భద్రాచలం

0
141

భద్రాచలం

పితృవాక్య పరిపాలకుడు, ఏక పత్నీ వ్రతుడు, ధర్మబద్ధమైన జీవితాన్ని ఆచరించిన పుణ్య పురుషుడు, ఆదర్శమూర్తి శ్రీ రామ చంద్ర మూర్తి. అందుకే ప్రతీ ఊర్లో రామాలయం ఉంటుంది. నమ్మి కొలిచినవాళ్ళకి అభయం ఇచ్చే శ్రీ రాముని ఆలయాలు ఎన్నో ఎన్నెన్నో . అటువంటి పుణ్యధామాలలో అత్యంత ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న ఆలయం భద్రాచలం. భద్రుని తపముకు మెచ్చి స్వామి వారు వెలసిన పుణ్య క్షేత్రం.

పౌరాణికముగా, చారిత్రకంగా ఎంతో ప్రాశస్త్యం ఉన్న దేవాలయం భద్రాచలం. తానీషా ప్రభువుల కాలంలో శ్రీ కంచర్ల గోపన్న ఈ ఆలయాన్ని నిర్మించారని చారిత్రక ఆధారాల బట్టి అవగతమవుతోంది. ప్రభుత్వ సొమ్ములతో ఆలయాన్ని నిర్మించినన్దుకుగాను కంచర్ల గోపన్న చెరసాల పాలవుతారు. అంతట ఆ శ్రీరామ చంద్రుల వారే స్వయముగా విచ్చేసి, గోపన్నను విడిపించారని , అప్పటి నుంచి గోపన్న రామదాసుగా పిలవబడుతున్నారని ఒక కధనం.

Also READ:   పళని క్షేత్రం

పాపికొండల మధ్య పరవళ్ళు తొక్కుతూ ఉప్పొంగి ప్రవహించు గోదావరి నదీ తీరాన, ప్రకృతి రమణీయత మధ్య అలరారుతోంది భద్రాద్రి. ఇక్కడికి విచ్చేసిన భక్తులు ముందుగా, కళ్యాణ కట్టకు వెళ్లి అక్కడ భక్తితో తలనీలాలు సమర్పిస్తారు. అనంతరం పుష్కర ఘాట్ కి వెళ్లి గోదారిలో పుణ్య స్నానాన్ని ఆచరించి, స్వామి వారి ప్రధానాలయ ప్రాంగణానికి చేరుకుంటారు.

స్వామివారికి ఎంతో ప్రీతి పాత్రమైన ఇహ్వపువ్వులు తదితర పూజాదికాలతో ఆలయం లోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయ ముందు భాగం లో వివిధ దేవతామూర్తుల శిల్పాలు చెక్కబడిన ఎత్తైన గాలిగోపురం ఉంటుంది. ప్రధానాలయ ప్రాంగణం ఎంతో విశాలంగా, ప్రశాంతం గా ఉంటుంది. గర్భాలయం కుడిచేతివైపు ఉన్న మందిరంలో శ్రీ సీతారామలక్ష్మణ నిత్య కళ్యాణ విగ్రహాలు దర్శనమిస్తాయి . అవి ఎంతో అందంగా, మనోహరంగా , ఆకర్షనీయం గా ఉంటాయి. వాటిని దర్శించుకున్న అనంతరం మూల విరాట్ ను దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. శ్రీ సీతారామలక్ష్మణ స్వాముల మూర్తులను చూడగానే అలౌకికమైన ఆనందానికి, పారవశ్యానికి లోనవుతాము .అంతటి అపూర్వమైన మూర్తులను చూడగానే మనసుకు ఎంతో ప్రశాంతత , భక్తి భావన కలుగుతాయి.ఇక్కడ స్వామివారు కుడి చేతిలో శంఖము ,ఎడమ చేతిలో చక్రముతో దర్శనమిస్తారు. ఇది శాంతికి నిదర్శనం.

Also READ:   కల్పవల్లి... కన్యకాపరమేశ్వరి

ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి గుడి ఉంటుంది. అమ్మవారు ప్రశాంత వదనంతో, పసుపు కుంకుమలతో కళ కళ లాడుతూ ఉంటారు. ఆ ప్రాంగణంలోనే భద్ర మహర్షి గుడి కూడా దర్శనమిస్తుంది. ఆ గుడిలో శ్రీ సీతారామస్వామి వారు కొలువై ఉంటారు.ఆ ప్రక్కనే ఒక రాతిపై స్వామివారి పాదముద్రికలు దర్శనమిస్తాయి. భద్రమహర్షి శిలారూపం కూడా ఉంటుంది . ఆలయ ప్రాంగణం వెలుపల అద్దాల మండపం ఉంటుంది. అక్కడ శ్రీరామదాసు, రాములవారికి సీతమ్మకు చేయించిన ఆభరణాలను పొందుపరిచారు.

Also READ:   భద్రాచలం

శ్రీ సీతారాముల కళ్యాణం

ప్రతి ఏటా చైత్ర సుద్ధ నవమినాడు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలు అంగ రంగ వైభోగంగా జరుగుతాయి. అభిజిత్ లగ్నంలో స్వామివారికి అమ్మవారికి కళ్యాణం నిర్వహిస్తారు. అశేషమైన భక్తజనం ఈ ఉత్సవాన్ని తిలకించి నయనానందాన్ని పొందుతారు, పునీతులవుతారు. రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. ఎంతో ఘనంగా జరిగే కళ్యాణోత్సవాన్ని చూచేందుకు వేయి కళ్ళు చాలవు.

మోక్ష రాముడు, వైకుంఠ రాముడుగా పిలవబడే శ్రీ భద్రాద్రి రాముడిని దర్శించండి మోక్ష సిద్ధి పొందండి.

జై శ్రీరామ్