మంచూరియా…   మంచి రుచిలో ఎలా

• మంచూరియా…

మంచి రుచిలో ఎలా?
* మా ఇంటిల్లిపాదికీ వెజ్ మంచూరియా అంటే చెప్పలేనంత ఇష్టం. దాంతో చాలాసార్లు నేను వాటిని ఇంట్లోనే ప్రయత్నించా. కానీ బయటి రుచిలా రాలేదు. కొన్నిసార్లు గట్టిగా ఉంటున్నాయి, ఉండలు విడిపోతున్నాయి. అవి మంచి రుచితో, ఉండలు విడిపోకుండా రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

– సుమ, తుని
• మంచూరియా తయారీలో ఆ ఉండలు తయారు చేసుకోవడమే ముఖ్యం. మీరు ఏ కూరగాయలు వాడుతున్నారో రాయలేదు కానీ.. ఇందులో క్యాబేజీ, క్యాప్సికం, క్యారెట్, ఉల్లికాడలూ, బీన్స్ ఉండాలి. కావాలనుకుంటే క్యాలిఫ్లవర్‌ని కూడా వేసుకోవచ్చు. వాటన్నిటినీ వీలైనంత సన్నగా, చిన్నగా తరగాలి. ఇలా మూడు కప్పుల కూరగాయల తరుగుకి రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున మైదా, మొక్కజొన్న పిండీ, సరిపడా ఉప్పూ వేసుకుని అన్నింటినీ కలపాలి. ఈ పిండి కలిపేందుకు నీళ్లు అవసరం లేదు. కూరగాయ ముక్కల్లోని తడి సరిపోతుంది. కలిపిన పిండిని పదిహేను నిమిషాలు నాననిచ్చి తరవాత చిన్న ఉండల్లా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఒకవేళ ఉండల్ని తక్కువ నూనెలో వేయించుకోవాలనుకుంటే ముందుగా కూరగాయ ముక్కలన్నింటినీ మరిగే నీటిలో వేసి రెండుమూడు నిమిషాల తరవాత తీసేయాలి. తరవాత అందులో మైదా, మొక్కజొన్న పిండీ, ఉప్పూ వేసి కలుపుకోవాలి. మైదాను కూడా మొక్కజొన్నపిండికి సమానంగానే వాడాలి తప్ప ఎక్కువగా కాదు. లేదంటే ఉండలు పిండిపిండిగా తయారవుతాయి. ఒకవేళ రెండూ ఎక్కువగా వేస్తే.. మంచూరియా ఉండలు గట్టిగా వస్తాయి. ముఖ్యంగా కొన్ని చిట్కాలు పాటించాలి. ముందుగా నూనెను వేడిచేసి మంట మధ్యస్థంగా ఉంచి తరవాత వాటిని వేయాలి. పిండి తయారీలో ఉప్పుతో పాటూ తక్కువ మోతాదులో ‘టేస్టింగ్ సాల్ట్’ కూడా వేయాలి. ఆ తరవాతే అల్లం, వెల్లుల్లి తరుగూ, పచ్చిమిర్చి ముక్కలూ, ఉల్లికాడల తరుగూ, కొత్తిమీరా, గరంమసాలా, కొద్దిగా ఉప్పూ, చిల్లీ, సోయా సాస్, కావాలనుకుంటే టొమాటో సాస్ కూడా వేసి వేయించుకోవాలి.

Related:   పనీర్ బటర్ మసాల

అదే వెట్ మంచూరియా అయితే.. దాని తయారీలో సాధారణ నీళ్లకు బదులుగా కూరగాయలు ఉడికించిన నీటిని ఎంచుకోవాలి. చిక్కదనం కోసం మొక్కజొన్న పిండిని నీటిలో కలిపి కూరగాయలు ఉడికించిన నీటిలో కలపాలి. తరవాత కొద్దిగా సోయాసాస్ వేయాలి. సోయాసాస్‌లో చక్కెర లేకపోతే అరచెంచా చక్కెర కూడా వేయాలి. వెట్ మంచూరియాలో గ్రేవీ తయారీలో కొద్దిగా టొమాటోసాస్ కూడా వేయడం వల్ల పులుపూ, తీపి కలిపిన ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఆ గ్రేవీలో ఉండల్ని వేసుకుంటే సరిపోతుంది. దీని తయారీలో మిరియాల పొడిని అప్పటికప్పుడు తయారుచేసుకుంటే రుచి బాగుంటుంది. ఒకవేళ ఉండలు విడిపోతున్నాయని అనుకున్నప్పుడు పిండితయారీలో ఒక గుడ్డు తెల్లసొనని గిలకొట్టి వేయొచ్చు. లేదంటే చెంచా బియ్యప్పిండి కలుపుకోవచ్చు. అదీ అందుబాటులో లేకపోతే ఉడికించిన ఆలూ ముద్దను రెండు చెంచాలు వేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *