సంక్రాంతి స్పెషల్ – అరిసెలు

సంక్రాంతి స్పెషల్ .

సంక్రాంతి అనగానే ప్రతి తెలుగు ఇంటిలో కొత్త బియ్యము , కొత్త బెల్లము తో అరిసెలు తప్పనిసరిగా చేసుకుంటారు .

పల్లెటూరిలో చాలా మంది నేతి అరిసెలు చేసుకుంటారు .

పైన పూస కట్టి ఈ నేతి అరిసెలు చాలా రుచిగా ఉంటాయి .

దాదాపుగా నెల రోజుల పైగా ఈ అరిసెలు నిల్వ ఉంటాయి .

పంచదార అరిసెల కన్నా బెల్లం అరిసెలే చాలా రుచిగా ఉంటాయి .

అందరికీ ఉపయోగించే అరిసెల తయారీ విధానము రాబోయే సంక్రాంతి సంక్రాంతి పర్వదిన సందర్భముగా మీ అందరి కోసం .

అరిసెలు తయారీ విధానము .

ఒక కె. జి . బియ్యము ముందు రోజు రాత్రి నీళ్ళలో నాన పోసుకోవాలి .

మరుసటి రోజు బియ్యాన్ని వడ కట్టి మిల్లులో మెత్తని పిండిలా వేయించుకోవాలి .

Related:   చిల్లీ చికెన్

పిండి పట్టించి వెంటనే జల్లెడ పోసుకుని ఒక గిన్నెలో పోసి పిండిలోని తడి ఆరకుండా గట్టిగా నొక్కి పెట్టి ఉంచాలి .

ఒక వెడల్పాటి పాత్రలో ముప్పావు కిలో బెల్లం మెత్తగా పొడి చేసి వేసి బెల్లం మునిగే వరకు నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టి బెల్లం నీళ్ళలో వేసి చూస్తే పాకం ఉండగా అయ్యే విధంగా పాకం రానివ్వాలి .

అంటే పళ్ళెంలో నీళ్ళు పోసి పాకం అందులో వేసి చూస్తే ఉండలా కట్టే విధంగా పాకం రావాలి .

పాకం లో నాలుగు చెంచాల నెయ్యి వెయ్యాలి .

తర్వాత పాకంలో అర స్పూను యాలకుల పొడి వేసి స్టౌ మీద నుండి దింపి వెంటనే బియ్యపు పిండి పోస్తూ గరిటతో గబ గబా కలియ బెట్టు కోవాలి .

Related:   కాకరకాయ కారం

పాకం చల్లారక ముందే కలియబెట్టటం పూర్తవ్వాలి .

దింపగానే మరో నాలుగు చెంచాలు నెయ్యి వెయ్యాలి .

అలా రెండుసార్లు నెయ్యి వేసుకుంటే పాకం రుచిగా మృదువుగా ఉండటమే కాక ఉండలుగా చేయటానికి అనువుగా వస్తుంది .

ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి ముప్పావు కే .జి . నూనె పోసి నూనెను బాగా కాగనివ్వాలి .

చలిమిడి చల్లారగానే పిండిని ముద్దలుగా చేసుకుని ఒక ప్లాస్టిక్ కవరు మీద చేతికి నూనె రాసుకుని ముద్దను చేతితో పల్చగా వత్తుకుని కాగిన నూనెలో వేసి చక్కగా రంగు వచ్చే వరకు వేయించుకొని , అరిసెల చెక్కల మధ్య పెట్టి గట్టిగా నొక్కుకొని నూనె పూర్తిగా పోయాక అరిసెలు తీసి వెడల్పాటి పళ్ళెంలో కాస్త ఆరనిస్తే బాగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి .

Related:   చుక్కకూర పచ్చడి

మెత్తగా కావాల్సిన వారు కొంచెం నొక్కితే సరిపోతుంది .

అరిసెలు చేయడానికి మరో మనిషి సాయం ఉంటే సులువుగాను , త్వరగాను అయిపోతుంది .

ఈ అరిసెలు నెల రోజులు పైగా నిలవ ఉంటాయి .

బాలింతలు ఆర్నెల్ల వరకు అరిసెలు తినకూడదు అని పెద్దలు చెప్తారు .

లోగడ ప్రయాణాల్లో నెల రోజులు పైగా నిల్వ ఉంటాయని అందరూ అరిసెలు చేసుకుని వెంట తీసుకుని వెళ్ళేవారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *