సీతా రామ కల్యాణం (06-01-1961)

Spread the love

అపురూప చిత్రాలు – 27
సీతా రామ కల్యాణం (06-01-1961)

1961 వ సంవత్సరం. అప్పుడు నేను 4 వ తరగతి పరీక్షలు రాసి 5 వ తరగతి కి వచ్చాను. ఆ ఏడాది ఎన్ టి ఆర్ నటించిన 8 సినిమాలు సీతా రామ కల్యాణం, ఇంటికి దీపం ఇల్లాలే, సతీ సులోచన, పెండ్లి పిలుపు, శాంత, జగదేక వీరుని కధ, కలసి ఉంటే కలదు సుఖం, టాక్సీ రాముడు,

అక్కినేని నటించిన 7 సినిమాలు వెలుగు నీడలు, భార్యా భర్తలు, భక్త జయ దేవ, బాటసారి, వాగ్దానం, శబాష్ రాజా, ఇద్దరు మిత్రులు,

ఇతరులు నటించిన 11 సినిమాలు ఉషా పరిణయం, బావా మరదళ్ళు, కృష్ణ ప్రేమ, ఋష్యశృంగ, శ్రీ కృష్ణ కుచేల, కన్న కొడుకు, గుళ్ళో పెళ్ళి, వరలక్ష్మీ వ్రతం, పెళ్ళి కాని పిల్లలు, తండ్రులు కొడుకులు, బికారి రాముడు, విడుదలయ్యాయి.

ఆ ఏటి సూపర్ హిట్ సినిమా జగదేక వీరుని కధ (09-08-1961 విడుదల). ఆదోని, మదనపల్లి, షొలాపూర్ లలో తొలి 100 రోజుల చిత్రంగా రికార్డు సృష్టించిన సినిమా. 19 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది. ఒరిస్సాలో ఈ సినిమా రజతోత్సవం జరుపుకోవడం ఒక విశేషం.

సీతా రామ కల్యాణం, సతీ సులోచన, పెండ్లి పిలుపు, జగదేక వీరుని కధ, కలిసి ఉంటే కలదు సుఖం , వెలుగు నీడలు, భార్యా భర్తలు, శభాష్ రాజా, ఇద్దరు మిత్రులు శత దినోత్సవాలు జరుపుకున్నాయి.

*********

06-01-61 న విడుదలైన సీతా రామ కల్యాణం చిత్ర విశేషాలు:-

ఎన్ టి ఆర్, కె వి రెడ్డి దర్శకుడిగా, తాను శ్రీ రాముడిగా, ఎస్ వి ఆర్ రావణుడిగా ఓ సినిమా తీయాలని సంకల్పించారు. ఇంతలో ఎన్ టి ఆర్ సన్నిహితులు ధనేకుల వెంకట కృష్ణ చౌదరి శివ పురాణాది పలు గ్రంధాలనుంచి రావణుడిలోని రసజ్ఞతను, కొన్ని కొత్త అంశాలను వెల్లడించిన పుస్తకాన్ని ఎన్ టి ఆర్ కు ఇచ్చారు. ఆ పుస్తక పఠనంతో ఎన్ టి ఆర్ కు రావణ పాత్ర పట్ల మక్కువ కలిగి తానే ఆ అపాత్రను పోషిస్తానన్నారు. దీనికి కె వి రెడ్డి రాముడు, కృష్ణుడు పాత్రలలో పేరు పొందిన ఎన్ టి ఆర్ ను తాను రావణ పాత్రలో చూడలేనన్నారు. కాని ఎన్ టి ఆర్ మరింత పట్టు పట్టడంతో కె వి రెడ్డి దర్శకుడిగా తప్పుకున్నారు. ఎన్ టి ఆర్ తొలిసారి స్వీయ దర్శకత్వంలో సీతా రామ కల్యాణం చిత్రాన్ని రూపొందించడం జరిగింది. తాను దర్శకత్వం వహించినా తన పేరు వేసుకోక ఎన్ ఏ టి యూనిట్ పేరుతో టైటిల్స్ వేయటం ఎన్ టి ఆర్ స్పెషాలిటీ. చిత్రం ప్రధమార్ధం రావణ పాతర్కు ప్రాధాన్యత ఉండేలా రూపొందటం జరిగింది.

శ్రీ రాముని పాత్రకు నూతన నటుడు హరనాధ్ ను, లక్ష్మణుడిగా శోభన్ బాబును, సీతగా అంతకుముందు రాణీ రత్న ప్రభలో ఓ నృత్య పాత్ర పోషించిన మణిని ఎన్నుకున్నారు. తరువాత ఆమె తన పేరు గీతాంజలిగా మార్చుకున్నారు. ఈ చిత్రంలో సీత పాత్రకు టి జి కమలాదేవి డబ్బింగ్ చెప్పారు. మండోదరిగా నటించిన బి సరోజాదేవికి మోక్షగుండం కృష్ణ కుమారి గాత్రం అందించారు. నలకూబరునిగా హాస్య నటుడు సారధి ఈ చిత్రంతో ఇండస్త్రీకి పరిచయమయ్యారు. మణి సోదరి స్వర్ణ శూర్పణఖ పాత్ర పోషించారు. కుంభకర్ణునిగా ఉదయ కుమార్, విభీషణుడిగా ఎ వి సుబ్బారావు (జూనియర్), అహల్యగా అనూరాధ, భరతుడిగా కొమ్మినేని శేషగిరి, చిన్నప్పటి రాముడిగా మాస్టర్ సుభ్రమణ్యం, చిన్నప్పటి లక్ష్మణుడిగా, ప్రహ్లాదుడిగా మాస్టర్ నాగరాజు (లవకుశ ఫేం), మారీచుడిగా మహంకాళి వెంకయ్య, పరశురాముడిగా కె వి ఎస్ శర్మ, వశిష్టుడిగా మల్లాది, విశ్వామిత్రుడిగా గుమ్మడి, దశరధుడిగా నాగయ్య, కౌసల్యగా రమా దేవి, జనకుడిగా మిక్కిలినేని, అతని అర్ధాంగిగా చాయాదేవి, వయశ్యుడిగా కస్తూరి శివరాం, ఋష్యశృంగుడిగా వి శివరాం నటించారు.

ఈ చిత్రానికి కధ, సేకరణ డి వి బి కృష్ణ చౌదరి, మాటలు , పాటలు సముద్రాల రాఘవాచార్య , సంగీతం గాలిపెంచల నరసింహారావు, నృత్యం వెంపటి సత్యం, కళ టి వి ఎస్ శర్మ, కూర్పు ఎ పి ఎస్ వీరప్ప, చాయాగ్రహణమ్రవికాంత్ నగాయిచ్, సమ్యుక్త దర్శకుడు ఐ ఎన్ మూర్తి, నిర్మాణ సంచాలకుడు పుండరీకాక్షయ్య, నిర్మాత నందమూరి త్రివిక్రమరావు.

అలకాపురిని జయించి పుష్పక విమానంలో లంకకు వెడుతూ రావణ బ్రహ్మ ఈశ్వర దర్శనం కోసం కైలాసం వెళ్ళి నందిచే శాపం పొందటం, పరమ శివుని రుద్ర గానంతో మెప్పించి వరాలు పొందటం, దేవతల వినతి, మహా విష్ణువు ఆనతితో లక్ష్మి మాతంగిగా జన్మించి, వేదవతిగా రావణుడి స్పర్శచే భస్మమై లంకకు మందసంలో చేరటం, సముద్రానికావల భూస్థాపితమైన మందసంలో బాలికగా సీత జనకుని ఇంట పెరగటం, పుత్రకామేష్టి వలన దశరధునకు శ్రీ రామాదులు జననం, విశ్వామిత్ర యాగ సమ్రక్షణ, అహల్య వృత్తాంతం, సీతా స్వయంవరం, రావణుడి భంగపాటు, మండోదరి విచారం, రావణ ప్రేరణతో పరశు రాముడు శ్రీరాముని చేత పరాజయం, అవతార సమాప్తి, సీతా రాముల కల్యాణం తో కూర్చిన కధ సీతా రామ కల్యాణం.

ఎన్ టి ఆర్ తొలి చిత్రం మన దేశం సినిమాకు రెహమాన్ కెమెరామెన్. ఆ తరువాత ఎన్ టి ఆర్ సొంత సినిమాలకు రెహమాన్ కెమెరామెన్ గా పని చేశారు. కాని ఈ సీతా రామ కల్యాణం చిత్రం షూటింగ్కి వారు సమయానికి రాకపోవడంతో ఎన్ టి ఆర్ భాభూ భాయ్ మిస్త్రీ సహాయకుడు, ఉత్తర ప్రదేశ్ కు చెందిన రవికాంత్ నగాయిచ్ కు అవకాశమిచ్చారు. దాన్ని వారు ఎంతో నైపుణ్యంతో చిత్రీకరించి ఎన్ టి ఆర్ మెప్పు పొందటమే కాక, ఆ పైన వారి గులేబకావళి కధ, శ్రీ కృష్ణ పాండవీయం, ఉమ్మడి కుటుంబం, వర కట్నం , లవకుశ, వీరాభిమన్యు వంటి పలు చిత్రాలలో తన ప్రత్యేకత నిలుపుకుని హిందీ రంగంలోనూ బిజీ అయ్యారు.

ఈ సినిమాలో కైలాస పర్వతం, దానిని రావణ భ్రహ్మ తలలపై ధరించే సన్నివేశాన్ని ఎంతో నైపుణ్యంతో శ్రద్ధతో చిత్రీకరించటం, దానికి 30 గంటలు పైగా సమయం పట్టడం, ఎన్ టి ఆర్ అంతసేపూ కదలకుండా కూర్చోవటం ప్రత్యేక విశేషం.

నటునిగా రావణ బ్రహ్మ పాత్రను పరిపూర్ణంగా ఆవిష్కరించడమే కాక, ఓ సర్శకునిగా సన్నివేశాలను ఎంతో నిబద్దతతో శాంత, కరుణ, రౌద్రం వంటి నవ రసాలను రసాత్మకంగా ప్రశంసాపాత్రంగా తీర్చి దిద్దారు. భూ కైలాస్ చిత్రంలో నారదుని సూచనలను రావణ బ్రహ్మ అనుసరించే విధానాన్ని ఈ చిత్రంలోనూ కొంతవరకూ అనుసరించటం, చిత్ర ప్రారంభంలో పుష్పకం ఆగటం, నార్ద ప్రోత్సాహంతో శివ దర్శనం కోరటం, ధ్యానంతో కాన రారా కైలాస నివాస అని ప్రార్ధించి, బలంతో కైలాసాన్ని పెళ్ళగిస్తానని ఆవేశపడటం, శివ తాండవ స్తోత్రం, శివ పార్వతుల (జయత్వదబ్రవిభ్రమ) నృత్యం, శివుడు రావణ గర్వభంగం చేయడం, భక్తితో కడుపులోని ప్రేగులు చీల్చి రుద్ర వీణగా మార్చి రావణుడు మ్రోగించడం, ఈ సన్నివేశం కవుల కల్పనకు ధీటుగా చిత్రీకరించడం (ఈ సన్నివేశంలో నేఫద్యానికి వీణా నాదం ఈమని శంకర శాస్త్రి రూపొందిస్తే, ఘంటసా గానం, ఎన్ టి ఆర్ అభినయం ఓ చారిత్రక విశేషంగా ఈ సన్నివేశం నిలిచింది), భస్మంగా మారిన వేదవతిని మందసంలో బంధించి, తన తపో శక్తితో మానినిగా మారుస్తానని పలకడం, దానికి మండోదరి స్పందన, ఋష్యశృంగునిచే దశరధుడు అశ్వమేధం, పుత్రకామేష్టి చేయటం, తరువాత ఓ భక్తుడు దశావతార వర్ణన గానం , మత్స్య – కూర్మ – వరాహ – నారసింహ , వామన, అవతారాలు వివరంగా చూపడం ఓ శిష్యురాలు (జ్యోతి ) నృత్యం, ఘంటసాల గానంలో చిత్రంలో గీతం జయ జగదీశ హరే, శ్రీ రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట యాగ సమ్రక్షణకు వెళ్ళిన సందర్భంలో విశ్వామిత్రుడు “కౌసల్యా సుప్రజా రామా” అని స్తుతించడం , మేలు కొలుపు, బల, అతి బల విద్యలు నేర్పడం, తాటక వధ ఈ అంశాలు వివరంగా చిత్రీకరించారు.

స్వయంవరంలో భంగపడిన రావణుడు సీతయే వేదవతి అని మండోదరిద్వారా గ్రహించి తిరిగి ఆమె పై ప్రతీకారం తీర్చుకుంటాననే సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. మీరే భాగ్యం, మాంగల్యం అని మండోదరి అనగా వీర పత్నివి, ఇంద్ర జిత్ బిరుదు పొందిన మేఘనాధుని తల్లివి, వీర మాతవు, అప్రతిహత పరాక్రమోపేతుడైన రావణుని ఇలాలివి, నీకు చిన్నతనం తేవటానికి నేనంగీకరించను, ఓ అబల ప్రతీకారేచ్చకు లొంగను, లంకా ప్రాభవం నాశనం కానీ, నా వంశం నిర్వీర్యం కానీ, నా ప్రాణాలు పోనీ, సర్వ నాశనం కానీ, సీతను చెర పట్తి తీరతాను అంటాడు రావణుడు.

రచయిత సముద్రాల రచనకు ఎన్ టి ఆర్ గంభీరమైన ఉచ్చారణ, నటన, అద్బుత చిత్రీకరణకు సన్నివేశం అద్దం పడుతుంది. సీతా రాముల కల్యాణం చూతము రారండి పాటను వివరంగా, రజకులు వధూవరుల ముందు దుప్పట్లు పర్చటం వంటి చిన్న అంశాలను, మరోవైపు పరశురాముడు రావడం చూపుతూ పాటను ఆకట్టుకునేలా చిత్రీకరించడం దర్శకునికే చెల్లింది. సీతా రాముల కల్యాణం చూతము రారండీ (సుశీల బృదం) పాటలో రాముని దోసిట నీలపు రాయి, ఆ పైన సీత దోసిట కెంపుల పోగు వర్ణన అద్భుతం. ఆ తరువాత బాపు సంపూర్ణ రామాయణంలో ఈ సన్నివేశం రంగుల్లో అలరించటం, ఆ తరువాతి చిత్రాలలో అనుసరించటం ఓ విశేషం.

తొలుత ఎస్ రాజేశ్వర రావు సంగీత దర్శకత్వం వహించి కాన రారా కైలాసవాస పాటను స్వర పరిచారు. తరువాత వారు విరమించుకోవటం, గాలిపెంచల నరసిమ్హారావు సంగీతం సమకూర్చటం జరిగింది.

Also READ:   దర్భను ఎందుకు పవిత్రమైనదిగా ప్రతిపాదిస్తారు ... 🌾దర్భ యొక్క ప్రాముఖ్యం

ఆ రోజుల్లో విజయా, వాహినీ స్టూడియోల్లో అడవులు, తోటలు అన్ని సెట్స్ వేసి అవుట్ డోర్ లో తీసినట్లు అనిపించేలా చిత్రీకరించడం ఓ విశేషం.

ఈ సినిమాని దర్శకులు కె వి రెడ్డి ప్రత్యేక షో లో వీక్షించి ఎన్ టి ఆర్ ను అభిందించారు. అలాగే ఎన్ టి ఆర్ గురువు కవి సమ్రాట్ విశ్వనాధ సత్య నారాయణ ఈ చిత్ర చూసి శిష్యుని ఆశీర్వదించడం, కచి పీఠాధ్యక్షులు జగద్గురువు శ్రీ పరమాచార్య చంద్ర శేఖర్ సరసవతి ఈ చిత్రం చూసి ఎన్ టి ఆర్ ను ప్రత్యేకంగా ఆశీర్వదించడం ప్రత్యేక విశేషంగా పరిగణించాలి. ఆ తరువాత ఎన్ టి ఆర్ శ్రీ కృష్ణ సత్య (1971), శ్రీ రామ పట్టాభిషేకం (1978) చిత్రాలలో రావణ పాత్రను పోషించారు. (సి వి ఆర్ మాణిక్యేశ్వరి, ఆంధ్ర భూమి వెన్నెల 13-04-2019)

చిత్రంలోని గీతాలు, శ్లోకాలు , పద్యాలు అన్నీ చిరస్మరణీయంగా, రసవత్తరంగా నిలిచాయి. ముక్యంగా సీతా రాముల కల్యాణం చూతము రారండీ గీతం వన్నె తగ్గని మేలిమి బంగారంలా నాటినుంచీ నేటికీ ఓ శుభ మంగళప్రదమైన కల్యాణ గీతంగా శాశ్వతత్వాన్ని సాధించుకోవటం పరమానందకరమైన అంశం. ఈ చిత్రానికి రాష్ట్రపతి యోగ్యతాపతర్మ్ లభించింది.

రావణ బ్రహ్మలోని వివిధ కోణాలను అపూర్వ రీతిలో ఆవిష్కరించిన ఘనత సినీ ప్రపంచంలో నటుడు – దర్శకుడు నందమూరి తారక రామారావుకే దక్కింది.

సంకల్ప బలంతో శివ సాక్షాత్కారాన్ని పొంది హిమశృగ సమంగా భక్తి భావ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన రావణునిలోని మహత్తర కోణాన్ని, అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, భూతల, పాతాళ లోకాలను పాదాక్రాంతం చేసుకొని మహేంద్రుని జయించి నవ గ్రహ దేవతలను పాదమట్టనం గావించి అమరలోక విజేతయై లంకాధినేతగా అలరారిన అపార వైభవాన్ని, సర్వమూ కోల్పోవడానికి కారణభూతమైన మానసిక దౌర్భల్యాన్ని, అద్భుత రీతిలో తెరకెక్కించిన ఎన్ టి ఆర్ ప్రజ్ణా విశేషాలకు విమర్శకులు సైతం అచ్చెరువొంది ఆనందంతో కరతాళ ద్వనులు చేయడం గొప్ప విశేషం.

సీతారాముల జననం, అస్త్ర విద్యా కోవిదులై యాగ సంరక్షణ చేసిన రామలక్ష్మణుల కల్యాణం మరిచిపోలేని రీతిలో తెరకెక్కించిన దర్శక ప్రాభవం ఎన్ టి ఆర్ కి మాత్రమే సొంతం. కొన్ని చిత్రాలు కధా బలం తోనూ, మరికొన్ని చిత్రాలకు సంగీతమే ప్రాణంగాను ప్రేక్షకులను మురిపిస్తాయి. సీతా రామ కల్యాణం చిత్రం లో ఎన్ టి ఆర్ నట వైభవం ప్రేక్షకులను మరో లోకం లోకి తీసుకు పోయింది. పులకాంకితులను చేసింది. గగుర్పాటును కలిగించింది. ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక పాత్రద్వారా ప్రేక్షకులను ఇంతటి స్పందనకు గురి చేయడం ఈ చిత్రంతోనే మొదలయ్యిందని నిస్సంకోచంగా చెప్పవచ్చు.

శివానుగ్రహం కోసం కడుపులోని ప్రేవులను పెళ్ళగించి వాటితో వీణానాదం చేస్తూ ఎన్ టి ఆర్ తన మోములో పలికించిన భావాలను చూసి అక్కినేని దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సన్నివేశం ఆయనను ఎంతో ప్రభావితం చేసింది. ఇంట్లో అద్దం ముందు కూర్చొని తాను కూడా ఆ ప్రయత్నం చేయగా ఆ ఎఫెక్టు మాత్రం ఆయనకే స్వంతం అని ఆయన చెప్పడం గొప్ప విశేషం.

ఈ చిత్రం తరవాత కొద్దికాలానికి ఎన్ టి ఆర్ దుర్యోధన పాత్ర (1966 శ్రీ కృష్ణ పాండవీయం) చేయడం జరిగింది. ఈ రెండు పాత్రలలోనూ ఎన్ టి ఆర్ చూపిన వైవిధ్య భరితమైన బాణీ ప్రేక్షకులకు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. మహా నటుడిగా ఎన్ టి ఆర్ ను అగ్ర భాగాన అధిష్టించింది. ఇటువంటి పాత్రలు చేసేటప్పుడు దగ్గరి పోలికలు చాలా కనిపిస్తాయి. అటువంటి భావం ప్రేక్షకులకు ఇసుమంతయినా కలుగనీయకపోవడమే ఎన్ టి ఆర్ ప్రత్యేకత. అదే ఆయనలోని సృజనాత్మకతకు ప్రబల నిదర్శనం. ఈ చిత్రం 9 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది.

మాయా బజార్ (27-03-1957) సినిమాతో ఆంధ్రుల ఆరాధ్య దైవంగా మారిన ఎన్ టి ఆర్ దృష్టిని మన పురాణాల్లోని ప్రతి నాయక పాత్రల వైపు మళ్ళించి , వాటికి కొత్త రూపును సంతరించాలన్న తపన ఆయనలో రేకెత్తించిన చిత్రం సీతా రామ కల్యాణం. అలాగే హాస్య పాత్రలకు లాస్య పాత్రలకు తరువాతి కాలంలో చిరునామాగా మారిన గీతాంజలికి తొలి చిత్రం. హరనాధ్ కు పురాణ చిత్రాల్లో ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేసిన చిత్రం. 06-01-1961 న విడుదలైన ఈ సినిమాలోని శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి పాట ఈనాటికీ తెలుగు వారి ఇళ్ళల్లో పెళ్లిళ్లకు ముఖ్య నేపధ్య సంగీతం.

బెజవాడలో చదువుకునే రోజుల్లో నేషనల్ ఆర్ట్ థియేటర్ స్థాపించి పలు నాటకాలు ప్రదర్శించే వారు నందమూరి తారక రామా రావు. అందులో కిరాయి నటులంటూ ఎవరూ ఉండేవారు కాదు. ఎవరి ఖర్చులు వారే భరించే వారు. సమయపాలన, క్రమ శిక్షణ, సామాజిక దృక్పధం ఆనాడు ఆ సంస్థ పాటించిన ఆదర్శ సూత్రాలు. తను సినిమా రంగంలోకధా నాయకునిగా నిలదొక్కుకున్న తరువాత ఆయన ఎన్ ఏ టి బ్యానర్ పైనే సినిమాలు కూడా తీయడం ఆరంభించారు. సోదరుడు త్రివిక్రమరావు నిర్మాణ వ్యవహారాలు చూసేవారు. బావమరిది అట్లూరి పుండరీకాక్షయ్య ప్రొడక్షన్ వ్యవహారాలు చూసేవారు.

ఎన్ ఏ టి పతాకం పై మొదట వచ్చిన పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు ఎన్ టి ఆర్ తన అభిరుచులను, సామాజిక బాధ్యతను కలగలిపి ఆ రెండు సినిమాలను ఎలాంటి వ్యాపార మర్మాలు లేకుండా తీశారు. సినీ మేధావుల ప్రశంసలు ,ప్రభుత్వ పతకాలు లభించాయే తప్ప ఆర్ధికం గా ఆ సినిమాలు ఎన్ టి ఆర్ కు చాలా నష్టం చేశాయి.

దాంతో తన అభిరుచులు ప్రక్కనబెట్టి కళను కాసుతో ముడి పెట్టి సినిమాలు తీయడం ఆరంభించారు. అలా వచ్చినవే జయ సిం హ , పాండు రంగ మహాత్మ్యం. అవి ఆయనకు డబ్బుతో బాటు బ్యానరుకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఇదీ సీతా రామ కల్యాణం సినిమాకు ముందు ఎన్ ఏ టి సంస్థ నేఫద్యం. పాండు రంగ మహాత్మ్యం సినిమా 1957 నవంబర్ 28 న విడుదలయింది. శత దినోత్సవాలు చేసుకుంది.

ఆ సినిమా తరువాత నందమూరి సోదరులు నిజానికి అల్లూరి సీతా రామ రాజు సినిమా తీయాలి. వాళ్ళు ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు చేశారు కూడా. అయితే సీతా రామ రాజు సినిమాకు చాలా చారిత్రక విశేషాలు సేకరించాల్సి ఉందంటూ ఎన్ టి ఆర్ ఆ ప్రోజెక్టును పక్కన పెట్టేశారు. ముందుగా సీతా రామ కల్యాణం ఆరంభించారు. అల్లూరి సీతా రామ రాజు విషయం లో ఎన్ టి ఆర్ అలా నిర్ణయం మార్చడం అప్పట్లో ఆయన అభిమానులకు విపరీతమైన నిరాశ కలిగించింది.

ఎన్ టి ఆర్ ఇలా నిర్ణయం మార్చడం వెనుక మరో కారణం ఉంది. పాండు రంగ మహాత్మ్యం సినిమా విడుదలైన 5 నెలలకు భూ కైలాస్ విడుదలయింది. అందులో ఆయన రావణాసురునిగా నటించారు. ఆ వేషం ఆయనకు మంచి పేరు తెచ్చింది. ప్రతి నాయక పాత్ర అయినా అది ఎన్ టి ఆర్ ధారణలో వైవిధ్యాన్ని సంతరించుకుంది.

పురాణ పాత్రలపట్ల ఆయన మక్కువకు కారణం మాయా బజార్. ఆ సినిమా ఎన్ టి ఆర్ ని తెలుగు లోగిళ్ళలో దేవుడిని చేసి కూచోబెట్టింది. దానితో ఆయన చూపు పురాణ పాత్రలమీదకు మళ్ళింది. పురాణ పాత్రలపట్ల ఆసక్తి, అవి వేసి సెబాష్ అనిపించుకోవాలన్న తపన పెరిగాయి. వాటిని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఎన్ టి ఆర్ భారత భాగవతాలతో బాటు కంబ రామాయణం, తులసీ రామాయణాలను కూడా అధ్యయనం చేశారు.

అనితరసాధ్యమైన పాత్రలంటూ తనకు కొన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఉబలాటం ఎన్ టి ఆర్ లో మొదలయ్యింది. ముఖ్యంగా రావణాసురుడి పాత్ర ఆయన మనసులో బాగా నాటుకు పోయింది. బ్రహ్మ వంశజునిగా , శివ పూజా దురంధరునిగా, సకల శాస్త్ర పారంగతునిగా, రాజనీతిజ్ఞునిగా రావణాసురుని వ్యక్తిత్వంలోని వైవిధ్యం ఎన్ టి ఆర్ ను బాగా ఆకర్షించింది. భూ కైలాస్ సినిమాలోని రావణాసురుడి పాత్రకు పూర్తి భిన్నం గా ఈ సినిమాలోని రావణ బ్రహ్మను రూపు దిద్దారు. ఆ రోజుల్లో పురాణ సినిమాలకు పెట్టింది పేరయిన సముద్రాల రాఘవాచార్య ఈ సినిమాకు రచన చేశారు. ఎన్ టి ఆర్ అభిరుచులకు అనుగుణం గా ఆయన రావణాసురుని పాత్రను మలచారు. ఎన్ టి ఆర్ ఈ సినిమాకు ఎవరినీ దర్శకునిగా ఎవరినీ నియమించలేదు. తనే పర్యవేక్షించారు.

ఎక్షిక్యూటివ్ డైరెక్టర్ గా ఐ ఎన్ మూర్తి వ్యవహరించారు. ఐ ఎన్ మూర్తి అంటే సుఖ దుఖాలు, జగత్ కిలాడీలు సినిమాల దర్శకుడు. ఆయన తమిళం లో కూడా అరవైలో పేరున్న దర్శకుడు. ఎక్కువగా జయ శంకర్ సినిమాలు చేసే వారు.వరవేర్ప్ (స్వాగతం), కన్నన్ వరువాన్ (కృష్ణుడు వస్తాడు) వంటి సినిమాలు ఆ రోజుల్లో తమిళం లో బాగా ఆడాయి.

సీతా రామ కల్యాణం సినిమాకు ముందుగా ఎస్ రాజేశ్వర రావు గారిని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. కానీ ఆయనకు నిర్మాతలకు పొసగలేదు. సాలూరి విరమించుకోవడమూ, గాలి పెంచల నరసిం హారావు గారు రావడమూ జరిగిపోయాయి. సీతా రామ కల్యాణం సినిమాలో టైటిల్ సాంగ్ “శ్రీ సీతా రాముల కల్యాణము చూతము రారండీ” నరసిం హారావు సంగీత సృజనే. 56 సంవత్సరాలైనా ఈనాటికి కూడా తెలుగు వారి వివాహ వేడుకల్లో ఈ పాట అంతర్భాగమైపోయింది. తెలుగు వారి సంస్కృతీ సంప్రదాయాల్లో అంతర్వాహిని ఐపోయింది.

Also READ:   నేడు (30-08-2018) జమున (30-08-1937) గారి 82 వ పుట్టినరోజు శుభాకాంక్షలు

కాలం మారినా, మనుషులు మారినా, విలువలు మారినా పెళ్లి మంటపంలో ఈ పాట తప్పనిసరి. పెళ్లి క్యాసెట్లలో అంతకన్నా తప్పనిసరి. సుశీల బృందం పాడిన ఈ పాటలో వినిపించే సన్నాయి ప ద ని సలు ఈ హై టెక్ యుగంలో కూడా మనల్ని మరో లోకం లోకి తీసుకు వెళ్ళి మనసును రాగ రంజితం చేస్తాయి.

సంగీత యజ్ణం అయ్యాకా నటీ నట వర్గం ఎంపిక మొదలయ్యింది. త్రివిక్రమరావు అప్పటిదాకా రామ, రావణ పాత్రలు రెండూ ఎన్ టి ఆర్ వేస్తారని భావిస్తూ వచ్చారు. కానీ తాను రాముడు వేషం వేయడం లేదని ఎన్ టి ఆర్ చెప్పగానే ఆయన బిత్తరపోయారు. సినిమా ఏమవుతుందోనని కంగారు పడ్డారు. ప్రతి నాయక పాత్రలో అన్న గారు ప్రజలను ఎలా రంజింప చేయగలరో ఆయనకి అంతు పట్టలేదు. చాలా రోజులు రెండు వేషాలు తనే వేయ వలసిందిగా అన్నగారిని కోరారు.

సినిమా షూటింగ్ మొదలయ్యాకా గాని ఆయనకు అన్నగారి ఆంతర్యం బోధ పడలేదు. పౌరాణికాలంటే ట్రిక్ ఫొటోగ్రఫీ తప్పనిసరి. అప్పట్లో అలాంటి సన్నివేశాలకు రెహమాన్ చాలా ప్రసిద్ధి. కానీ ఆయన పెద్దవాడై పోయారు. అందుకని ఎన్ టి ఆర్ ఒక కొత్త యువ చాయాగ్రాహకుడిని తెలుగు సినిమాకు పరిచయం చేద్దామని అనుకున్నారు. అలా ఆయన అన్వేషణలో తారసపడ్డవారే రవికాంత్ నగాయిచ్. ఆయన ఉత్తరాదివారు. బొంబాయిలో బాబూ బాయి మిస్త్రీ దగ్గర ఫస్ట్ అసిస్టెంటుగా చేస్తుండేవారు. ఆయన్ని మద్రాసు పట్టుకు వచ్చారు నందమూరి సోదరులు. మొదటి సినిమాతోనే రవికాంత్ దక్షిణాదివారికి ఆప్తుడయిపోయారు.

సీతా రామ కల్యాణం సినిమాలో మరొక ఆకర్షణ రంభ గా కుచలకుమారి నాట్యం. అప్పట్లో తమిళ సినిమా అభిమానుల కలల సుందరి టి ఆర్ రాజకుమారి కి ఈవిడ బంధువు. కుచలకుమారి నాట్యాలు సినిమాలలోనే కాదు, ఆ రోజుల్లో బయట కూడా చాలా పోప్యులర్. సినిమా వాళ్ళు తమ ఇంట ఎలాంటి వేడుకలు జరిగినా ఈవిడ డ్యాన్సు ప్రోగ్రాం పెట్టేవారు. తనను మోహించిన రావణాసురుని తప్పించుకునేందుకు మామా అని సంబోధిస్తూ వరుస గుర్తు చేస్తుంది సినిమాలో రంభ. వెంటనే రావణుడు “ఇదెక్కడి వరుసే భామా” అని బదులిస్తాడు. అప్పట్లో ఈ డైలాగ్ పెద్ద హిట్.

విశ్వామిత్రుడు తన వెంట రామ లక్ష్మణులను యాగ రక్షణకోసం అడవులకు తీసుకు వెళ్ళటం, తాటక వధ, అహల్య శాపం వంటి సన్నివేశాలు నిజానికి అవుట్ డోర్ లో తీయాలి. కానీ తానే దర్శకత్వ పర్యవేక్షణ చేసినందున బయటకు వెళ్లడం కుదరక ఎన్ టి ఆర్ వాటిని స్టూడియోలో సెట్లు వేసి తీశారు. అదీ గాక సినిమా ఎప్పుడూ సెట్స్ లో నిర్మించి పాత్రోచిత నటన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్నది ఆయన్ ఫిలాసఫీ. లొకేషన్స్ నటీ నటులను డామినేట్ చేయకూడదని ఎన్ టి ఆర్ నమ్మేవారు.

1961 జనవరి 6 వ తేదీన సంక్రాంతి కానుకగా సీతా రామ కల్యాణం విడుదలయ్యింది. జనం బ్రహ్మ రధం పట్టారు. కాసుల వర్షం కురిపించారు.

ఈ సినిమాలో చిన్ననాటి రామ లక్ష్మణులుగా సుబ్రహ్మణ్యం , నాగ రాజు వేశారు. వీళ్లిద్దరూ లవ కుశ సినిమాలో బాల హీరోలు. లవ కుశ సినిమా 1958 వేసవిలో మొదలై ఏడాదిపాటు షూటింగ్ జరిగి ఓ రోజు డబ్బు లేక ఆగిపోయింది. నెలా , రెండు నెలలు కాదు. ఏకం గా 4 ఏళ్లు ఆగిపోయింది. కానీ అందులో లవ కుశుల ప్రతిభ గురించి సినిమా పరిశ్రమ అంత మారు మ్రోగిపోయింది. ఎన్ టి ఆర్ స్వయం గా వీళ్లిద్దరి ప్రతిభా చూసినందున తన సినిమాలో బాల రామ లక్ష్మణులుగా వేయించారు.

లవ కుశ సినిమా ఆ తరువాత 1962 లో మళ్లీ ఆరంభమయి ఆ మరుసటి ఏడాది 29-03-1963 న విడుదలై చరిత్ర సృష్టించింది. ముఖ్యం గా నాగరాజుకు అప్పట్లో మంచి పేరు వచ్చింది. సీతా రామ కల్యాణం సినిమాలో అతని చేత ఎన్ టి ఆర్ ప్రహ్లాదుని వేషం కూడా వేయించారు. గోవింద మాధవా దామోదరా అన్న అవతార పాటలో నాగరాజు ప్రహ్లాదునిగా కూడా కనిపిస్తారు.

జనకుడి కొలువులో ఒక చిన్న పాత్రలో కస్తూరి శివరావు కనిపిస్తారు. ఇప్పటి తరానికి తెలియనిది కాదు కాని, తెలుగు సినిమా పరిశ్రమలో అతనో పెద్ద సంచలనం. శివరావంటే చాలు జనం ఆ సినిమాకు విరగబడే వారు. అందగాడు కాకపోయినా, అతను మంచి మాటకారి. తమాషా పర్సనాలిటీ. ఏమీ చేయకుండానే తన రూపం తోటీ, ముఖం తోటీ జనానికి నవ్వు తెప్పించేవారు. హాస్యం పేరుతో ఈ నాడు మనం వింటున్న ద్వంద్వార్దాలకు అతడే ఆద్యుడు. 1950 లో వచ్చిన అక్కినేని సినిమా శ్రీ లక్ష్మమ్మ కధ సినిమా దీనికి శ్రీకారం చుట్టింది. అలా అతను పామర జనాన్ని బాగా ఆకట్టుకున్నాడు. చందమామలా ప్రకాశించాడు. డబ్బు, కీర్తి అతన్ని నేలమీద నిలవనియ్యలేదు. అన్ని వ్యసనాలకు బానిసని చేశాయి. స్వంతంగా సినిమా తీయించి సర్వ మంగళం పాడించాయి. శివ రావు ఆర్ధికం గా చితికి పోయారు. ఆరోగ్యపరంగా చిక్కిపోయారు. ఈ మధ్య కాలం లో రేలంగి బాగా పుంజుకున్నారు. శివ రావును జనం మరిచిపోయారు. సినిమా పరిశ్రమ వదిలి వేసింది. అలాంతి స్థితిలో అతన్ని పిలిచి ఎన్ టి ఆర్ ఈ వేషం ఇప్పించారు. అయినా అతన్ని పరిశ్రమ నమ్మ లేదు. బాగా వెలిగిన రోజుల్లో చుట్టూ పాతికమందిని వెంటేసుకుని తిరిగే శివరావు ఆ తరువాత చాలా అనామకంగా మరణించారు. నటుడన్న వాడు ఎలా మెలగకూడదన్న విషయానికి ఏ తరానికైనా అతనో పాఠ్య గ్రంధం.

సీతా రామ కల్యాణం లో సీతగా ఒక కొత్త తారను పరిచయం చేయాలని ఎన్ టి ఆర్ అనుకున్నారు. పదహారేళ్ల ముగ్ధ కోసం అన్వేషణ ఆరంభించారు. అంతకుముందు ఆయన తీసిన పాండు రంగ మహత్మ్యం సినిమాలో బి సరోజాదేవిని పరిచయం చేశారు. ఆవిడకు మంచి ప్రశంసలు లభించాయి. దానితో సీత వేషం కోసం చాలామంది పోటీ పడ్డారు. ఒక రోజు ఎన్ టి ఆర్ కు ఎవరో చెప్పారు. మణి అనే కొత్త అమ్మాయి పరిశ్రమకు వచ్చిందనీ, రాణీ రత్న ప్రభ సినిమాలో నాట్య సన్నివేశం లో చాలా బాగా చేసిందనీ, ఎన్ టి ఆర్ ఆ నాట్య సన్నివేశం ప్రత్యేక ప్రదర్శన వేయించుకు చూశారు. తను వూహించుకున్న సీత పాత్రకు ఈ కొత్త అమ్మాయి చాలా బాగా నప్పుతుందని ఆయనకు అనిపించింది. వెంటనే ఆమెను సీత వేషానికి నిర్ణయించేశారు. ఆ అమ్మాయే తదనంతర కాలం లో వందలాది సినిమాల్లో నటించి ఆ తరం వారిని అమితంగా అలరించిన గీతాంజలి! సీతా రామ కల్యాణం సినిమాలో ఆమె పేరు మణి అని ఉంటుంది. మొదటి సినిమా అనో ఏమో ఎన్ టి ఆర్ ఇందులో మణికి వాయిస్ డబ్ చేశారు. టి జి కమలాదేవి సీతకు గాత్ర దానం చేశారు.

ఈ సినిమాలో మండోదరి వేషం వేసిన బి సరోజా దేవికి కూడా వాయిస్ వేరే వారి చేత చెప్పించారు. సీతా రామ కల్యాణం సినిమాలో మరో విశేషం ఉంది. ఈ సినిమాలో గీతాంజలి అక్కయ్య స్వర్ణ కూడా నటించారు. ఆమెది శూర్పణక వేషం. ఆమె కూడా బాగుండేది. కాని ఎందుకనో ఆ తరువాత సినిమాల్లో పెద్దగా వేయలేదు.

ఇక రాముని కధ. స్క్రిప్ట్ పని అయి నటీ నటుల ఎంపిక మొదలెట్టాక అప్పుడు చెప్పారు ఎన్ టి ఆర్ తను రావణుడి వేషానికే పరిమితం అవుతున్నానని. రాముడి వేషాన్ని యువ తరం నటుడి చేత వేయిద్దామనుకుంటున్నాని. తమ్ముడి గుండెల్లో రాయి పడింది. ఎన్ టి ఆర్ కాక ఆ వేషం ఇంకెవరు వేసినా పండదని త్రివిక్రమరావు గారి గాఢ నమ్మకం. కానీ ఎన్ టి ఆర్ ఆలోచనలు వేరు. 20 ఏళ్ళ కుర్రాడి చేత ఆ వేషం వేయిస్తే రక్తి కడుతున్నదన్నది ఎన్ టి ఆర్ అభిప్రాయం. ఎన్ టి ఆర్ వూహల్లో రూపు దిద్దుకున్న రావణాసురుడు స్థితప్రజ్ఞుడు. లోక నీతినీ లోక రీతినీ బాగా ఆకళింపు చేసుకున్న వాడు. రాముడేమో బాలుడు. ఇంకా యవ్వనారంభంలో ఉన్న కుర్ర వాడు. ఆ వేషం యువ తరం హీరో చేత వేయిస్తేనే తను అనుకున్న ఎఫెక్ట్ వస్తుంది.

ఆయన ఆ ప్రయత్నంలో వుండగా ఒకసారి చెప్పులు కొనుక్కునేందుకు పాండీ బజార్ వెళ్ళారు. అక్కడ షాపులో హరనాధ్ తారసపడ్డారు. ఏం బ్రదర్ ఎలా ఉంది ప్రోగ్రస్ అంటూ మామూలుగా పలకరించారు. హరనాధ్ తను చేస్తున్న సినిమాలగురించి వివరం గా చెప్పి “నేను ఇంకా మీ దృష్టిలో పడినట్లు లేను” అంటూ నసిగారు. ఎన్ టి ఆర్ అతన్ని నఖ శిఖ పర్యంతం పరిశీలనగా చూసి “మా సినిమాలో రాముడి వేషం వేద్దురు గాని” అంటూ వెళ్లిపోయారు.

వారం రోజుల తరువాత ఎన్ ఏ టి కార్యాలయమునుంచి హరనాధ్ ఇంటికి కారు వచ్చింది. అక్కడ ఆఫీసులో హరనాధ్ కు మేకప్ టెస్ట్ చేశారు. ఆ రోజుల్లో మేకప్ టెస్ట్ చేసి ఆ తరువాత ఆ నటుడు పనికి రాడని తెలిస్తే నటునిగా అతని జీవితం పరిసమాప్తమే. హరనాధ్ బాగా భయపడిపోయారు. ఎన్ టి ఆర్ దగ్గరకు వెళ్ళి ” నా మీద నాకు నమ్మకముంది. మీ టెస్టులో పాల్గొని ఫైల్ అయితే నా భవిష్యత్తు ఏమవుతుందో కూడా తెలుసు. తెలిసీ మీ టెస్టులో పాల్గొంటున్నాను” అన్నారు. ఎన్ టి ఆర్ ఏమీ మాట్లాడలేదు. నవ్వేశారంతే. తనే స్వయం గా హరనాధ్ కు నుదుట తిలకం దిద్ది టెస్టు కు సిద్ధం చేశారు. ఆ తరువాత తెలుగు సినిమాల్లో హీరోలుగా వెలిగిపోయిన కొందరు నటులు కూడా ఆ రోజు టెస్టు లో పాల్గొన్నారు. కానీ హరనాధే ఎంపిక అయ్యారు.

Also READ:   The Art of Conversation

లక్ష్మణుడి గా శోభన్ బాబు, భరతుడిగా కొమ్మినేని శేష గిరి రావు ఎంపిక అయ్యారు. కొమ్మినేని ఆ తరువాత 1967 లో వచ్చిన గొప్ప వారి గోత్రాలు సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.

పౌరాణిక పోషించేటప్పుడు ఎన్ టి ఆర్ చాలా నిష్టగా ఉండేవారు. కానీ హరనాధ్ మాత్రం రాముడి వేషం వేసుకుని సిగరెట్ కాల్చే వారు. ఈ విషయం తెలిసి ఎన్ టి ఆర్ చాలా బాధ పడే వారు.. హరనాధ్ ను మందలించేవారు. కానీ ఎంత ప్రయత్నించినా హరనాధ్ ఆ బలహీనతను వదులుకోలేక పోయారు. ఎన్ టి ఆర్ చూడకుండా చాటుగా తన పని పూర్తి చేసుకు వచ్చేవారు. ఎన్ టి ఆర్ చెప్పిన నియమాలేవీ తాను పాటించలేకపోయానని, ఆ తరువాత ఒక సందర్భంలో హరనాధ్ స్వయం గా ఈ విషయాలన్నీ అంగీకరించారు కూడా. సీతా రామ కల్యాణం సినిమాలో హరనాధ్ చాలా బాగా నటించారు. ఎన్ టి ఆర్ అమితం గా సంతోషించి తన మిత్రుడు బి ఏ సుబ్బారావు తీసిన భీష్మ సినిమాలో సిపారసు చేసి మరీ హరనాధ్ కు శ్రీ కృష్ణుడి పాత్ర ఇప్పించి తాను వయో వృద్ధుడైన భీష్మ పాత్ర వేశారు. ఎంత వయసు వచ్చినా కొత్త కొత్త హీరోయిన్లతో యుగళ గీతాలకే పరిమితమైన హీరోలు కొందరైతే, వయసులో ఉండగా వృద్ధుడి (భీష్మ) ప్రతినాయక (రావణ) , బృహన్నల , బ్రహ్మ నాయుడు వంటి పాత్రలలో తాను జీవించి, ఆ యా సినిమాలలో అందగాడైన యువ నటుడిని యుగళ గీతాలలో నటించడానికి ఒప్పుకున్న కేరెక్టర్ నటుడు ఎన్ టి ఆర్. భీష్మ సినిమాలో హరనాధ్ అంద చందాలు అపురూపం. ఒక రకం గా ఆ అందచందాలే అతనికి శాపమయ్యాయి. పతనం వైపుకు నెట్టాయని కొందరి విశ్లేషణ.

నా అభిమాన పాత్ర రావణ – ఎన్ టి రామారావు

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా అభిమానుల నీరాజనాలు అందుకున్న నందమూరి తారక రామారావు 1961 జనవరి 18 న రాసిన వ్యాసం ఒకటి ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. రావణాసురిడి పాత్రధారణ అంటే తనకెందుకు ఇష్టమో ఆయన స్వయంగా వివరించిన ఆ వ్యాసం యథాతథంగా…

నేను పుష్కరంగా నటుడుగా ఉన్నాను. మీ అభిమానం చూరగొన్నాను. వెండి తెర మీద నేను ఇలా నిలిచి ఉండడానికి, మీ అభిమానం సంపాదించగలడానికి కారణం నేను ధరించిన పాత్రలేనని నా విశ్వాసం.

అభిమాన పాత్ర ధరించి అభిలాష తీర్చుకొనడం కన్న ఏ నటుడూ ఆశించేది మరొకటి లేదు. నటనకు చోటు దొరికే బలమైన పాత్రలంటే నాకు చాలా అభిమానం. కాలేజీ రోజుల్లో నాటకాలు వేసేటప్పుడు కూడా అంతే. ఆడవేషం వేయమంటే ఎక్కడ లేని పౌరుషమూ వచ్చేది. వేడి, వాడిగల పాత్రలు నాకు చాలా ఇష్టం. బెజవాడ కాలేజీలో మా మాష్టారు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు నా చేత ఆడవేషం వేయించాలని పట్టుపట్టడం… అదో గమ్మత్తు కథ! రాచమల్లుని యుద్ధ శాసనంలో నాగమ్మ పాత్ర నాకు ఇచ్చారు. పౌరుషానికి కావాలంటే మీసం తీయకుండానే ఆ పాత్ర ధరిస్తానని నేను భీష్మించాను.

అలా భీష్మించుకునే అలవాటు అప్పటికి, ఇప్పటికీ నాలో వుంది. భీష్ముని వంటి గంభీర పాత్రలన్నా వీరగాంభీర్యాలు, ఔదార్యం ఉట్టిపడే పాత్రలన్నా నాటికీ నేటికీ నాకు మక్కువ. తొలిసారి ‘భూకైలాస్’ చిత్రంలో రావణపాత్ర ధరించినప్పటి నుండి నాకు అదో విశిష్ట పాత్రగా గోచరించింది.

‘రావణ’ అనగానే స్ఫురించేది వికృతమైన ఏదో భయంకర స్వరూపం, స్వభావం. సామాన్య దృష్టికి ‘రావణుడు’ ఉగ్ర కోపి, క్రూరుడు అయిన రాక్షసుడుగా కన్పిస్తాడు.

కాని… రామాయణం తరచి చూసినా, పూర్తిగా అర్థం చేసుకున్నా మనకు తోచే, కనిపించే ఆకృతి వేరు! శ్రీ మహావిష్ణువే అతని అంతానికి అవతార మెత్తవలసి వచ్చిందంటే ఆ పాత్రలో ఎంతో అసామాన్యమైన ఔన్నత్యం ఉండి ఉండాలి. దానికి తోడు అతని వంశం సాక్షాత్తూ బ్రహ్మ వంశం. పులస్త్య బ్రహ్మ పౌత్రుడు. విశ్వవసువు పుత్రుడు. పుట్టుకచేత ఈతడు పుణ్యాత్ముడు. అంతే అని కొట్టివేయడం సాధ్యం గాదు. సద్బ్రాహ్మణ వంశ సంజాతుడయిన దశకంఠరుడు పునీతమైన జీవితం గడిపినవాడు.

సూర్యోదయాత్పూర్వమే నవకోటి శివలింగాలను స్వకల్ప మంత్రోచ్చారణతో పూజించే శివ పూజా దురంధరుడు రావణుడు. తలచినదే తడవుగా కైలాసవాసిని ప్రత్యక్షం చేసుకోగల్గిన మహాతపస్వి.

ఇందుకు తగిన పురాణ కావ్య నిదర్శనాలు జన శ్రుతులు ఎన్నో ఉన్నాయి. దశకంఠ రావణ విరచితమైన ‘మహాన్యాసం’ వల్లించదనిదే మహాదేవుని అర్చన పూర్తి కాదు. అతడెంత సంస్కృతీ పరిజ్ఞానం కలవాడో చూడండి.

అతని పాండితిలో లౌకిక, పారలౌకిక శిఖరాలు మహోన్నతమైనవి. ఆధ్యాత్మిక చింతన, తనకు అతీతమైన దైవత్వం పట్ల భక్తి విశ్వాసాలు అతనిలో ఉన్నాయి.

రసజ్ఞుడుగా, కళాప్రపూర్ణుడుగా రావణుడు అద్వితీయుడు. త్రిలోకాలలోనే సాటిలేని వైణికుడు. సామవేదకర్త. తనపై అలిగిన శంకరుని ప్రీతికి పొట్టచీల్చి ప్రేగులతో రుద్రవీణ కట్టి జీవనాదంతో పార్వతీశుని తన ముందుకు రప్పించుకొనగల్గిన సంగీత కళాతపస్వి.

ఇక శాస్త్రజ్ఞుడుగా మాత్రం రావణుడు సామాన్యుడా? ఈనాడు మన శాస్త్రజ్ఞులు చేరాలని కలలకనే నభోమండలాలన్ని ఏనాడో చూచిన శాస్త్ర పరిజ్ఞాని. వాతావరణాన్నీ, ఋతుక్రమాన్నీ హస్తగతం చేసుకుని తన రాజ్యాన్ని సుభిక్షం చేసుకున్న స్థితప్రజ్ఞుడు. అనేక మారణాయుధాలను, మంత్రతంత్రాలను, క్రియా కల్పవిద్యలను, ఆకళించుకున్న శాస్త్రవేత్త. పుష్పక విమానంలో వాయుగమనం చేశాడని, దివిజ లోకాల మీద దండెత్తి అష్ట దిక్పాలకులను తన పాదాక్రాంతులుగా చేసుకున్నాడని వర్ణించారు.

మేఘనాథుని జనన కాలంలో వక్రించిన శనిపై కినిసి గదాఘాతంతో కుంటివానిని చేయడమే అతని జ్యోతిష శాస్త్ర ప్రజ్ఞకు నిదర్శనం.
ఆవేశంలో ముక్కోటి ఆంధ్రులను తలపించే ఈ రావణబ్రహ్మ ఐరావతాన్నే ఢీకొనడం, అలిగినవేళ కైలాసాన్నే కంఠాలపై మోయడం అతని భుజబలదర్పానికి గుర్తులు.

రావణుడు కారణజన్ముడైన మహనీయుడు. పట్టిన పట్టు విడువని కార్యసాధకుడు. అభిమానాన్ని ఆరాధించే ఆత్మాభిమాని. ఏ పరిస్థితులకు తల ఒగ్గని ధీరుడు. అతన్ని ఈ రూపేణ తలచుకొనడం పుణ్య సంస్మరణమే.

ఈ రామాయణస్థమైన నిదర్శనాల వల్ల మనకు కనుపించే వ్యక్తి యెవరు? ఆ కనుపించే రావణుడు ఎటువంటివాడు?బ్రహ్మతేజస్సుతో నిర్వక్ర పరాక్రమ బలదర్పితుడై, మహాపండిత ప్రకాండుడై, శివపూజా ధురంధరుడై, శాస్త్రవేత్త అయిన మహా తపస్వి.

కాని… ఇంతటి మహో దాత్తుడు రాక్షసుడుగా, శరుడుగా పరిగణింపబడటానికి గల కారణమేమిటి?

అతని వైష్ణవ ద్వేషం ముఖ్యంగా ఒక కారణం. తాను శైవుడు కావడంలో తప్పు లేదు. ఇష్టదైవాన్ని నమ్మి కొలవడంలో అపకారమూ లేదు. కాని తన మతాన్ని ఇతరుల మీద రుద్ది పరమత ద్వేషంతో వైష్టవ పూజలాటంకపరచి విష్ణుద్వేషిగా హింసాకాండకు ఉపక్రమించడమే అతడంటే మనం భయభ్రాంతులమయ్యేటట్లు చేసినది. పరనారీ వ్యామోహమే నలకూబరుని శాపానికి దారితీసింది. అతని పతనానికి కారణమైనది. ఈ రెండూ అతనిపై దెబ్బతీసినట్లు మరేవీ తీయలేదు. అహంభావంలో కూడా అతనికతనే సాటి. తనలో తనకు ఎంత నమ్మకమున్నా ఇతరులంటే నిర్లక్ష్యం, చులకన చేయడం, నందీశ్వరుని శాపానికి దారి తీసింది. అతని వంశమంతా వానర బలంతో హతమైనది.

లక్ష్మీ అవతారమూర్తి అయిన మాతలుంగిని చెరపట్టబోయనప్పుడు పరాజయం పొందడం, వేదవతిగా ఉన్న ఆమెను తాను దక్కించుకొనలేకపోడం, సీతగా జన్మించిన ఆమెను స్వయంవరంలో సాధించబూని పరాభూతుడు కావడం, కడకు సీతను లంకలో చెఱపెట్టే వరకు అతడు మూర్ఖించడం- ఇవన్నీ పై మహత్తర గుణాలతో జోడించి చూస్తే రావణుడు ఎలాంటి వాడుగా మనకు కనిపిస్తాడు? నాకు అతడు దుర్మార్గుడుగా కనిపించడు. పట్టుదలగలవాడుగా కనిపిస్తాడు. అతనిలో లేని రసం లేదు. కావలసినంత సరసం, ఉండరానంత విరసం ఉన్నాయి. జీవన్నటులలలో మేటి. అటువంటి పాత్ర అపురూపమైనదని నా నమ్మకం. అలాంటి పాత్ర ధరించాలని నా అభిలాష. అదే నన్ను ఈ పాత్రధారణకు ప్రోత్సహించింది.

రావణుడు వికృతాకారుడు కాదు. పెద్దపొట్టతో, బుర్రమీసాలతో, అనవసర ఘింకారాలతో వికట ప్రవృత్తి గలిగిన మదోన్మత్తుడు, అలక్షణుడు కాదు. మానవాతీతుడైన ఒక మహత్తర వ్యక్తి, శక్తి. కుండెడు పాలలోనయినా ఒక విషం బొట్టు పడితే పాలన్నీ విషం అయినట్లు ఇన్ని సద్గుణాలు కలిగినా, సద్బ్రాహ్మణ వంశసంజాతుడయిన రావణునిలో ఒక్క దుర్గణమే అతని నాశనానికి దారితీసింది.

రావణ పాత్ర సర్వావేశ సంకలితం. ఆనందం, ఆవేశం; అనుగ్రహం, ఆగ్రహం; సహనం, అసూయ; భక్తి, ధిక్కారం… ఇన్ని ఆవేశాలు, కావేషాలు రావణుని తీర్చిదిద్దాయి. ఈ పాత్ర సజీవం కావడం వల్లనే నన్నింతగా ఆకర్షించింది.

ఈ మహాపాత్ర ధరించగలిగినందుకు ధన్యుడిననుకుంటాను. రావణుని పరస్పర విరుద్ధ ప్రవృత్తులన్నీ వ్యక్తీకరించడానికి ప్రయత్నించాను. ఎంతవరకు సఫలుడనైనదీ అభిమానులు, పాఠకులు నాకు తెలియజేస్తే సంతోషిస్తాను.

పౌరాణిక గాథలలో కనుపించే అద్భుతమైన సజీవ, పాత్రలలో రావణ పాత్ర ముఖ్యమైనది. అది నా అభిమాన పాత్ర. (ఆంధ్ర సచిత్ర వార పత్రిక 18-01-1961)

శ్రీ సీతా రాముల కల్యాణము చూతము

జయత్వధ

కాన రారా కైలాస నివాస

పాడవే రాగమయి

వేయి కన్నులు చాలవుగ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *