మనశ్శాంతి కోసం సుబ్రహ్మణ్యుని దర్శించుకున్న శ్రీ రాముడు

Advertisement

మనశ్శాంతి కోసం సుబ్రహ్మణ్యుని దర్శించుకున్న శ్రీ రాముడు …

ఆలయ చరిత్ర :-

ఈ ఆలయం చాలా పురాతనమైనది. స్వామీ వారి మహత్యాన్ని వివరించే అనేక పురాణ కథనాలున్నాయి.

త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహారం చేసిన తరువాత కలిగిన బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవడానికి శివుడిని ఆరాధిస్తూ, శివలింగ ప్రతిష్టలు చేస్తూ, తిరుత్తణికి వచ్చి కుమారేశ్వరుణ్ణి ఆరాధించాడు. అప్పుడు శ్రీరామునికి మనశ్శాంతి కలిగింది అని పురాణ కథనం.

ద్వాపర యుగంలో కూడా అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ తిరుత్తణి ప్రాంతానికి వచ్చి ఈ స్వామిని దర్శించి శాంతిని పొందాడు అనేది ఐతిహ్యం.
మహావిష్ణువు కూడా తారకాసురునితో జరిగిన యుద్ధంలో తాను పోగొట్టుకున్న శంఖు, చక్రాలను, కుమారస్వామి తారకాసుర సంహారం చేసిన తరువాత ఈ స్వామిని పూజించి తిరిగి పొందాడు అనేది

పురాణ కథనం:-

అదేవిధంగా ఇంద్రుడు కూడా ఈ క్షేత్రంలో గల ఇంద్ర తీర్థంలో కరన్ కువలై అనే మొక్కను నాటి, ప్రతీరోజూ ఆ మొక్కకు పూచే మూడు పువ్వులతో స్వామిని పూజించి తాను తారకాసురుని ద్వారా పోగొట్టుకున్న “సంఘనీతి, పద్మనీతి, చింతామణి “అనే దేవలోక ఐశ్వర్యములను తిరిగి పొందాడు.
ప్రణవాన్ని వివరించలేక కుమారస్వామి చేత బంధితుడై, తిరిగి విడుదల అయిన తరువాత, బ్రహ్మ కూడా ఇక్కడ ఉన్న బ్రహ్మతీర్థంలో స్వామిని పూజించి, తన శక్తిసామర్థ్యాలను తిరిగి పొందాడు. పురాణ కథనాలే కాకుండా పల్లవ, చోళ రాజుల శాసనాలలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది.

కుమారతీర్థము

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజించ తలచి తిరుత్తణి కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగ ప్రతిష్టచేసి సేవించాడట. కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన సాంబశివుడు సంతోషించి కుమారస్వామికి ‘జ్ఞానశక్తి’ అనే ‘ఈటె’ను అనుగ్రహించాడట. ఆ కారణాన ఈ స్వామికి “జ్ఞానశక్తి ధరుడు” అనే పేరొచ్చింది. ఇక్కడ కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడనే పేరొచ్చింది. కుమారస్వామి, శివుని అర్చించడానికి సృష్టించిన తీర్థమే కుమారతీర్థము. దీనిని శరవణ తీర్థమని కూడా పిలుస్తారు.

మురుగ పెరుమాళ్ళుగా భక్తుల పూజలందుకునే సుబ్రహ్మణ్యస్వామి, వల్లీదేవిని వివాహమాడిన స్థలం, ఆరుపడైవీడు క్షేత్రాలలో స్వామి యుద్ధానంతరం శాంతిని పొందిన స్థలం, తణిగై (శాంతి) పురిగా పిలువబడే తిరుత్తణి. ఆరుపడైవీడు క్షేత్రాలలో ఈ క్షేత్రం చివరిది. ఇక్కడ కుమారస్వామి జ్ఞానశక్తి అనే ఈటెను ధరించి, వల్లీ, దేవసేన అమ్మవార్లతో కొలువై భక్తుల పూజలందుకుంటున్నాడు. ఈ స్వామిని నిర్మలమైన మనస్సుతో, ధర్మబద్ధమైన కోరికలు కోరిన భక్తులకు దర్శించినంత మాత్రం చేతనే వారి కోరికలు క్షణాల్లోనే తీర్చి మనశ్శాంతిని ప్రసాదిస్తాడు కనుక ఈ స్వామిని తణికేశన్ స్వామి అంటారు. అంటే క్షణమాత్రంలోనే శాంతిని ప్రసాదించే స్వామి అని అర్థం. ఈ క్షేత్రాన్ని క్షణికాచలం లేదా తిరుత్తణి అంటారు.

READ:   కొమురెల్లి మల్లన్నకు..కోటి దండాలు

ఇక్కడ స్వామిని వీరమూర్తి, జ్ఞానమూర్తి, ఆచార్యమూర్తి గా కొలుస్తారు. ఈ క్షేత్రానికి పూర్ణగిరి,మూలాద్రి, నీలోత్పల, క్షణికాచలం అనే పేర్లు కూడా ఉన్నాయి.

స్థలపురాణం :-

శూరపద్మునితో యుద్ధం చేసిన తరువాత స్వామి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో యుద్ధం చేసిన అనంతరం స్వామి ఇక్కడ విశ్రాంతి తీసుకుని శాంతిని పొందారు. అందుకే దీనిని తణిగై (శాంతి) పురి లేదా తిరుత్తణి అంటారు. భక్తుల పాపాలు మన్నించే దేవుడు.

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరుత్తణి కొండ ఈశాన్య,భాగంలో లింగ ప్రతిష్ఠ గావించి తన తండ్రి అయిన శంకరుణ్ణి పూజించాడు. ఆయన యొక్క పితృభక్తికి మెచ్చిన శివుడు సుబ్రహ్మణ్యేశ్వరునికి జ్ఞానశక్తి అనే ఈటెను ప్రసాదించాడు. అందుకే స్వామిని జ్ఞానశక్తిధరుడు అనే పేరుతోనూ, ఆయన ప్రతిష్టించిన లింగాన్ని కుమారేశ్వర లింగమనీ, ఆయన శివుణ్ణి పూజించడానికి సృష్టించిన తీర్థమే కుమారతీర్థమని అంటారు. దానినే శరవణ తీర్థమని కూడా అంటారు.

ఆలయ ప్రత్యేకతలు:-

ఈ ఆలయాన్ని చేరుకోవడానికి గల 365 మెట్లనూ సంవత్సరంలోని 365 రోజులుకు ప్రతీక అంటారు. ప్రతీ సంవత్సరం నూతన సంవత్సరాదికి పడిపూజ అనే మెట్లోత్సవం నిర్వహిస్తారు. మెట్లని శుభ్రపరిచి, పసుపు, కుంకుమ మొదలగు మంగళ ద్రవ్యాలతో అలంకరిస్తారు. ఆలయానికి ఇరువైపులా రెండు పర్వతశ్రేణులు ఉన్నాయి. ఉత్తరాన గల కొండలను బియ్యపు కొండలని, దక్షిణం వైపు గల కొండలను గానుగుపిండి కొండ అంటారు.

స్వామివారిని స్వర్ణ బిల్వపత్రమాల తో అలంకరిస్తారు. దేవేరులతో కొలువై ఉన్న స్వామి వారిపైన రుద్రాక్షలతో చేసిన ఛత్రం ఉంటుంది. స్వామి ఆకుపచ్చని షట్కోణం ధరించి ఉంటారు.

ఈ క్షేత్రంలో, మిగతా సుబ్రహ్మణ్య ఆలయాల్లో జరిపినట్లు స్కంద షష్ఠిని కాకుండా, యుద్ధోత్సవం నిర్వహిస్తారు. ఆ రోజున స్వామికి దాదాపు వేయి కిలోల పుష్పాలతో అభిషేకం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, స్వామి వారి వాహనమైన నెమలికి బదులుగా తూర్పు వైపుకి తిరిగి ఉన్న ఏనుగు ఉంటుంది. దీనికి ఒక పురాణం కథనం ఉంది. ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను కుమారస్వామికిచ్చి వివాహం చేసే సందర్భంలో కూతురుతో పాటు ఐరావతాన్ని కూడా కుమారస్వామికి ఇస్తాడు. కానీ ఐరావతం లేని దేవలోకంలో సంపదలు తరిగిపోతుండటం చూసి, కుమారస్వామి ఐరావతాన్ని ఇచ్చెయ్యబోవగా, అల్లుడి వద్ద నుండి ఐరావతాన్ని తిరిగి తీసుకోవడానికి మనస్కరించక, కుమారస్వామిని ఒక కోరిక కోరుతాడు. అదేమిటంటే, ఐరావతాన్ని దేవలోకంవైపుకు చూస్తూ ఉండేలా ఉంచమని చెప్తాడు. అంగీకరిస్తాడు కుమారస్వామి. ఈ చర్యతో దేవలోకంలో తిరిగి సంపదలు సమకూరుతాయి. అందుకే ఇక్కడ ఏనుగు తూర్పు దిక్కుకి తిరిగి ఉంటుంది.

READ:   అరుళ్మిగు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం – పళముదిర్చోళై

ఇక్కడ స్వామికి పూసే చందనం ఎంతో పవిత్రమైనది, ప్రత్యేకమైనది. ఇంద్రుడు కూతురుతో పాటు చందనం తీసే రాయిని కూడా ఇచ్చాడని, ఇప్పటికీ స్వామివారి అభిషేకానికి ఆ రాయినే ఉపయోగిస్తారని అంటారు. ఆ గంధాన్ని నీటిలో కలిపి సేవిస్తే వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం.

తమిళ కవి, స్వామి భక్తుడు అయిన అరుణగిరినాథర్ ఇక్కడే స్వామివారిని కీర్తిస్తూ పరమపదించారు. స్వామివారి మహత్యాన్ని గురించి కర్ణాటక సంగీత త్రయం లోని ముత్తుస్వామి దీక్షితార్ జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన ఘట్టం తెలుపుతుంది. ఒకసారి ముత్తుస్వామి దీక్షితార్ స్వామి వారి దర్శనానికి వస్తూ మెట్లు ఎక్కుతూ ఉండగా, ఒక వృద్ధుడు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని ఆయనకు ఇచ్చాడు. ఆయన దాన్ని తినగానే ముత్తుస్వామి నోటివెంబడి ఆశువుగా స్వామిని కీర్తిస్తూ అనేక కీర్తనలు వచ్చాయి. స్వయంగా సుబ్రహ్మణ్యుడే వృద్ధుని రూపంలో వచ్చి ముత్తుస్వామికి ప్రసాదాన్ని ఇచ్చారని ఈనాటికీ భక్తులు భావిస్తారు.

దర్శనీయ స్థలాలు:-

వల్లీమలై :-
ఇక్కడికి దగ్గరలోనే ఉన్న వల్లీమలై అనే ప్రాంతంతంలో వల్లీదేవితో సుబ్రహ్మణ్యుని వివాహం జరుగడానికి సహాయపడిన వినాయకుని ఆలయం ఉంది. ఈ వినాయకుడిని ఆపత్ సహాయ వినాయగర్ అంటారు.

శ్రీ మహావిష్ణువు కుమార్తె అయిన సుందర వల్లి కుమారస్వామిని వివాహం చేసుకోమని అడుగగా, ఆయన అనంతర కాలంలో తాను వివాహం చేసుకుంటానని చే[ప్తాడు. అపుడు సుందర వల్లి ఒక శిశువుగా మారి, వల్లిమలై కొండల ప్రాంతంలో నివసిస్తున్న నంబి అనే వేటగానికి దొరికింది. అతనికి ఆడపిల్లలంటే ఉన్న మక్కువ చేత ఆమెకు వల్లి అనే పేరు పెట్టి పెంచుకోసాగాడు. ఆమెకు యుక్త వయస్సు వచ్చింది. ఈమెకు వరుడు సుబ్రహ్మణ్యుడే అని తెలిసిన నారదుడు, అక్కడే తణికై (తిరుత్తణి) అనే ప్రదేశంలో ఉన్న స్వామికి ఈ విషయం తెలుపుతాడు. ఆయన వల్లిమలై వచ్చి ఆ సమయంలో గజరాజు బారిన పడిన వల్లిని రక్షిస్తాడు. తరువాత తన నిజస్వరూపం ప్రదర్శిస్తాడు. ఆరుముఖములు, పన్నెండు చేతులతో గల నిజస్వరూపం, తన అవతార అంతరార్థం తెలియచేస్తాడు. వల్లి తల్లిదండ్రులైన నంబి దంపతులు మొదట వివాహానికి అంగీకరించలేదు. స్వామి అప్పుడు వారితో చిన్నపాటి పోరు చేయాల్సి వస్తుంది. అప్పుడు వినాయకుడు వారికి సోదిచెప్పే ఆమె వేషంలో వచ్చి స్వామిని గూర్చి చెప్పి, వారిని అంగీకరింప చేస్తారు. అప్పుడు వారు వివాహానికి అంగీకరిస్తారు. కొండజాతి వారి ఆచారం ప్రకారం, వినాయకుడు, శివపార్వతుల సమక్షంలో, దేవసేన అంగీకారంతో వారి వివాహం చేస్తారు. ఒక కొండజాతి కన్యను వివాహం చేసుకున్నందుకు ప్రతిగా వారికి తాను కొండలమీదే వెలుస్తానని మాట ఇచ్చాడు. అందుకే చాలావరకు స్వామి ఆలయాలన్నీ కొండల మధ్యలోనో, కొండల మీదనో ఉంటాయి.

READ:   వేయి సంవత్సరాల ఆ గుడిలో మిస్టరి వింతలే

భైరవస్వామి ఆలయంలో భైరవస్వామి నాలుగు శునకాలతో కలిసి ఉంటాడు. నాలుగు శునకాలూ నాలుగు వేదాలకు ప్రతీకలు. భైరవుడి పీఠం ముందు మూడు శునకాలూ, పీఠం వెనుక ఒక శునకం ఉంటాయి. విద్యార్థులు చదువులో ఉన్నతి కోసం ఈ స్వామిని దర్శిస్తే మంచిది అని భక్తుల విశ్వాసం.

ఈ విధంగా ఎంతో మహిమాన్వితమైన, మానవుని ఆధ్యాత్మికోన్నతికి తోడ్పదే ఈ ఆరుపడైవీడు సుబ్రహ్మణ్య ఆలయాల దర్శనం, స్వామి దయ వలన మనందరికీ కలుగాలని ఆశిస్తున్నాము.

తిరుత్తణి ఎలా చేరుకోవాలి ?

తిరుత్తణి తమిళనాడులో తిరుపతి నుంచి ఆరక్కోణం వెళ్ళే దారిలో ఉంది. రోడ్డు ద్వారా: చెన్నై నుండి 84 కి.మీ., తిరుపతి నుండి 68 కి.మీ., అరక్కోణం నుండి 13 కి.మీ., కాణిపాకం నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ ప్రదేశాలు అన్నిటి నుంచి బస్సు సౌకర్యం ఉంది. మన ఎపి ఎస్ ఆర్టీసీ కూడా తిరుపతి నుంచి అనేక బస్సులు నడుపుతుంది. రైలు ద్వారా: దీనికి దగ్గరలోని రైల్వే స్టేషను అరక్కోణం. ఇది ఒక రైల్వే జంక్షన్. అంతేకాక, చెన్నై నుండి తిరుత్తణికి అనేక లోకల్ రైళ్ళు నడుస్తాయి. సమీప విమానాశ్రయం : చెన్నై లో అంతర్జాతీయ విమానాశ్రయం, తిరుపతి రేణిగుంటలో దేశీయ విమానాశ్రయం కలదు.

ఓం శరవణభవ

Originally posted 2018-07-02 21:47:42.