మాయా బజార్ , శ్రీ కృష్ణుడు గా ఎన్ టి ఆర్ పాత్ర పోషణ

మాయా బజార్ , శ్రీ కృష్ణుడు గా ఎన్ టి ఆర్ పాత్ర పోషణ

27-03-1957 న విడుదలైన మాయా బజార్ 1957 సినిమా ద్వారా ఎన్ టి ఆర్ పురాణ పాత్రలకు బీజం పడింది. ఆ తరువాత మరొక 10 సంవత్సరాలలో ఎన్ టి ఆర్ అనేక పురాణ పురుషుల పాత్రలను వేసి మెప్పించారు.

పాతికేళ్ళలో 18 చిత్రాలలో శ్రీ కృష్ణుని పాత్రను పూర్తి స్థాయిలో పోషించడమే కాకుండా, ఒకే ఆహార్యం, ఒక వయసును ప్రతిబింబిస్తూ నటించడం ఎన్ టి ఆర్ కు మాత్రమే సాధ్యమైంది. ఆ పరంగా ఎన్ టి ఆర్ ప్రపంచ రికార్డు నెలకొల్పారనే చెప్పాలి. ఎన్ టి ఆర్ కు ముందు, తర్వాత కూడా ఎందరో నటులు శ్రీ కృష్ణుని పాత్ర పోషించినప్పటికీ ప్రేక్షకులు వారిలో దైవత్వం చూడలేకపోయారు. సినిమాలలోని అంతర్నాటకాలతో కలిపి మొత్తం 33 సార్లు కృష్ణునిగా నటించారు ఎన్ టి ఆర్. కృష్ణునిగా అన్నిసార్లు ఆ పాత్ర పోషించడం, ప్రతీసారీ ప్రేక్షకుల్ని రంజింపచేసి మెప్పించడమన్నది అందరికీ సాధ్యమయ్యే విషయంకాదు.

1957 లో వచ్చిన మాయా బజార్ సినిమా ఎన్ టి ఆర్ శ్రీ కృష్ణుడిగా పూర్తి నిడివి పాత్ర పోషించారు. అందుకు తగ్గట్టు వేషం, దుస్తులు, నగలు వంటి వాటిపై యోచన చేసి పాత్రకు నిర్దుష్టమైన రూప కల్పన చేశారు. కె వి రెడ్డి సూచనలపై కళా దర్శకులు గోఖలే స్కెచెస్ తయారు చేశారు.బార్ట్లే కూడా లైటప్ బాగా చేశారు. “మాయా బజార్ లో కృష్ణుడు మొత్తం కధకే సూత్రధారి. అందుకే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గెటప్ను ఫైన చేయాల్సి వచ్చింది. ఎన్ టి ఆర్ కూడా బాగా సాధన చేశారు. భుజాలు కొంచెం కిందకు వంచి, కళ్ళలో కొంటెతనం, నడకలో వయ్యారం కనిపించేలా నటించారు. కొన్న్ని నెలలు శ్రమించి బాగా సన్నబడ్డారు. భుజాలు కొంచెం కిందకు వంగాయి. అలా ఆ రోజు తెర కృష్ణుడుగా వెలిసిన ఎన్ టి ఆర్ ఆ తర్వాత కేలండర్ కృష్ణుడై ఆరాధ్య నటుడయ్యారు.

మాయాబజార్ కృష్ణుడికి మాట, పాట,కదలిక తక్కువ. సున్నితమైన నటన. చిరునవ్వుతోనే ఎన్నో అర్థాలు పలికించిన పాత్ర అది. కొత్త సినిమా కృష్ణుడు మాయాబజార్ చిత్రం తో అవతరించాడు. మాయా బజార్ షూటింగ్ సమయంలో మేకప్ తో శ్రీ కృష్ణుడిగా సెట్లో ప్రత్యక్షమయిన ఎన్ టి ఆర్ ని చూసి మొత్తం యూనిట్ సభ్యులు మంత్రముగ్ధులై చిత్తరువుల్లా అలాగే చూస్తూ నిలబడిపోయారట. అంతే కాని ఎన్ టి ఆర్ కు confidence రావడం కోసం కర్పూరాలు వెలిగించారు, కొబ్బరి కాయలు కొట్టారు, కాళ్ళకు దండాలు పెట్టారన్న మాటలు అభూత కల్పనలు. ఆక్షణంలోనే మాయాబజార్ మునుముందు ఎంతటి సంచలనం సృష్టించనుందో అర్థమయిందని అన్నారు చక్రపాణి ఒకసారి.

మాయాబజార్ లో సావిత్రి ఎన్ టి ఆర్ ని” చిన్నానా” అన్నా, ఎన్ టి ఆర్ సావిత్రితో “ఏమీటమ్మా శశీ ఇది, సరే రేపీపాటికి నీకే తెలుస్తుంది” అన్నా, మాయా శశి రేఖ చేతులను మురళితో పక్కకు తప్పించినా, మనకి పాత్రలే కనబడుతాయి కానీ, పాత్రధారులు (ఎన్ టి ఆర్, సావిత్రి) కాదు.

తలపై కిరీటం దాని అగ్రభాగాన నెమలి పించం. పెదవులపై చెదరని చిరునవ్వు. మెడలో వైజయంతి మాల. పట్టు పీతాంబరాల వస్త్రధారణ. ఇదీ మాయా బజార్ లోని శ్రీ కృష్ణుని ఆకర్షణీయమైన రూపం. తిలకించిన జనం పరవశించిపోయారు. సినిమా ప్రారంభము నుండీ చివరివరకూ కధకు సూత్రధారియై , అన్ని పాత్రలకు అనుసంధానకర్తగా, హాస్య, శృంగార వీర రసాలన్నిటినీ అలవోకగా అభినయించి, ఆలోచన, వివేచన, చతురతలనుతనదైన శైలిలో తెరకందించి ప్రజల జేజేలందుకున్నారు ఎన్. టి. ఆర్.

కధా ప్రారంభంలో బాలుడైన అభిమన్యుని ధనుర్విద్యా కౌశలాన్ని బలరాముడు మెచ్చుకున్నప్పుడు శ్రీ కృష్ణుడు కల్పించుకుని “ఇంత వీర పుత్రుణ్ణి కన్నందుకు అన్నగారు ఏ వరం ఇస్తారో అడుగు చెల్లీ” అంటూ చతురతను ప్రదర్శించి తరువాత కధకు అంకురార్పణ చేస్తాడు శ్రీ కృష్ణుడు. చాతుర్యాన్ని లాలిత్యంతో కప్పేస్తూ చక్కటి మంద్ర స్వరంతో చెక్కు చెదరని దృడత్వంతో కొనకంటి చిరునవ్వుతో ఈ సన్నివేశాన్ని అత్యున్నత ప్రమాణాలకు చేర్చరు ఎన్ టి ఆర్.

Related:   సి ఎస్ ఆర్ ఆంజనేయులు (11-07-1907 -08-10-1963)

ప్రియదర్శినిలో శ్రీ కృష్ణుని చూడమని అందరూ వత్తిడి చేసినప్పుడు “నాకెవరు కనిపించినా మీరు ఆశ్చర్య పోవద్దు” అంటూ లీలా మానుషాన్ని ప్రదర్శిస్తాడు శ్రీ కృష్ణుడు. శకుని దర్శనంతో కృష్ణుడిలో కలిగే మార్పు గమనార్హం. “ఊరికే కనిపిస్తారా అన్నయ్యా మహానుభావులు. ఏ ప్రళయాన్ని సృష్టించడానికో ” అంటూ పెదాలపై చిరునవ్వును చెదరనీయకుండా కళ్ళలోనూ, కంఠ స్వరంలోనూ తీవ్రతను చూపుతారు . చిరునవ్వుతో లీలామానుషాన్ని, స్వరధ్వనిలో మానవత్వాన్ని ఏక కాలంలో సాధించారు ఎన్ టి ఆర్. శ్రీ కృష్ణ పాత్రకు ఎన్ టి ఆర్ అలవరచిన అపూర్వమైన లక్షణాల్లో దీనిది అగ్ర తాంబూలం.

శిష్య వాత్సల్యంతో బలరాముడు లక్ష్మణ కుమారుడితో శశిరేఖ వివాహం నిర్ణయించినప్పుడు శ్రీ కృష్ణుడు ఏమాత్రం తొట్రుపడడు. ఇక్కడనుండి ఆయన నడిపించిన నాటకం ప్రారంభమవుతుంది.

వీరపత్నివి, వీరమాతవు ఇంత బేలవవుతావనుకోలేదు. అన్నగారి భావం తెలిసిపోయిందిగా. ఇక్కడ నీ మొరాలించేవాళ్ళు లేరు. ఇక నీ దిక్కున్న చోటుకు వెళ్ళోచ్చు అంటాడు శ్రీ కృష్ణుడు. మొదటి వాక్యంలో ఆమెకు లాలన, అన్నగారిపరంగా నిష్టూరం కనిపిస్తుంది. చివరిలోమాత్రం క్షాత్ర పౌరుషాన్ని ఉసిగొలుపుతాడు. అప్పటికే జరగాల్సిందంతా ఆయన సిద్ధం చేస్తాడు. వాక్యానికి ఉన్న అర్థ భేధాన్ని అభినయించి రసస్పోరకం గావించారు మహానటుడు ఎన్ టి ఆర్. భావగర్భితమైన వ్యంగ్యానికి ధ్వని విన్యాసంలో అపూర్వమైన స్తానాన్ని కల్పించడమే ఎన్ టి ఆర్ ప్రత్యేకత.

లగ్నాన్ని నిర్ణయించినప్పుడు శ్రీ కృష్ణుని మొహంలో చిరునవ్వు లాస్యం చేస్తుంది. దుర్ముహూతమని తెలిసీ కౌరవులు తొందరపడుతున్నప్పుడు “అన్నయ్య! వారి తొందరే మన తొందరానూ. నేనూ ఈ లగ్నాన్నే సమర్ధిస్తున్నాను, కాలం చాలదనుకుంటే తప్ప” అన్న వాక్యంలో వ్యంగ్యాన్ని, సమర్ధననూ విలక్షణ రీతిలో మిళితం చేస్తారు ఎన్ టి ఆర్. తేల్చి పలకటంలో అభినయ విశేషం. ముఖంలో తెలియరాని కొంటెతనంతో అవతలివారిని భ్రమలోకినెట్టడం చూస్తున్నవారికి సరదాగా అనిపిస్తుంది. ఆయన ముఖంలో ఏ భావమైనా హాయిగా ఒదిగిపోయి తెరపై అపూర్వంగా ప్రజ్వరిల్లుతుంది.

ఘటోత్కచుడు శశిరేఖను ఎత్తుకుని పోవడానికి ద్వారకకు వచ్చి దిక్కుతోచని స్తిథిలో పడ్డప్పుడు శ్రీ కృష్ణుడు ముసలి బ్రాహ్మణుడిగా అతనికి కనిపిస్తాడు. అక్కడ ఆయనపాడే తత్వం జరగబోయేదానికి ప్రతీక. అందులో మాయా తత్వాన్ని ప్రభోదిస్తాడు శ్రీ కృష్ణుడు. ప్రపంచం మాయా సమ్మోహనంలో నడుస్తున్నప్పుడు పాత్రధారులకు సూత్రధారిని నేనే అని దానర్ధం. ఆ సమయంలో శ్రీ కృష్ణుడి ముందు బలం ప్రయోగించి ఘటోత్కచుడు ఓడిపోయినప్పుడు రాక్షస బలం దైవ బలం ముందు ఎందుకూ కొరగానిదని పరోక్షంగా నిరూపిస్తాడు.

అటు తర్వాత శశిరేఖను ఘటోత్కచుడితో పంపి, ఆ స్థానంలో అతనినే మాయా శశి రేఖగా నాటకమాడించి పెళ్ళిని రసాభాస చేస్తాడు. ధర్మ పీఠం ద్వారా శకునిచేత కౌరవుల కుటిలోపాయాలు, ఎత్తుగడలు చెప్పించి బలరాముడికి అర్థమయ్యేలా చేస్తాడు. కౌరవుల కుయుక్తులకు చరమగీతం పాడి శశిరేఖాభిమన్యుల వివాహం జరిపిస్తాడు. పరమాత్మగా దివ్య మంగళప్రద రూపాన్ని చూపి అందరినీ అనుగ్రహిస్తాడు.

మొదటిసారి పూర్తి స్థాయి శ్రీ కృష్ణుని పాత్రలో సాక్షాత్కరించి ప్రేక్షకలోకంలో సంచలనాలు సృష్టించారు ఎన్ టి ఆర్. ఈ చిత్రంలో శ్రీ కృష్ణ పాత్ర పోషణ సకల జనమనోరంజకమై అలరారింది. వారి హృదయాలలో గాఢమైన ముద్రవేసి వారి ఇంట పూజా మందిరాలలో ఆయన చిత్రపటాలు కొలువుతీరాయంటే జనాన్ని ఎంతగా ఎన్ టి ఆర్ ప్రభావితం చేసారో అర్థం చేసుకోవచ్చు. కాలక్రమంలో శ్రీ కృష్ణ పాత్రకు మరింత మెరుగులు దిద్ది “న భూతో న భవిష్యత్తుగా” నిలిచిపోయారు ఎన్ టి ఆర్.

శ్రీ కృష్ణుని గటప్లో ఉన్న calendars ఆ రోజుల్లోనే 5,00,000 విజయా సంస్థ ప్రెస్ నుండి అధికారికం గా అమ్ముడైనట్లు నాగిరెడ్డి పలు సందర్భాలలో పేర్కొనడం జరిగింది. ఇక డూప్లికేట్లు ఎన్ని అమ్ముడయ్యాయో ఊహకందని విషయం.

లాహిరి లాహిరి లాహిరిలో పాట నోట నానని తెలుగు ప్రేక్షకులుండరు. లాహిరి అంటే . మైకము అని అర్థం. ఈ ఒక్క పాట ఆధారంగా చేసుకుని కథంతా రూపకల్పన చేస్తారు. ‘లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా, ఊగెనుగా, తూగెనుగా అని మొదలెట్టి ‘రసమయజగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో, ఎల్లరి మనములు ఝల్లనజేసే చల్లనిదేవుని అల్లరిలో’ అని ముగించడం పింగళివారికే చెల్లింది. ప్రేమ మైకం లో జగమంతా ఓలలాడుతోంది అని ఆరంభించి, ఆ మైకానికి కారకుడు శ్రీకృష్ణుడే అని ముగింపు పలకడం ఓ అద్భుతమైన ఆలోచన. మొత్తం కథని ఈ ఒక్క పాటలో చెప్పారనిపిస్తుంది. మాయా బజార్ కథకి కీలకమైన వ్యక్తి శ్రీకృష్ణుడు, ఆయన మాయా విశేషంవల్లనే కథ అంతా నడుస్తుంది. ఈ విషయాన్ని ఒక్క పాటలోనే ఎంతో అందంగా పొదిగారు పింగళి.

Related:   కలెక్టర్ గారింట్లో దెయ్యం

“ఓహోహో నీవా, నీకు తెలియదూ నేనెవరో, తెలియనివారికి చెప్పినా తెలియదు” – అంటే నాకు నువ్వెవరో తెలుసు, నీకు నేను తెలియదూ, ఎదురుగుండా ఉన్న నన్నే గ్రహించలేకపొతే, చెప్తే మాత్రం తెలుస్తుందా…ఎంత సత్యం! నేను ఎవరో నీకు తెలీదు – అన్న దాన్లో ఎంత అర్థముంది.

ఎంత ఔచిత్యం పాటించారో ప్రతీ ఒక్క సంభాషణలోనూ. భావిస్తే ఎంతైనా గ్రహించవచ్చు ఆయన రాసిన మాటలలో. ఒక్క పొల్లు కూడా అనవసరంగా పడదు. ప్రతీ పదంలోను సాహిత్య సంపద, భావ చాతుర్యం గుబాళించి ఉంటుంది. పదాలు వాడడంలో ఆయన బ్రహ్మాండనాయకుడు అని చెప్పుకోవచ్చు.

ఎరుకకుండ వచ్చావు, ఎరుకలేకపోతావు- ఆధ్యాత్మికత- నేనున్నాని తెలుసుకోలేకపోతే నువ్వున్నావని తెలుసుకోలేవు అని భగవంతుడు చెబుతున్నట్టు – అద్భుతం కదూ.

సినిమాలో శ్రీ కృష్ణుడి గొప్పతనం అన్ని పాత్రల నోటినుంచి వింటూ వస్తాం. ఆ మాటలలో కొన్ని.

1. రుక్మిణీ! అక్కడ (రాజసూయ యాగంలో) నా తమ్ముడు కృష్ణుడు లేకపోతే ఎవరి వల్లా ఏదీ అయ్యేదీ కాదు – బలరాముడు.

2. శశిరేఖని లక్ష్మణ కుమారుడికి చేసుకుంటే బలరాముడు మన పక్షం, అతనితో యాదవులు మన పక్షం. అవ్వారితో విధి లేక కృష్ణుడు కూడా పక్షం కాక తప్పదు – శకుని.

3. కృష్ణా, సాక్షాత్తు నీవే సర్వ నిర్వహణకు నిలబడినప్పుడు కాలం సరిపోకపోతుందా – శశిరేఖ పెళ్ళి విషయంలో శకుని.

4. ఈ పెళ్ళికి మీ చిన్నాన్న కూడా ఒప్పుకున్నాడు. శశిరేఖతో రేవతి చివరి అస్త్రంగా

5. ఏమోనయ్యా కృష్ణా అన్నిటికీ నువ్వే ఉన్నావని నా ధైర్యం – రేవతి.

6. ఇలాగే పెళ్ళంతా సందడిగా జరిపించు కృష్ణా. రేవతి కోరిక. ఆ కోర్కె కృష్ణుడు తీరుస్తాడు.

6. ఎల్లరి మనసులను ఝల్లనిపించే చల్లని దేవుడు – రుక్మిణి

7. అఖిల రాక్షస మంత్ర తంత్రాతిశయమున శ్రీ కృష్ణుని సోదరిని – సుభద్ర.

8. శ్రీ కృష్ణుని కలుసుకోవడం కాదు . స్తోత్రం చెయ్యి. వారు ప్రసన్నులవుతారు – హిడింబి.

9. భీష్మ విదురాదులు మన వంశ వృద్ధులు. వంశకర్తలు. వాళ్ళు రాలేదేమని కృష్ణుడైనా అడిగిస్తాడు – దుర్యోధనుడు పెళ్ళికి కదిలిపోతు.

10. కృష్ణుడి అవస్థ చూస్తే నవ్వు వస్తోంది. లక్ష్మణ కుమారుడి పెళ్ళిలో కౌరవుల దృష్ట్యా వారికి అతి సంతృప్తినిచ్చిన విషయం కృష్ణుడంతటివాడి అవస్థ.

11. శ్రీ కృష్ణులు చిద్విలాసులు. వారు అక్కడా (లక్ష్మణ కుమారుడి వివాహం జరుగుతున్న ద్వారకలో) ఉంటారు. ఇక్కడా (అభిమన్యుడి వివాహం జరుగుతున్న ఘటోత్కచుని ఆశ్రమంలో) ఉంటారు – ఘటోత్కచుడు. మాయావి మాత్రమే అయిన ఘటోత్కచుడు అక్కడ మాత్రమే ఉండగలడు.

12. ఇదంతా శ్రీ కృష్ణుల వారి లీల – ఘటోత్కచుడు. ఇది సినిమాలో చివరి డైలాగ్.

13. అటు నేనే, ఇటు నేనే. అది నేనే. ఇది నేనే. అది స్వాహా. ఇది స్వాహా. – శ్రీ కృష్ణుడు.

14. కావచ్చు – కృష్ణుడు రుక్మిణికి జవాబు చెప్పే అవకాశం ఇవ్వడు, రేవతి ప్రియదర్శిని చూసినప్పుడు.

15. ఏముంది, అందరికీ తెలిసిన విషయమే కదా, అర్జునుడు కనిపిస్తాడు. అందరూ కృష్ణుడిని ప్రియ దర్శిని తెరవమన్నప్పుడు.

16. రసపట్టులో తర్కం కూడదు – కృష్ణుడు.

17. లక్ష శనిగ్రహాల పెట్టు. మన శకుని బాబాయి ఈ గదిలో ఉండగా అసలు శని ఏ గదిలో ఉంటే ఏమిటి? స్వీకరించండి తీర్ధులూ అది వారి సంప్రదాయం – కృష్ణుడు. లంచాలు ఇవ్వడం శకుని నైజం అని తేలుస్తాడు కృష్ణుడు.

Related:   మన తెలుగువారికోసం కువైట్లో City bus 🚌 వివరాలు

18. నీళ్ళు కొత్తవి చేసినట్లున్నాయి. ఈ తుమ్ములు పాటి చెయ్యవు – కృష్ణుడు.

అయినా కృష్ణుడు అన్నగారైన బలదేవుడికి తమ్ముడు. వదినగారైన రేవతికి మరిది. వారిద్దరికీ సినిమా మొత్తంలో ఎక్కడా అవిధేయుడై ఉండడు. అన్నగారి మాట వింటూనే తను తలపెట్టిన కార్యం సాధిస్తూ ఉంటాడు. ఎక్కడా అన్నగారు “ఈ పని చేస్తాను” అంటే వద్దని అనడు. వదినగారు “ఈ పని చేయి” అంటే చేయనని అనడు. కౌరవుల కుతంత్రం, శకుని సత్య పీఠమెక్కి చెప్పినప్పుడు కూడా “నేను అసలు శశిరేఖకి అభిమన్యుడితో వివాహం జరిపిస్తున్నాననడు. శశిరేఖ అక్కడున్న విషయం పెద మామగారికి అత్తగారికి ఘటోత్కచుడే చెప్తాడు.

చివరికి “ఇదంతా శ్రీ కృష్ణులవారి లీల” అంటూ ఘటోత్కచుడు తెలియచేసినప్పుడు అవుననడు. కాదనడు. మనోహరంగా నవ్వుతూ నిలబడతాడు.

విన్నావటమ్మ ఓ యశోద

శ్రీ కృష్ణుని చిన్ననాటి ముచ్చట్లు శ్రీ కృష్ణుని ఎదుటే ఓ అంతర్ణాటకంలా ప్రదర్శించడం (కె వి రెడ్డి గారి దర్శకత్వ ప్రతిభ) , యాదవ కుటుంబమంతా మైమరచి చూస్తుండగా నిండు కొలువులో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నట్లు ఇక్కడ శ్రీ కృష్ణుడికి తెలియడం , తద్వారా పాండవులు తమ రాజ్యాన్ని కోల్పోయారని ఈ పాట ద్వారా తెలియచేస్తారు.

తిలంగ్ రాగంలో మొదలై, కాలి గజ్జెల సందడి చేయక దగ్గర చారుకేశి రాగాన్ని అందుకుని, భామలందరొక యుక్తిని పన్ని దగ్గర పీలూ రాగాన్ని సృశిస్తూ, కాళింది మడుగున దగ్గర శంకరాభరణం స్వరాలపై నడుస్తుంది ఈ పాట. ఎన్ టి ఆర్, సంధ్య, సావిత్రి, గుమ్మడి, చాయదేవి, నాగభూషణం వంటి ముఖ్య పాత్రలతోపాటు ఎందరో కనిపిస్తారు ఈ పాటలో.

అంతర్నాటకంలో బాల కృష్ణుడిగా వేసినది ప్రముఖ తార పుష్పవల్లి కుమారుడు బాబ్జీ. అక్కడ ఆ ముచ్చట అలా ఉండగా విన్నావటమ్మ ఓ యశోద గోపిక రమణుల కల్లలు అంటుంటే తిలకిస్తున్న రుక్మిణి పాత్రధారిణి సంధ్య నవ్విన నవ్వులు, భామలందరొక యుక్తిని పన్ని గుమ్మమునొకరుగ కాచియుండగా అనే వాక్యం తర్వాత శశిరేఖగా నటించిన సావిత్రి చిన్న పిల్లలా ఉత్సాహంగా చేతితో రుక్మిణిని కదపడం ఇవన్నీ మాయా బజార్ అభిమానులు తల్చుకుని తల్చుకుని మురిసిపోయే ముచ్చట్లు.

సంగీతం : ఘంటసాల, సాహిత్యం : పింగళి నాగేంద్ర రావు,
గానం : పి.లీల, సుశీల, స్వర్ణలత(సీనియర్)
రాగం : తిలంగ్, చారుకేశి, పీలు

విన్నావ యశోదమ్మా..విన్నావ యశోదమ్మా
మీ చిన్ని కృష్ణుడు చేసినట్టి
అల్లరి చిల్లరి పనులు విన్నావ యశోదమ్మ

యశోద : అన్నెం పున్నెం ఎరుగని పాపడు
మన్నుతినే నా చిన్నితనయుడు
ఏమి చేసెనమ్మా ఎందుకు రవ్వ చేతురమ్మా

గోపికలు : ఆ..మన్ను తినేవాడా? వెన్న తినేవాడా?
కాలిగజ్జెల సందడి చేయక
పిల్లివలె మా ఇంట్లో దూరి
ఎత్తుగ కట్టిన ఉట్టందుకుని
దుత్తలన్నీ క్రింద దించుకుని
పాలన్నీ తాగేశనమ్మా
పెరుగంతా జుర్రేశనమ్మా
వెన్నంతా మెక్కేశనమ్మా

కృష్ణుడు : ఒక్కడే ఎట్లా తినేశనమ్మా?
కలదమ్మా..ఇది ఎక్కడనైనా కలదమ్మా?
విన్నావటమ్మా..విన్నావటమ్మ
ఓ యశోదా! గోపిక రమణుల కల్లలూ
ఈ గోపిక రమణుల కల్లలూ..

గోపికలు : ఆ..ఎలా బూకరిస్తున్నాడో
పోనీ పట్టిద్దామంటే చిక్కుతాడా
భామలందరొక యుక్తిని పన్ని
గుమ్మము నొకరుగ కాచియుండగా
ఒకరింట్లో విని గజ్జెల గలగల
ఒకరింట్లో విని వేణుగానమూ
ఆహా…ఇంకేం
దొంగ దొరికెనని పోయిచూడగా
ఛెంగున నెటకో దాటిపోయే
ఎలా వచ్చెనో ఎలా పోయెనో
చిలిపి కృష్ణునే అడుగవమ్మా

కృష్ణుడు : నాకేం తెలుసు నేనిక్కడ లేందే

యశోద : మరి ఎక్కడున్నావు?

కృష్ణుడు : కాళింది మడుగున విషమును కలిపె
కాళియు తలపై తాండవమాడి
ఆ విషసర్పము నంతము జేసి
గోవుల చల్లగ కాచానే..గోవుల చల్లగ కాచానే..

ద్రౌపది : హే కృష్ణా..హే కృష్ణా
ముకుందా మొరవినవా
నీవు వినా దిక్కెవరు దీనురాలి గనవా కృష్ణా
నా హీన గతిని గనవా..కృష్ణా కృష్ణా కృష్ణా

ప్రియ దర్శిని

పెండ్లి ముహూర్తం

పతాక సన్నివేశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *