వరుణ్ నటన మరో లెవెల్ అని చెప్పవచ్చు. సినిమాకు ఈ సీన్ అత్యంత కీలకమని చెప్పవచ్చు.

సాంకేతిక విభాగాలు

సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే.. సినిమాకు ప్రధానమైన బలం సినిమాటోగ్రఫి. అమెరికాలో అందమైన లోకేషన్లను కెమెరాలో బంధించి తీరుకు హ్యాట్యాఫ్. సెకండాఫ్‌లో సినిమా ఓ పెయింటింగ్‌లా అనిపిస్తుంది. అందుకు వెంకట్ దిలిప్ చుండూరు, ప్రకాశ్ వెలాయుధన్‌ను మెచ్చుకోవాల్సిందే. బ్యాడ్ పార్ట్ ఏంటంటే ఎడిటింగ్. సీన్లను పరుచుకుంటూ పోయాడు. అందుకు కారణం వారే విశ్లేషించుకోవాలి. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ బాగుంది. మాస్ పాటలతో హోరెత్తించాడు. సినిమాకు డైలాగ్స్ స్పెషల్ ఎట్రాక్షన్. కొన్ని చోట్ల డైలాగ్స్ బ్రహ్మండంగా పేలాయి. కొన్నిసార్లు హార్ట్‌ను టచ్ చేస్తాయి.

Also READ:   Oh! Baby సినిమా రివ్యూ అండ్ రేటింగ్ | Oh! Baby movie review and rating
-->

ప్రొడక్షన్ వ్యాల్యూస్

ప్రొడక్షన్ వ్యాల్యూస్

జేమ్స్ కొమ్ము, శ్రీకాంత్ దడువాయి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. లోకేషన్ల ఎంపిక చాలా బాగున్నాయి. కథకు బలమైన క్యారక్టర్లకు నటీనటుల ఎంపిక ఇంకా బాగుంటే పాత్రలు బాగా ఎలివేట్ అయ్యేవి. కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే మరింత ఫీల్‌గుడ్‌గా మారేది.

ఫైనల్

నువ్వు తోపురా ఎమోషన్స్‌ను బాగా పండించిన చిత్రం. కాకపోతే బలహీనమైన కథ, కథనాలు సినిమాకు అవరోధంగా నిలుస్తాయి. అయినప్పటికీ పాత్రలు, సన్నివేశాల డిజైన్ బాగుండటంతో అవి పెద్దగా కనిపించవు. మల్టీప్లెక్ష్స్ ఆడియెన్స్‌కు నచ్చే చిత్రమని చెప్పవచ్చు. బీ, సీ సెంటర్లలో ఆడితే కమర్షియల్‌గా మంచి హిట్టు కొట్టే అవకాశాలు ఉన్నాయి. సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లే ప్రమోషన్‌పైనే సినిమా విజయం ఆధారపడి ఉందని చెప్పవచ్చు.

బలం, బలహీనత

ప్లస్ పాయింట్స్

సినిమాటోగ్రఫి

డైలాగ్స్

హీరో, హీరోయన్లు, వరుణ్ సందేశ్

క్లైమాక్స్

మ్యూజిక్

మైనస్ పాయింట్స్

కథ, కథనాలు

నిడివి

నటీనటులు

సుధాకర్ కోమాకుల, వరుణ్ సందేశ్, నిత్యాశెట్టి, నిరోషా, జబర్దస్త్ రాకేష్, మహేష్ విట్టా, రవివర్మ, దువ్వాసి మోహన్ తదితరులు

దర్శకత్వం: హరినాథ్ బాబు బీ

నిర్మాతలు: జేమ్స్ కొమ్ము, శ్రీధర్ దడ్వాయి

సినిమాటోగ్రఫి: వెంకట్ దిలిప్ చుండూరు, ప్రకాశ్ వెలాయుధన్‌

సంగీతం: సురేష్ బొబ్బిలి

ఎడిటింగ్: ఉద్దవ్

బాన్యర్: యునైటెడ్ ఫిలింస్

రిలీజ్: 2019-05-03