ఆధ్యాత్మిక ఆచార్యుడు ఆంజనేయుడు

Spread the love

ఆధ్యాత్మిక ఆచార్యుడు ఆంజనేయుడు.

తాత్త్వికదృష్టితో రామాయణమును దర్శిస్తే అందులో పరమార్ధతత్త్వం అవగతమౌతుంది. ఆంజనేయుని బుద్ధి, యోగత్వం, శౌర్య, సాహస పరాక్రమలతో కూడిన సుందరకాండమును పరిశీలిస్తే అత్యద్భుత ఆధ్యాత్మిక రహస్యార్ధములు అనేకం గోచరిస్తాయి. ఆంజనేయుడు నిర్వర్తించిన ప్రతికార్యమూ ఆధ్యాత్మిక సాధకునికి చక్కటి సందేశమే.

శ్రీ ఆంజనేయుడు శ్రీ విద్యోపాసకుడు :

మానవశరీరం పంచభూతాత్మకం. ఈ పంచభూతములను సమన్వయ పరచడమే యోగసాధన పరమార్ధం. ఈ పంచభూతములను సమన్వయపరిచే కుండలినీ యోగీశ్వరుడు శ్రీ ఆంజనేయుడు. ‘వాయు’పుత్రుడైన ఆంజనేయుడు ‘భూమి’సుత అయిన సీతమ్మ అన్వేషణ కొరకు ‘ఆకాశ’మార్గంబున బయలుదేరి,’జల’ధిని దాటి, సీతమ్మ దర్శనమనంతరం లంకను ‘అగ్ని’కి ఆహుతి చేసిన మహామహిమోపేతుడు శ్రీ విద్యోపాసకుడు
శ్రీఆంజనేయుడు.

పంచముఖాంజనేయ స్వరూపం – పంచభూతముల సమన్వయతకు సూచనం

వానరరూపం – వాయుతత్త్వం. గరుడరూపం – ఆకాశతత్త్వం.
నరసింహరూపం – అగ్నితత్త్వం. వరాహరూపం – భూమితత్త్వం.
హయగ్రీవరూపం – జలతత్త్వం.

ఆంజనేయుడు ఆధ్యాత్మికసాధకులకు ఆచార్యుడు

ఆంజనేయుడు శతయోజన విస్తీర్ణ సాగరాన్ని దాటి, లంకలో ప్రవేశించి, సీతాన్వేషణం చేసి కృతకృత్యుడు అయిన ఘటనల్నీ పరిశీలిస్తే సాధకునికి కావలసినది ఏమిటో తెలుస్తుంది.

యస్య త్వేతాని చత్వారి వానరేన్ద్ర చథా తవ /
ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి //

సాధకునికి నాలుగు లక్షణాలుండాలి. అవి ధృతి (దృఢ నిశ్చయం), దృష్టి (ఏకాగ్ర దృష్టి), మతి (బుద్ధి), దాక్ష్యం (దక్షత / సామార్ధ్యం). నూరు యోజనాల పొడవైన సముద్రాన్ని అవలీలగా దాటడం ‘దృఢ నిశ్చయం’.

తనపర్వతంపై విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరిన మైనాకుని విన్నపాన్ని సున్నితంగా తిరష్కరించి, గౌరవంగా చేతితో స్పృశించి, కాలవిలంభన చేయక, రామకార్యమనే లక్ష్యసాధనపట్లే ఏకాగ్రతను చూపడం ‘దృష్టి’. అంగుష్ఠ పరిమాణమును దాల్చి,సురస అనే నాగమాత నోటిలోనికి ప్రవేశించి, వెన్వెంటనే బయల్పడి, ఆమె ఆశీర్వాదం పొంది, ముందుకు పయనించడం ‘బుద్ధి’కుశలత. సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని తన శక్తియుక్తులతో సంహరించి, లంకా నగరాధిదేవత లంకిణిని ముష్టిఘాతంచే నిలువరించగలగడం ‘సామర్ధ్యం’.

Also READ:   శ్రీ గరుడ పురాణం రెండోవ అధ్యాయము (చివరి భాగము)

సాధకునికి తన లక్ష్యాన్ని సాధించాలన్న దృఢమైన నిశ్చయం అత్యవసరం. అలానే తన సాధననుండి ఏమాత్రమూ తొలగక ఏకాగ్రదృష్టిని కలిగియుండాలి. ఈ ఉత్కృష్ట సాధనలో సాధకునికి సాదనారంభంలో ఎన్నో అనుకూల ప్రతికూల బంధకాలు కలగవచ్చు. అనేక సిద్ధులు సిద్ధించవచ్చు. అలానే సాధకుని సామర్ధ్యమును, మానసికస్థైర్యంను, పట్టుదలను పరీక్షించడానికి పెద్దలు పెట్టె పరీక్షలు పలురకాలుగా ఉంటాయి. వీటిని యుక్తితో బుద్ధిబలంతో జయించగలిగే ప్రజ్ఞను కలిగియుండాలి. ప్రతిబంధకాలైన అవరోధాలను పూర్తిగా అధిగమించగలిగే దక్షతను కలిగియుండాలి. ఈ నాలుగు లక్షణాలు కలిగియున్న సాధకుడే కార్యసాధనాసమర్ధుడు.

అఖిలలోకోపకారి ఆంజనేయుడు

యోగత్వం వలన తనకి ప్రాప్తించే అష్టసిద్దులను తన ప్రయోజనంనకు కాకుండా రామకార్యమునకై, లోకహితంనకై ఉపయోగించిన అఖిలలోకోపకారి ఆంజనేయుడు.

{అష్టసిద్ధులు – వివరణ :-

అష్టసిద్ధులు సిద్ధించుటకు ముఖ్యంగా కావలసింది ‘భూతజయము’.
పృధివ్యప్తేజోవాయ్వాకాశము (పృథివ్యప్‌తేజోవాయురాకాశాలనే పంచభూతలంటారు)లను స్థూల భూతములయందును, తత్స్వరూపములైన కఠినత్వాదులయందును, తన్మాత్రలయిన గంధాది సూక్ష్మతత్వములయందును, వాని స్థితులయందును, ఇంద్రియములయందును, వానికర్మలయందును, అంతఃకరణములయందును, తత్ప్రకాశరూపములైన వృత్తులయందును క్రమముగా సంయమనం చేసినచో భూతజయం కలుగును.

అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,
ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః

Also READ:   వినాయక వ్రతకల్పం

అణువులా సూక్ష్మరూపాన్ని పొందడం “అణిమా”సిద్ధి.
అనేక కోట్ల బ్రహ్మాండాల కంటే అధికుడవడం

“మహిమా”సిద్ధి.

పరమాణువుల కంటే తేలిక కావడం “లఘిమా” సిద్ధి, విశేష బరువుగా మారగలగడం “గరిమ”సిద్ధి.
ఇష్టపదార్థాలను పొందగలగడం “ప్రాప్తి”సిద్ధి.
లౌకిక పారలౌకిక పదార్థాలలో దేనిని కావాలంటే దానిని పొందడం “ప్రాకామ్య”సిద్ధి.
భూతములన్నింటిని (పంచభూతములను) వశం చేసుకొనుట “వశిత్వం”.అరిషడ్వర్గమును జయించి, తాపత్రయం లేనివాడై, జితేంద్రియుడై, అపరోక్ష సాక్షాత్కార స్వానుభవము కలిగియుండుట, సర్వమును గ్రహించి ఈశ్వరుని వలె సృష్టిస్థితిలయములకు కారణభూతుడగుట “ఈశత్వం”}

లక్ష్యాలక్ష్యేణ రూపేణ రాత్రౌ లఞ్కా పురీ మయా /
ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్ //
తాను తలపెట్టిన కార్యం ఎంతో గొప్పదగుటచే, ఆ కార్యసాధనకు రాత్రి సమయమే యోగ్యమైనదని తలుస్తాడు. అందుకే హనుమ లంకలో రాత్రిసమయంలో ప్రవేశించాడు. అయితే ఇక్కడ రాత్రి అంటే ఏమిటీ? ఇందులో అంతరార్ధం ఏమిటీ?

ఆధ్యాత్మిక కోణంలో – ఇంద్రియప్రవృత్తులతో పాటు సర్వవిధ మనఃప్రవృత్తులు, బహిప్రవృతాలు కాకుండా
అంతస్స్రోతములై ఉండే తురీయదశయే రాత్రి.

గీతలో కృష్ణపరమాత్మ చెప్పినట్లు –

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ /
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే: //
భూతజాలములన్నింటికిని ఏది రాత్రియో, అది యోగికి పగలు. సమస్త భూతము

లకు ఏది పగలో అది విజ్ఞుడగు ద్రష్టకు రాత్రి. అనగా అజ్ఞానంధాకారములో నుండు జీవులకు ఆత్మానుభూతి లేనందున ఆత్మవిషయమందు వారు నిద్రించుచుందురు. సమస్త ప్రాణులకు అనగా అజ్ఞానులకు ఏది (ఆత్మజ్ఞానం) రాత్రి అగుచున్నదో (అంతరదృష్టికి గోచరించక యుండునో), అట్టి ఆత్మజ్ఞానం నందు యోగి జాగురుకుడై యుండును (ఆత్మావలోకనం జేయుచుండును). దేనియందు ప్రాణులు (అజ్ఞానులు) జాగురూకము లగుచున్నవో (విషయాసక్తితో ప్రవర్తించుచున్నవో), అది ఆత్మావలోకనం చేయు యోగికి రాత్రిగా యుండును. అంటే ఆత్మనిష్టుడు ఆత్మవిషయమై జాగ్రత్తలో నుండి ప్రపంచవిషయమై నిద్రావస్థలో నుండును.

Also READ:   యుద్ధ నియమాలు

రామ – హనుమల బంధం ఏమిటంటే – ప్రభు – సేవకుడు;భగవానుడు – భక్తుడు; గురువు – శిష్యుడు
అటుపై వీరి బంధం “ఏకత్వం”.
ఓసారి రామునితో హనుమ ఇలా అంటాడు –

దేహదృష్ట్యా తు దాస్యోహం జీవదృష్ట్యా త్వదంశకః /
ఆత్మదృష్ట్యా త్వమేవాహమితి మే నిశ్చితా మతి: //

ఈ శ్లోకం పరిశీలిస్తే సాధకునికి అన్నీ అవగతమౌతాయి. బలం ధైర్యం నేర్పు ఓర్పు బుద్ధి శక్తి సామర్ధ్యం తదితర సుగుణాలతో అనేక ధర్మకార్యాలు చేసిన ‘కర్మయోగి’ ఆంజనేయుడు. రామభక్తిరసంలో మునకలు వేసి దాసోహం అంటూ తనని తాను పరిపూర్ణంగా శ్రీరామచంద్రునికి అర్పించుకొని సోహం స్థితికి (అద్వైతస్థితికి) చేరుకున్న ‘భక్తియోగి’ ఆంజనేయుడు. సీతమ్మతల్లి (పరదేవత), రాముని(పరమాత్మ)లచే ఉపదేశములు పొంది, మనల్ని తరింపజేస్తున్న ‘జ్ఞానయోగి’ ఆంజనేయుడు. భక్తితో మనస్సును పూజాప్రసూనంగా సమర్పించి, జ్ఞానంచే జీవేశ్వరుల ఏకత్వాన్ని గ్రహించి, నిష్కామ కర్మాచరణలతో “భవిష్యద్బ్రహ్మ” అయినాడు ఆంజనేయుడు.🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *