బహిష్టు అపవిత్రమైతే, మరి నీ పుట్టుక….??

బహిష్టు అపవిత్రమైతే, మరి నీ పుట్టుక….??

++++++++++++++++++++++++++++++
?మనిషి పుట్టుకకు కారణమైన బహిష్టును, ఒక సహజ శారీరక ధర్మాన్ని సమాజం… పితృస్వామ్య సమాజం ఛీత్కరించిన వైనం ఎంత మూర్ఖమైందో, ఇప్పటికీ అదే భావజాలం పరివ్యాప్తంలో వుండడం ఎంత విషాదమో కదా! ఫలదీకరణ చెందితే గర్భం… ఫలదీకరణ చెందకపోతే బహిష్టు… ఈ చిన్న లాజిక్కును అర్థం చేసుకోకుండా బహిష్టు చుట్టూ అల్లిన భయంకర భావజాలం తరాలుగా స్త్రీలను గాయపరుస్తూనే వుంది. అవమానిస్తూనే వుంది. కించపరుస్తూనే వుంది. గడ్డకట్టిన లాంటి ఒక మౌనం బహిష్టు చుట్టూ బిగించడం వల్ల దాని గురించి మాట్లాడటమే నేరంగా పరిగణించడం వల్ల బహిష్టు సమయంలోని వేదనని, దుఃఖాన్ని స్రీలు మౌనంగానే భరిస్తున్నారు. ఆ సమయంలో వాళ్ళెదుర్కొనే అనారోగ్యాలను, సరైన బట్టను ఉపయోగించక పోవడం వల్లే వచ్చే ఆరోగ్య సమస్యలను పట్టించుకునే దిక్కే లేదు. పునరుత్పత్తి అవయవ పరిశుభ్రత గురించి, భయాల గురించి, ఫోబియాల గురించి చర్చించే వేదికే లేదు.

Related:   LifeHacks

?బహిష్టు చుట్టూ ఒక అసహ్యవలయం తిరుగుతుండడం వల్ల, పేరెత్తితే అసహ్యం, ఏహ్యభావం తన్నుకువచ్చేలా మెదళ్ళను కలుషితం చేయడం వల్ల… బహిష్టు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి బట్ట వాడాలి, ఎలా ఉతకాలి, ఎలా ఎప్పుడు బట్ట మార్చుకోవాలి… జననాంగాన్ని పరిశుభ్రంగా ఎలా వుంచుకోవాలి లాంటి అంశాల మీద చాలా కాలం వరకు చర్చలే లేవు. మాటలే లేవు. ఉన్నదంతా మౌనమే.
తెలుగు సాహిత్యంలోకి వెల్లువలా దూసుకొచ్చిన స్త్రీవాదం మొట్టమొదటిసారి బహిష్టులోని రాజకీయాల్ని పబ్లిక్‌గా, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడింది. కొండేపూడి నిర్మల, అబ్బూరి ఛాయాదేవి, కె. గీత, రెంటాల కల్పన, జూపాక సుభద్ర లాంటి స్త్రీవాద రచయిత్రులు ఈ అంశం మీద కథలు, కవిత్వం రాసారు.

?బహిష్టు సమయంలో స్త్రీల మీద అమలయ్యే ఆంక్షలు, హింస గురించి పెద్ద గొంతుతో మాట్లాడింది స్త్రీవాద సాహిత్యం. గోప్యంగా, గుంభనంగా వుంచాల్సిన ముట్టు గురించి బహిరంగ వేదికలపై మాట్లాడిన స్త్రీవాదులను దుర్భాషలాడిన సందర్భాలను చూసాం. ఛీ… ఛీ… అంటూ ఛీత్కరించిన అభ్యుదయ వాదుల రెండు నాల్కల ధోరణిని చూసాం. ఈ గుడిలో కెళ్ళొద్దు… ఆ పూజ చెయ్యొద్దు… శుభకార్యాల్లో కనబడొద్దు… పెళ్ళిళ్ళల్లో కనుచూపుమేరలో ఉండొద్దు లాంటి ఫత్వాలు ఆధునిక కాలంలో కూడా వినబడడమే అత్యంత విషాదకరం. ఆధునికులమని తమని తాము భుజాలు చరుచుకునే వాళ్ళు సైతం బహిష్టు పట్ల తీవ్ర వ్యతిరేకతతో వుండడం వెనక వున్నదంతా అజ్ఞానమే. శరీర ధర్మాల పట్ల అవగాహనా రాహిత్యమే.

Related:   బాల‌క్రిష్ణ‌కి శ‌స్త్ర‌చికిత్స విజ‌య‌వంతం

?మూఢత్వం అల్లుకున్న ముట్టు గురించి ఇటీవల అంతర్జాతీయ వేదికలమీద మాట్లాడటం ఓ మంచి పరిణామం. మే 28 వ తేదీని ”అంతర్జాతీయ బహిష్టు శుభ్రతా దినంగా” ప్రకటించడం అంటేనే ఆ సమస్య ఎంత తీవ్రంగా వుందో అర్థమౌతుంది. ఈ తేదీని ఎంపిక చేసుకోడం వెనుక ఒక లాజిక్కుంది. ప్రతి 28 రోజులకి 5 రోజులపాటు ఉండే ఋతుచక్రాన్ని ప్రతి ఫలించేలా సంవత్సరంలో ఐదో నెలయిన మేలో 28వ తేదీని ‘అంతర్జాతీయ బహిష్టు శుభ్రతా దినం’గా ప్రకటించారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఈ అంశం మీద పనిచేస్తున్నాయి. స్త్రీలను, బాలికలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపడుతున్నాయ్‌.

?బహిష్టు చుట్టూ బలంగా అల్లుకున్న మౌనాన్ని బద్దలుగొట్టే కార్యక్రమాలను చేపడుతున్నాయ్‌. ఈ ప్రచారోద్యమంలో పాల్గొనాలనే ఉద్దేశ్యంతో భూమిక ఈ సంచికలో అధికభాగం పేజీలను బహిష్టు శుభ్రత అంశం కోసం కేటాయించింది. ఈ విషయంలో మాకు సహకరించిన గోపరాజు సుధ, రమాజ్యోతి, శివకుమారిలకు ధన్యవాదాలు తెలుపుతూ, మా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని నమ్ముతూ..
~K.Satyavathi (భూమిక, May, 2016)..

Related:   మనిషి చనిపోయే ముందు కుక్కలు ఎందుకు అరుస్తాయో తెలుసా?

?బహిష్టు సమయం లో స్త్రీల కు రక్త స్రావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు విశ్రాంతి అవసరం కనుక పూర్వకాలంలో కొన్ని కట్టుబాట్లు పెట్టారు, అవి వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా మత్రమే, కానీ అది మూఢత్వం లోకి పోవడం అత్యంత దారుణమైన విషయం. ఇప్పటికైనా అందరూ తెలుసుకుంటారని ఆసిస్తూ..- జై హింద్..
From. Mallesan Viswanadham wall

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *